జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంపు | telangana municipal workers salaries hiked | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంపు

Published Fri, Jul 17 2015 1:47 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంపు - Sakshi

జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంపు

* పారిశుధ్య కార్మికుల జీతం రూ. 8,500 నుంచి రూ.12,500కు
* డ్రైవర్లకు రూ.10,200 నుంచి రూ.15,000కు
* సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో ప్రకటన
* విధుల్లో చేరిన కార్మికులకు ఈనెల నుంచే వర్తింపజేయాలని ఆదేశం...
* విధుల్లో చేరని కార్మికుల తొలగింపునకు ఆదేశాలు
* రాష్ట్రంలో మిగిలిన 67 మున్సిపాలిటీ కార్మికుల ప్రస్తావన లేకుండా ప్రకటన

 
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పారిశుధ్య కార్మికులకు శుభవార్త. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పారిశుధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను 47 శాతం పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 24 వేల మందికిపైగా ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.8,500 వేతనం ఇస్తున్నారు. పెరిగిన వేతనం ప్రకారం వారు నెలకు రూ.12,500 అందుకోనున్నారు. ప్రస్తుతం రూ.10,200 వేతనం పొందుతున్న డ్రైవర్లు ఇకపై రూ.15,000 పొందనున్నారు. పారిశుధ్య కార్మికులకు రూ.4 వేలు, డ్రైవర్లకు రూ.4,800 వేతనం పెరిగింది.
 
పారిశుద్ధ్య కార్మికుల పనితీరుకు మెచ్చి, స్వచ్ఛ హైదరాబాద్‌లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో వివరించారు. వేతనాలు పెరిగిన ప్రతిసారీ నాయకులుగా చెలామణి అయ్యే కొందరు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి ఎవరైనా అలా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. కార్మికులు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు. గురువారం వరకు సమ్మె విరమించి విధుల్లో చేరిన వారందరికీ ఈనెల నుంచే వేతనాల పెంపును అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నాటికి ఇంకా విధుల్లో చేరని ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. సమ్మె సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని, అనుచితంగా ప్రవర్తించిన వారిని విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం వేతనాలు పెంచిన ప్రభుత్వం.. కార్మికులపై ఉన్న ప్రేమ, సానుభూతితో 47 శాతానికి పైగా వేతనాలు పెంచినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
 మున్సిపాలిటీ కార్మికుల సంగతేంటి!
 జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసినా.. అందులో మునిసిపాలిటీ కార్మికుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కనీస వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలో 67 నగరాలు, పట్టణాల్లోని 40 వేలకు పైగా పారిశుధ్య, పారిశుధ్యేతర కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మున్సిపల్ కార్మికులకు సైతం 47 శాతం ఫిట్‌మెంట్‌తో పదో పీఆర్‌సీని వర్తింపజేసి, పారిశుధ్య కార్మికుల వేతనాన్ని రూ.14,170కు, పారిశుధ్యేతర కార్మికుల వేతనాలను రూ.17,380కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement