4 నెలలు 116 కిలోమీటర్లు  | Telangana Govt Focussing SeethaRama Project | Sakshi
Sakshi News home page

4 నెలలు 116 కిలోమీటర్లు 

Published Wed, Mar 10 2021 2:19 AM | Last Updated on Wed, Mar 10 2021 2:21 AM

Telangana Govt Focussing SeethaRama Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలంలో ఎట్టిపరిస్థితుల్లోనూ నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా ఉన్న సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ పనులను శరవేగంగా చేయించే పనిలో పడింది. సీతారామ లోని మూడు పంప్‌హౌస్‌లు పూర్తయినా... ప్రధాన కాల్వ పరిధిలో పెద్దగా ఆయకట్టు లేనందున ఎత్తి పోతలు మొదలుపెట్టినా ఉపయోగం ఉండదు. కాబట్టి సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ కింద నిర్ణయించిన ఆయకట్టులో లక్ష ఎకరాలౖకైనా నీటిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేవలం నెల రోజుల కిందటే ఈ కెనాల్‌ పనులు మొదల య్యాయి. దానికి తోడు భూసేకరణలో ఇబ్బం దులు, కోర్టు కేసులు, తీవ్రరూపం దాల్చుతున్న ఎండలు ఇరిగేషన్‌ శాఖకు పరీక్ష పెడుతున్నాయి.

సవాల్‌ విసురుతున్న సమస్యలు
సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ 6.74 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వతోపాటు 3 పంప్‌హౌస్‌ల నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్రధాన కాల్వ పనులు పూర్తి కావస్తున్నాయి. మొదటి, రెండో పంప్‌ హౌస్‌లో ఆరేసి మోటార్లు ఉండగా, వీటన్నింటినీ సిద్ధం చేశారు. మూడో పంప్‌హౌస్‌లో 4 మోటార్లు సిద్ధం కాగా, మరో 3 మోటార్ల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మే చివరికి పంప్‌హౌస్‌లన్నీ సిద్ధం చేయనున్నారు. అయితే ఈ ప్రధాన కాల్వ పరిధిలో పెద్దగా ఆయకట్టు లేని దృష్ట్యా.. మూడో పంప్‌హౌస్‌ దిగువ నుంచి 116.70 కి..మీ. సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ పనులను 4 ప్యాకేజీలుగా విభజించి రూ.1,238 కోట్లతో చేపట్టారు. ఈ కెనాల్‌ పూర్తయితే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజక వర్గాల్లో 1.24 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు నీరందడంతోపాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అయితే కెనాల్‌ తవ్వేందుకు మొత్తం 1,639 ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉండగా, 976 ఎకరాల మేర అవార్డు అయ్యింది. ఇందులో 898 ఎకరాలకు సంబంధించి రూ.31 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక 1,202 ఎకరాల అటవీ భూములు అవసరం ఉండగా, ఈ భూమి ఇప్పటికే ఇరిగేషన్‌ శాఖకు బదిలీ అయింది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నెల రోజుల కిందట నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశించడంతో పనులు వేగిరమయ్యాయి.

ఇంకా కోటి క్యూబిక్‌ మీటర్ల మట్టిపని
ముఖ్యంగా అటవీ భూములు ఉన్న చోట్ల పనులు వేగిరం చేశారు. ఇప్పటికే కెనాల్‌లోని ప్యాకేజీ– 9లో 8 లక్షల క్యూబిక్‌ మీటర్లు, ప్యాకేజీ–10లో 4 లక్షలు, ప్యాకేజీ–12లో 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి పని పూర్తి చేశారు. ప్యాకేజీ–11 పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అయిన ప్పటికీ మరో కోటి క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టి పని చేయాల్సి ఉంది. ఈ పనులను మరింత వేగి రం చేయాలన్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ ఆదేశాల మేరకు సీఈ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలోనే ఉంటూ ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ మిషనరీని పెంచి పనులు చేయిస్తున్నారు. అయితే ఎండలు మండిపోతుండటం పనులపై ప్రభావం చూపు తోంది. ఇక దీనికి తోడు భూసేకరణ కాని చోట్ల పనులు ఇంకా మొదలవ్వలేదు. భూసేకరణ బాధ్యతను నెత్తికెత్తుకున్న ప్రాజెక్టు ఇంజనీర్లు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుం టున్నారు. అయితే భూసేకరణ బిల్లుల చెల్లిం పుల్లో జాప్యం సైతం ఆటంకాలు సృష్టిస్తోంది. వీటికి తోడు చాలా చోట్ల కెనాల్‌ చిన్నచిన్న వాగులను దాటాల్సి వస్తోంది. ఈ వాగులు దాటే క్రమంలో అనేక స్ట్రక్చర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ సమస్యల మధ్య సత్తుపల్లి కెనాల్‌ పనులు పూర్తి చేయడం ప్రాజెక్టు ఇంజనీర్లకు పెద్ద సవాల్‌గానే మారనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement