ప్రజలపై మీడియా ప్రభావం అధికం
99 చానల్ ప్రారంభ సభలో వక్తలు
హైదరాబాద్: కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్‌లో 99 టీవీ చానల్ తెలంగాణ లైవ్ కార్యక్రమాన్ని టి. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్ లైవ్ కార్యక్రమాన్ని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ లాం చింగ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు చానల్ లోగోను, ఎంపీ కేశవరావు ఫీచర్స్‌ను ప్రారంభించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ ముధుసూదనాచారి మాట్లాడుతూ ప్రజల జీవితాలను భాగా ప్రభావితం చేసే శక్తి మీడియాకు ఉందన్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ మీడియా యాజమాన్యాలు సమాజహితం కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పరితపిస్తున్నట్లు కన్పిస్తుందని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిజాన్ని నిర్భ యంగా చెప్పేందుకు జర్నలిజం ఉపయోగ పడాలన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉందని, సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేసేందుకు వీలులేదన్నారు. ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రావు, సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకులు మధు, ప్రముఖ సంపాదకులు ఏబీకె ప్రసాద్, కొమ్మినేని శ్రీనివాసరావు, తెల్కపల్లి రవి, దేవులపల్లి అమర్, శైలేష్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.