సీఎం చైనా పర్యటన సక్సెస్
పరిశ్రమలకు పచ్చజెండా ఊపిన తెలంగాణ
* నేడు రాష్ట్రానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్ బృందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ ఇమేజీని ప్రపంచానికి పరిచయం చేయటంతోపాటు రాష్ట్రానికి విదేశీ కంపెనీలు, పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆహ్వానించే లక్ష్యంతో కొనసాగిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళవారం హాంకాంగ్‌లో ఉన్న సీఎం బృందం బుధవారం ఉదయం అక్కణ్నుంచి బయలుదేరి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనుంది.
పది రోజుల ఈ పర్యటనతో చైనాలోని వివిధ కంపెనీలు తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు రావటం శుభ సూచకం. రాష్ట్రంలో కొత్తగా అమలవుతున్న నూతన పారిశ్రామిక విధానానికి ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడింది. ‘పెట్టుబడులతో తరలి రండి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది..’ అని స్వయంగా భరోసా ఇవ్వటం ద్వారా పారిశ్రామికవేత్తల దృష్టిని తెలంగాణ వైపు మళ్లించటంలో సీఎం కృతక్యతులయ్యారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు చాటిచెప్పటంతోపాటు డేలియన్, బీజింగ్, షాంఘై, షెంజెన్, హాంకాంగ్‌లలోని పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించటం ఆశించిన ఫలితాలు తెచ్చిపెట్టాయి. చైనాలో పేరొందిన లియో గ్రూపు, షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఒక్కోటి రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులతో విద్యుదుత్పత్తి పరికరాల తయారీకి ముందుకొచ్చాయి. దీంతోపాటు చైనాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో మేటి సంస్థ మకేనా, సెల్‌కాన్ కంపెనీలు హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీల తయారీ యూనిట్‌లు నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
అధునాతన సదుపాయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న షుజు, షెంజెన్ ఇండస్ట్రియల్ పార్కులను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. హైదరాబాద్‌లోనూ అదే స్థాయి ప్రమాణాలతో పారిశ్రామిక పార్కును నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని బ్రిక్స్ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరపటం తో పెట్టుబడుల సమీకరణ దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసినట్లయింది.
హాంకాంగ్‌లో బిజినెస్ సెమినార్
తెలంగాణలో పెట్టుబడులకు తరలిరావాలని హాంకాంగ్‌లోని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంది. చైనా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ బృందం సోమవారం హాంకాంగ్ చేరుకుంది. మంగళవారం ఉదయం అక్కడి రెన్యాసెన్స్ హార్బర్ వ్యూ హోటల్‌లో ఏర్పాటు చేసిన బిజినెస్ సెమినార్‌లో సీఎం పాల్గొన్నారు.
‘తెలంగాణలో హాంకాంగ్ కంపెనీలకు ఉన్న వ్యాపార అవకాశాలు..’ అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. అక్కడి భారత కాన్సుల్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ యూనిట్ చైర్మన్ అరుణాచలం అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అమలు చేసిన నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతుల పద్ధతి, నిర్ణీత కాలవ్యవధిలో పరిశ్రమలకు ఇచ్చే క్లియరెన్స్‌లకు సంబంధించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులపై రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రసంగించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి ముచ్చటించారు. అనంతరం కాన్సుల్ జనరల్ సహా పారిశ్రామికవేత్తలతో కలసి విందులో పాల్గొన్నారు.
బుద్ధ విగ్రహం సందర్శన...
సెమినార్ అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం హాంకాంగ్‌లోని లాంటావ్‌లో ఉన్న విశ్వవిఖ్యాత ‘తియాన్‌తాన్ బుద్ధ’ విగ్రహాన్ని సందర్శించింది. దాదాపు 202 టన్నుల కంచు లోహంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.