నిర్వాసితులకు మరింత ప్రయోజనం
- భూసేకరణ బిల్లు–2016కు అసెంబ్లీ ఆమోదం
- మెరుగైన పునరావాసం, పరిహారం కల్పిస్తామన్న ప్రభుత్వం
- మరో నాలుగు బిల్లులకూ ఆమోదముద్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూసేకరణ, పునరావాసం, పరిహారం పంపిణీలో పారదర్శకత బిల్లు–2016ను అసెంబ్లీ ఆమోదించింది. కేంద్రం అమల్లోకి తెచ్చిన భూసేకరణ పునరావాస చట్టం–2013 ప్రకారం ప్రభావిత కుటుంబాలకు అధిక ప్రయోజనం కల్పించే ఏదైనా శాసనాన్ని చేసే హక్కు రాష్ట్రాలకు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఆ చట్టంలో పేర్కొన్న అంశాల కంటే అధిక ప్రయోజనం ఉండేలా నిర్వాసితులకు పునరావాసం, పరిహారం కల్పిస్తామని ప్రకటించింది. ప్రజోపయోగ కార్యక్రమాలు, పథకాలకు ఈ భూసేకరణ చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపింది. నిర్వాసితులు తమ ఆస్తులను ఇష్టపూర్వకంగా అమ్మడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడటం, తద్వారా భూసేకరణను వేగవంతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఇందులో ప్రస్తావించింది.
కేంద్రం తెచ్చిన చట్టంలోని సెక్షన్–3లో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు, గృహ నిర్మాణం, పారిశ్రామిక కారిడార్లను అదనంగా చేర్చింది. భూసేకరణ తప్పని సరని గుర్తించిన చోట రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత భూ యజమానుల నుంచి సమ్మతి తీసుకుంటుంది. తర్వాత నోటిఫికేషన్ జారీ చేసి భూమిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. నిర్ణయించిన పరిహారం, పునరావాసం, పునః పరిష్కారానికి ఇచ్చే డబ్బును ఏక మొత్తంలో చెల్లిస్తుంది. ఈ భూసేకరణ బిల్లుతో పాటు అసెంబ్లీ ఐదు బిల్లులను ఆమోదించింది. మంత్రి కేటీఆర్ వీటిని ప్రవేశ పెట్టారు. విలువ ఆధారిత పన్ను బిల్లు నాలుగు, ఐదో సవరణల కోసం రెండు బిల్లులు, ది ఖమ్మం (మెట్రోపాలిటన్ ఏరియా), పోలీస్ బిల్లు – 2016, ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు– 2016కు రెండో సవరణ కోసం బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఇవే ఐదు బిల్లులను మండలిలో మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.