సమ్మె వెనుక కొన్ని సంఘాలు | telangana municipal workers salaries hiked | Sakshi
Sakshi News home page

సమ్మె వెనుక కొన్ని సంఘాలు

Published Sat, Jul 18 2015 2:05 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

సమ్మె వెనుక కొన్ని సంఘాలు - Sakshi

సమ్మె వెనుక కొన్ని సంఘాలు

♦  అవే ఆందోళనకు ఉసిగొల్పాయి
♦  పారిశుద్ధ్య కార్మికులతో సీఎం
♦  దీనివెనక కొన్ని ఆంధ్రా పార్టీల నాయకుల హస్తం వుంది
♦  బల్దియా ఆదాయం పెరిగితే అడగకున్నా జీతాలు పెంచుతా
♦  వేతనాల పెంపుపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు

సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు తాను స్వయంగా హామీ ఇవ్వగా ఈ క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని పనికిమాలిన సంఘాలు కార్మికులను తప్పుదోవపట్టించి సమ్మెకు ఉసిగొల్పాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంజాన్, బోనాలు, పుష్కరాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికులు సమ్మె చేయడం గౌరవంగా ఉంటుందా అని ప్రశ్నించారు. సమ్మె వెనక కొన్ని ఆంధ్రా పార్టీల నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను 47.05 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో శుక్రవారం బల్దియా కార్మికులు సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘సఫాయన్నా..నీకు సలామన్నా’ అని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తానే అన్నానని, పారిశుద్ధ్య కార్మికులను మాతృమూర్తులతో పోల్చానని గుర్తు చేశారు. దీనివల్ల సమాజంలో పారిశుద్ధ్య కార్మికులపట్ల గౌరవం పెరిగిందన్నారు. ‘బల్దియా ఆదాయం పెరిగితే మీరు అడగకున్నా జీతాలు పెంచుతా..! యూనియన్ల చక్కర్లు అసలే వద్దు’ అని ఆయన హితవు పలికారు.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఆర్టీసీ కార్మికులకన్నా ఎక్కువగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచానని, కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లల విద్య సౌకర్యాలకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు ప్రపంచంలోనే మంచి పేరుందని, అందువల్ల దీన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. అవినీతిరహిత అనుమతులు లభించేలా జీహెచ్‌ఎంసీలో పలు చర్యలు చేపట్టామని, దీనివల్ల మరిన్ని వ్యాపార సంస్థలు వచ్చే అవకాశముందన్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీ ఆదాయం పెరిగే అవకాశముందని, పెరిగే ఆదాయానికి అనుగుణంగా కార్మికుల వేతనాలూ పెంచుతామని కేసీఆర్ చెప్పారు.

కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు..
జీహెచ్‌ఎంసీ కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఏటా వెయ్యి మంది కార్మికులకుపైగా ఇళ్లు నిర్మిస్తామని, తొలుత ఇళ్లులేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.
 
వారి వేతనాలూ పెంపు!
జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంచిన ప్రభుత్వం ఇతర మున్సిపాలిటీల ఉద్యోగులపై దృష్టి సారించింది. వారి వేతన సరవణతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం.. అధికారులతో చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్, ఆ శాఖ సంచాలకులు బి.జనార్దన్‌రెడ్డి తదితరులతో పలు ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. శనివారం ఉదయం వరకు తగిన సిఫారసులు చేయాలని సీఎం ఆదేశించారు.
 
జీహెచ్‌ఎంసీలో సమ్మె విరమణ
జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాల పెంపుపై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మెను విరమిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. అయితే 67 మున్సిపాలిటీల్లో కార్మికుల వేతన పెంపుపై హామీ లభించకపోవడంతో అక్కడ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు.

సమ్మెలో సంపూర్ణంగా నిలబడ్డ కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు.  కాగా, శుక్రవారం ఈ మున్సిపాలిటీల్లోని 82.23 శాతం కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం 15,345 మంది తాత్కాలిక కార్మికుల్లో 12,619 మంది విధులకు దూరంగా ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement