శ్రీశైలం నీటిపై సందిగ్ధత
నీటి విడుదల కోరుతున్న ఏపీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాలకు దిగువన సైతం నీటిని తోడే అంశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తీవ్రమైన తాగు నీటి కొరత దృష్ట్యా కనీస మట్టానికి దిగువ నుంచి సైతం నీటిని తీసుకునే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గట్టిగా కోరుతుండగా తెలంగాణ దీన్ని వ్యతిరేకిస్తోంది. దీనిపై బుధవారం ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషితో సమావేశమయ్యారు. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, ఈ సమావేశానికి హాజరు కావాల్సిన ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఇతరత్రా కారణాలతో హాజరుకాలేదు. తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు మరో 6 నుంచి 7 టీఎంసీల నీరు అవసరం ఉన్న దృష్ట్యా శ్రీశైలంలో 790 అడుగుల దిగువన సైతం నీటిని తీసుకునేందుకు సహకరించాలని ఏపీ ఈఎన్‌సీ రాష్ట్ర కార్యదర్శిని కోరారు. అయితే దీనిపై జోషి ఎలాంటి నిర్ణయం చెప్పారన్నది బయటకి తెలియరాలేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 790 అడుగుల వద్ద 4.06 టీఎంసీల వినియోగార్హమైన నీరు మాత్రమే ఉంది. అది పూర్తిగా తెలంగాణకు కేటాయించిన దే. కాగా ఈ నెల 10న కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత శ్రీశైలం దిగువన నీటిని తీసుకునే అంశంపై నిర్ణయం చేసే అవకాశాలున్నాయని నీటి పారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి.