Telangana Irrigation
-
రైతుబంధు అక్రమార్కులకు షాక్.. రూ. 300 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూముల బదలాయింపు జరగకపోవడంతో, రైతుల పేరిట దర్జాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం తీసుకుంటున్న అక్రమార్కులకు షాక్ తగిలింది. భూముల లెక్కలు పక్కాగా తేలడంతో, ప్రాజెక్టుల కిందికి వచ్చే సుమారు లక్షా యాభై వేల ఎకరాల భూమిని ఇరిగేషన్ శాఖ స్వాధీనం చేసుకుంది. మ్యుటేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆర్థిక భారం తగ్గింది. అక్రమార్కులకు ఏటా కనీసంగా రూ.300 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రాజెక్టుల ముంపు భూములతో పాటు, గుట్టలకు, ఎప్పుడో ఏర్పడిన కాలనీల భూములకు సైతం కొందరు అక్రమార్కులు.. రైతుల పేరిట ‘రైతుబంధు’ సాయం పొందుతుండటంపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏడాదిగా కసరత్తు..ఎట్టకేలకు కొలిక్కి రాష్ట్రంలో వివిధ సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, వాటిల్లో కబ్జాకు గురైన భూములు, మ్యుటేషన్ జరగని భూముల వివరాలు తేల్చాలని గత ఏడాది కేసీఆర్ ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇన్వెంటరీ (ఆస్తుల జాబితా) పేరుతో శాఖ ఆస్తులు, భూముల వివరాలు సేకరించారు. ఇందులో భాగంగానే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, బీమా, నెట్టెంపాడు, కాళేశ్వరంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న భూముల వివరాలు సేకరించారు. ఆయా భూముల నిమిత్తం రైతులకు పరిహారం అందజేసినా, మ్యుటేషన్ కాని కారణంగా వాటిని భూ యజమానులే అనుభవిస్తున్నారని, రైతుబంధు సైతం పొందుతున్నారని గుర్తించారు. అలాగే కొన్నిచోట్ల ముంపులో ఉన్న భూములకు కొందరు అక్రమార్కులు పెట్టుబడి సాయం పొంతున్నారని తేల్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూములు మ్యుటేషన్ కాలేదని గుర్తించిన సాగునీటి శాఖ, ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డుల ఆధారంగా ఆ భూముల వివరాలను బయటకు తీసింది. భారీ ప్రాజెక్టుల కింద 6.19 లక్షల ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 76 వేల ఎకరాలు, చిన్నతరహా ప్రాజెక్టుల కింద 5.84 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 12.79 లక్షల ఎకరాలు శాఖకు చెందినవిగా గుర్తించింది. ఇందులో సుమారు 1.50 లక్షల ఎకరాల భూమి మ్యుటేషన్ జరగలేదని గుర్తించింది. వీటిల్లో ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ స్టేజ్–1లో సుమారు 10,600 ఎకరాలు, స్టేజ్–2లో 6,300 ఎకరాలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో 7,170 ఎకరాలు, ప్రాణహితలో 5 వేలు, వట్టివాగులో 740, సత్నాలలో 730, బీమాలో 425 ఎకరాలు, నెట్టెంపాడులో 2,700 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 22 వేలు, వరద కాల్వ పరిధిలో 4,500, మిడ్‌మానేరులో 2వేల ఎకరాల మేర మ్యుటేషన్ కాలేదని గుర్తించారు. ఈ భూములకు అక్రమార్కులు రైతుబంధు పొందుతున్నారని తేల్చారు. ఇటీవల ఈ భూముల తిరిగి స్వాధీనంపై సమావేశాలు నిర్వహించి, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ భూములను శాఖ పేరుపై బదలాయించారు. దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.300 కోట్ల మేర రైతుబంధు భారం తగ్గుతుందని లెక్కగట్టారు. -
4 నెలలు 116 కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలంలో ఎట్టిపరిస్థితుల్లోనూ నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా ఉన్న సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులను శరవేగంగా చేయించే పనిలో పడింది. సీతారామ లోని మూడు పంప్‌హౌస్‌లు పూర్తయినా... ప్రధాన కాల్వ పరిధిలో పెద్దగా ఆయకట్టు లేనందున ఎత్తి పోతలు మొదలుపెట్టినా ఉపయోగం ఉండదు. కాబట్టి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కింద నిర్ణయించిన ఆయకట్టులో లక్ష ఎకరాలౖకైనా నీటిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేవలం నెల రోజుల కిందటే ఈ కెనాల్ పనులు మొదల య్యాయి. దానికి తోడు భూసేకరణలో ఇబ్బం దులు, కోర్టు కేసులు, తీవ్రరూపం దాల్చుతున్న ఎండలు ఇరిగేషన్ శాఖకు పరీక్ష పెడుతున్నాయి. సవాల్ విసురుతున్న సమస్యలు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ 6.74 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వతోపాటు 3 పంప్‌హౌస్‌ల నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్రధాన కాల్వ పనులు పూర్తి కావస్తున్నాయి. మొదటి, రెండో పంప్ హౌస్‌లో ఆరేసి మోటార్లు ఉండగా, వీటన్నింటినీ సిద్ధం చేశారు. మూడో పంప్‌హౌస్‌లో 4 మోటార్లు సిద్ధం కాగా, మరో 3 మోటార్ల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మే చివరికి పంప్‌హౌస్‌లన్నీ సిద్ధం చేయనున్నారు. అయితే ఈ ప్రధాన కాల్వ పరిధిలో పెద్దగా ఆయకట్టు లేని దృష్ట్యా.. మూడో పంప్‌హౌస్ దిగువ నుంచి 116.70 కి..మీ. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులను 4 ప్యాకేజీలుగా విభజించి రూ.1,238 కోట్లతో చేపట్టారు. ఈ కెనాల్ పూర్తయితే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజక వర్గాల్లో 1.24 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు నీరందడంతోపాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అయితే కెనాల్ తవ్వేందుకు మొత్తం 1,639 ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉండగా, 976 ఎకరాల మేర అవార్డు అయ్యింది. ఇందులో 898 ఎకరాలకు సంబంధించి రూ.31 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక 1,202 ఎకరాల అటవీ భూములు అవసరం ఉండగా, ఈ భూమి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు బదిలీ అయింది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నెల రోజుల కిందట నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశించడంతో పనులు వేగిరమయ్యాయి. ఇంకా కోటి క్యూబిక్ మీటర్ల మట్టిపని ముఖ్యంగా అటవీ భూములు ఉన్న చోట్ల పనులు వేగిరం చేశారు. ఇప్పటికే కెనాల్‌లోని ప్యాకేజీ– 9లో 8 లక్షల క్యూబిక్ మీటర్లు, ప్యాకేజీ–10లో 4 లక్షలు, ప్యాకేజీ–12లో 6 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని పూర్తి చేశారు. ప్యాకేజీ–11 పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అయిన ప్పటికీ మరో కోటి క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి పని చేయాల్సి ఉంది. ఈ పనులను మరింత వేగి రం చేయాలన్న ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ ఆదేశాల మేరకు సీఈ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలోనే ఉంటూ ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ మిషనరీని పెంచి పనులు చేయిస్తున్నారు. అయితే ఎండలు మండిపోతుండటం పనులపై ప్రభావం చూపు తోంది. ఇక దీనికి తోడు భూసేకరణ కాని చోట్ల పనులు ఇంకా మొదలవ్వలేదు. భూసేకరణ బాధ్యతను నెత్తికెత్తుకున్న ప్రాజెక్టు ఇంజనీర్లు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుం టున్నారు. అయితే భూసేకరణ బిల్లుల చెల్లిం పుల్లో జాప్యం సైతం ఆటంకాలు సృష్టిస్తోంది. వీటికి తోడు చాలా చోట్ల కెనాల్ చిన్నచిన్న వాగులను దాటాల్సి వస్తోంది. ఈ వాగులు దాటే క్రమంలో అనేక స్ట్రక్చర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ సమస్యల మధ్య సత్తుపల్లి కెనాల్ పనులు పూర్తి చేయడం ప్రాజెక్టు ఇంజనీర్లకు పెద్ద సవాల్‌గానే మారనుంది. -
శ్రీశైలం నీటిపై సందిగ్ధత
నీటి విడుదల కోరుతున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాలకు దిగువన సైతం నీటిని తోడే అంశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తీవ్రమైన తాగు నీటి కొరత దృష్ట్యా కనీస మట్టానికి దిగువ నుంచి సైతం నీటిని తీసుకునే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గట్టిగా కోరుతుండగా తెలంగాణ దీన్ని వ్యతిరేకిస్తోంది. దీనిపై బుధవారం ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమయ్యారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి హాజరు కావాల్సిన ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఇతరత్రా కారణాలతో హాజరుకాలేదు. తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు మరో 6 నుంచి 7 టీఎంసీల నీరు అవసరం ఉన్న దృష్ట్యా శ్రీశైలంలో 790 అడుగుల దిగువన సైతం నీటిని తీసుకునేందుకు సహకరించాలని ఏపీ ఈఎన్సీ రాష్ట్ర కార్యదర్శిని కోరారు. అయితే దీనిపై జోషి ఎలాంటి నిర్ణయం చెప్పారన్నది బయటకి తెలియరాలేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 790 అడుగుల వద్ద 4.06 టీఎంసీల వినియోగార్హమైన నీరు మాత్రమే ఉంది. అది పూర్తిగా తెలంగాణకు కేటాయించిన దే. కాగా ఈ నెల 10న కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత శ్రీశైలం దిగువన నీటిని తీసుకునే అంశంపై నిర్ణయం చేసే అవకాశాలున్నాయని నీటి పారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి.