telangana municipal workers
-
సమ్మె వెనుక కొన్ని సంఘాలు
♦ అవే ఆందోళనకు ఉసిగొల్పాయి ♦ పారిశుద్ధ్య కార్మికులతో సీఎం ♦ దీనివెనక కొన్ని ఆంధ్రా పార్టీల నాయకుల హస్తం వుంది ♦ బల్దియా ఆదాయం పెరిగితే అడగకున్నా జీతాలు పెంచుతా ♦ వేతనాల పెంపుపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు తాను స్వయంగా హామీ ఇవ్వగా ఈ క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని పనికిమాలిన సంఘాలు కార్మికులను తప్పుదోవపట్టించి సమ్మెకు ఉసిగొల్పాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్, బోనాలు, పుష్కరాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికులు సమ్మె చేయడం గౌరవంగా ఉంటుందా అని ప్రశ్నించారు. సమ్మె వెనక కొన్ని ఆంధ్రా పార్టీల నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను 47.05 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో శుక్రవారం బల్దియా కార్మికులు సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘సఫాయన్నా..నీకు సలామన్నా’ అని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తానే అన్నానని, పారిశుద్ధ్య కార్మికులను మాతృమూర్తులతో పోల్చానని గుర్తు చేశారు. దీనివల్ల సమాజంలో పారిశుద్ధ్య కార్మికులపట్ల గౌరవం పెరిగిందన్నారు. ‘బల్దియా ఆదాయం పెరిగితే మీరు అడగకున్నా జీతాలు పెంచుతా..! యూనియన్ల చక్కర్లు అసలే వద్దు’ అని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఆర్టీసీ కార్మికులకన్నా ఎక్కువగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచానని, కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లల విద్య సౌకర్యాలకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు ప్రపంచంలోనే మంచి పేరుందని, అందువల్ల దీన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. అవినీతిరహిత అనుమతులు లభించేలా జీహెచ్ఎంసీలో పలు చర్యలు చేపట్టామని, దీనివల్ల మరిన్ని వ్యాపార సంస్థలు వచ్చే అవకాశముందన్నారు. తద్వారా జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగే అవకాశముందని, పెరిగే ఆదాయానికి అనుగుణంగా కార్మికుల వేతనాలూ పెంచుతామని కేసీఆర్ చెప్పారు. కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. జీహెచ్ఎంసీ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఏటా వెయ్యి మంది కార్మికులకుపైగా ఇళ్లు నిర్మిస్తామని, తొలుత ఇళ్లులేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. వారి వేతనాలూ పెంపు! జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంచిన ప్రభుత్వం ఇతర మున్సిపాలిటీల ఉద్యోగులపై దృష్టి సారించింది. వారి వేతన సరవణతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం.. అధికారులతో చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్, ఆ శాఖ సంచాలకులు బి.జనార్దన్‌రెడ్డి తదితరులతో పలు ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. శనివారం ఉదయం వరకు తగిన సిఫారసులు చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీలో సమ్మె విరమణ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాల పెంపుపై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మెను విరమిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. అయితే 67 మున్సిపాలిటీల్లో కార్మికుల వేతన పెంపుపై హామీ లభించకపోవడంతో అక్కడ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. సమ్మెలో సంపూర్ణంగా నిలబడ్డ కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కాగా, శుక్రవారం ఈ మున్సిపాలిటీల్లోని 82.23 శాతం కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం 15,345 మంది తాత్కాలిక కార్మికుల్లో 12,619 మంది విధులకు దూరంగా ఉన్నారు. -
జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంపు
* పారిశుధ్య కార్మికుల జీతం రూ. 8,500 నుంచి రూ.12,500కు * డ్రైవర్లకు రూ.10,200 నుంచి రూ.15,000కు * సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో ప్రకటన * విధుల్లో చేరిన కార్మికులకు ఈనెల నుంచే వర్తింపజేయాలని ఆదేశం... * విధుల్లో చేరని కార్మికుల తొలగింపునకు ఆదేశాలు * రాష్ట్రంలో మిగిలిన 67 మున్సిపాలిటీ కార్మికుల ప్రస్తావన లేకుండా ప్రకటన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పారిశుధ్య కార్మికులకు శుభవార్త. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పారిశుధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను 47 శాతం పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 24 వేల మందికిపైగా ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.8,500 వేతనం ఇస్తున్నారు. పెరిగిన వేతనం ప్రకారం వారు నెలకు రూ.12,500 అందుకోనున్నారు. ప్రస్తుతం రూ.10,200 వేతనం పొందుతున్న డ్రైవర్లు ఇకపై రూ.15,000 పొందనున్నారు. పారిశుధ్య కార్మికులకు రూ.4 వేలు, డ్రైవర్లకు రూ.4,800 వేతనం పెరిగింది. పారిశుద్ధ్య కార్మికుల పనితీరుకు మెచ్చి, స్వచ్ఛ హైదరాబాద్‌లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో వివరించారు. వేతనాలు పెరిగిన ప్రతిసారీ నాయకులుగా చెలామణి అయ్యే కొందరు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి ఎవరైనా అలా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. కార్మికులు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు. గురువారం వరకు సమ్మె విరమించి విధుల్లో చేరిన వారందరికీ ఈనెల నుంచే వేతనాల పెంపును అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నాటికి ఇంకా విధుల్లో చేరని ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. సమ్మె సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని, అనుచితంగా ప్రవర్తించిన వారిని విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం వేతనాలు పెంచిన ప్రభుత్వం.. కార్మికులపై ఉన్న ప్రేమ, సానుభూతితో 47 శాతానికి పైగా వేతనాలు పెంచినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మున్సిపాలిటీ కార్మికుల సంగతేంటి! జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసినా.. అందులో మునిసిపాలిటీ కార్మికుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కనీస వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలో 67 నగరాలు, పట్టణాల్లోని 40 వేలకు పైగా పారిశుధ్య, పారిశుధ్యేతర కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మున్సిపల్ కార్మికులకు సైతం 47 శాతం ఫిట్మెంట్తో పదో పీఆర్సీని వర్తింపజేసి, పారిశుధ్య కార్మికుల వేతనాన్ని రూ.14,170కు, పారిశుధ్యేతర కార్మికుల వేతనాలను రూ.17,380కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఐఆర్ ఇవ్వకుంటే సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులతో సమానంగా అన్ని విభాగాల ఉద్యోగులకు 28 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లించాలని, దీనిపై ఈనెల 5లోగా నిర్ణయం తీసుకోకుంటే సమ్మె తప్పదని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.భాస్కర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐఆర్ చెల్లింపునకు అంగీకారం కుదిరిందని, కేవలం పారిశుధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచారని అన్నారు. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఈనెల 5లోగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఈ హామీ మేరకు వేచి చూస్తామని, 7వ తేదీ నుంచి దశలవారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. 10న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని, 16 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తామని భాస్కర్ చెప్పారు.