Telangana panchayat raj
-
ఏకగ్రీవ నజరానా ఏదీ
బషీరాబాద్: జిల్లాలోని ఏకగ్రీవ పంచాయతీలు ప్రభుత్వ నజరానా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ డబ్బులు వస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని ప్రజాప్రతినిధులు, స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు మధ్య కుదిరిన అంగీకారం ప్రభుత్వానికి లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించింది. ఒక్కో జీపీలో ఎన్నికల నిర్వహణకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అయితే జిల్లాలో 75 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 71 జీపీలు సంపూర్ణంగా యునానిమస్ అయ్యాయి. మొత్తం 460 వార్డులు కూడా ఏకగ్రీవం సాధించాయి. తద్వారా ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఆదా కావడంతో పాటు అభ్యర్థులకు ఖర్చు బెడద తప్పింది. అధికార పార్టీ చొరవ.. జిల్లాలోని 565 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌లకు అన్ని అధికారాలు కట్టబెట్టడంతో ఆ పదవికోసం గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొంది. పంచాయతీ బరిలో మండల స్థాయి రాజకీయ నేతలతో పాటు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు వర్గాల వారు రంగంలోకి దిగడంతో ఎన్నికలు ఖరీదుగా మారాయి. జిల్లాలో అర్బన్ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న పంచాయతీల్లో ఎలాగైన సర్పంచ్ పీఠం దక్కించుకోవాలని కొందరు అభ్యర్థులు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చుపెట్టారు. మరీ ముఖ్యగా తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి పట్టణాలకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీలు, గనుల ప్రాంతాల జీపీల్లో తీవ్ర పోటీ కొనసాగింది. ఇదిలా ఉండగా మెజార్టీ జీపీలను తన ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ ఏకగ్రీవాలను ప్రోత్సహించింది. సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నజరానా ఇస్తామని ప్రకటించింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు రెబల్స్‌గా పోటీ చేసిన వారిని బుజ్జగించేందుకు.. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో జిల్లాలోని 75 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే వీటిలో కొన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కూడా చేరాయి. జిల్లాలో మొదటి విడతలో 34, రెండో విడతలో 18, తుది విడతలో 23 పంచాయతీలు యునానిమస్ అయ్యాయి. 71 పంచాయతీలకే నజరానా జిల్లాలో మూడు విడతల్లో 75 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 71 పంచాయతీలలో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు మొత్తం పోటీలేకుండా గెలపుపొందారు. దీంతో వీటిని మాత్రమే సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలుగా గుర్తించిన ప్రభుత్వం.. ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున పంచాయతీ ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు జీపీలకు ప్రోత్సాహక నిధులు అందలేదు. అభివృద్ధికి ఊతం.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.10 లక్షల నజరానా అభివృద్ధికి ఊతం ఇవ్వనుంది. ఈ నిధులతో పాటు జెడ్పీ నుంచి మరో రూ.10 లక్షలు ఇస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి తాండూరులో ప్రకటించారు. ఇలా మొత్తం రూ.20 లక్షల నిధులు ఏక కాలంలో పంచాయతీలకు అందితే వేగంగా అభివృద్ధి అవకాశం ఉంది. ఇటీవల ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏకగ్రీవ ప్రోత్సాహకం రాకపోవడంపై గ్రామ ప్రథమ పౌరులు అసంతృప్తిగా ఉన్నారు. అభివృద్ధి కోసం ఏకమయ్యాం ప్రభుత్వం మా తండాను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసింది. గతంలో ఉమ్మడి జీపీగా ఉన్నప్పుడు తండాలకు సర్పంచ్‌గా అయ్యే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతా ఏకమయ్యాం. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో సర్పంచ్‌తో పాటు వార్డుల సభ్యులను ఏకగ్రీవం చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, జెడ్పీ నుంచి రూ.10 లక్షలు వస్తే ఊరిలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. – రవి, సర్పంచ్, కొత్లాపూర్(బి) -
నిధుల వరద..!
ఆదిలాబాద్‌అర్బన్: పల్లెల ప్రగతికి నిధుల వరద పారుతోంది. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో పంచాయతీలకు నిధులు ఇస్తున్నాయి. పట్టణాలను తలపించేలా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. నిధులు సక్రమంగా వినియోగించేలా చట్టాలు కూడా తెస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చెక్‌పవర్ కూడా రద్దు కానుంది. అయితే ఈ చట్టం ప్రకారం గతంలో కంటే ఈసారి ఎక్కువగానే నిధులు వచ్చే అవకాశం ఉంది. గ్రామ జనాభా ప్రకారం నిధులు రానున్నాయి. గడిచిన ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు రూ.150 కోట్లపైగా నిధులు అయ్యాయి. వీటిని పంచాయతీ ఖాతాల్లో నేరుగా జమ చేశాయి. ఒక్కో పంచాయతీకి రూ.అరకోటిపైగా వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఐదేళ్లలో రూ.150 కోట్లకుపైనే నిధులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 866 పాత పంచాయతీలు ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ ఫండ్, 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) ద్వారా నిధులు విడుదల చేస్తున్నాయి. ఒక్కో ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగుసార్లు వీటిని జమ అవుతున్నాయి. ఐదేళ్లలో సాధారణ పంచాయతీకి రూ.50 లక్షలు, మేజర్ పంచాయతీలకు దాదాపు కోటి వరకు నిధులు సమకూరాయి. ఉమ్మడి జిల్లాలోని 866 పంచాయతీలకు ఐదేళ్లలో రూ.150 కోట్లుకుపైగానే వచ్చా యి. సంవత్సరాల వారీగా పరిశీలిస్తే.. 2014–15లో రెండు విడతలుగా రూ.25.98 కోట్లు రాగా, 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రూ.67.55 కోట్లు విడుదల అయ్యాయి. 2016–17లో రెండు ప్రభుత్వాలు మొత్తం 29.60 కోట్లు , 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 25.86 కోట్లు విడుదల చేశాయి. 2018–19లో 866 జీపీలకు రెండుసార్లు విడుదలైన నిధులు కలిపి రూ.14.56 కోట్లు పంచాయతీల ఖాతాలకు జమయ్యాయి. జీపీలకు మూడురకాల ప్రభుత్వ నిధులు.. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రకాలుగా నిధులు విడుదల చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు గతంలో మండల, జిల్లా పరిషత్‌కు జమయ్యేవి. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 2015 నుంచి వీటిని నేరుగా పంచాయతీలకు ఇస్తోంది. దీంతో ఆర్థిక సంఘం నిధులు నాలుగేళ్లుగా పంచాయతీలకు జమవుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు కూడా జీపీలకే వస్తున్నాయి. వీటితోపాటు జనరల్ ఫండ్ నిధులు కూడా సమకూరుతున్నాయి. ఈ మూడురకాల ఆదాయ వనరులు కాకుండా పంచాయతీలకు ఇంటి, నల్లా పన్నులు, భూ సంబంధిత నిధులు, ఇసుక, మైన్స్ ఇతర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం కూడా జమవుతున్నాయి. నిధులను గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలుల నిర్మాణాలు, పూడికతీత, పారిశుధ్యం నిర్వహణ, శానిటేషన్, పారిశుధ్య కార్మికులకు వేతనాలు, వీధిలైట్లు, తాగునీరు తదితర పనులకు వినియోగిస్తున్నాయి. బడ్జెట్‌ను తొలిసారి వినియోగించుకోనున్న 659 జీపీలు.. ఉమ్మడి జిల్లాలోని కొత్త పంచాయతీలకు తొలిసారిగా బడ్జెట్ వినియోగంలోకి రానుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీంభీం, నిర్మల్ నాలుగు జిల్లాల పరిధిలో పాత పంచాయతీలు 866 ఉండగా, కొత్తగా 659 పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త సర్పంచుల పాలన ప్రారంభం అయింది. మున్సిపాలిటీలో కలిసిన పంచాయతీలను మినహాయిస్తే ప్రస్తు తం ఉమ్మడి జిల్లాలో 1508 పంచాయతీలు ఉన్నాయి. మం చిర్యాల జిల్లాలోని మొత్తం 322 జీపీలు ఉండగా, 112 కొత్తగా ఏర్పాటయ్యాయి. కుమురంభీంలో మొత్తం 334 ఉండగా, 161 జీపీలు కొత్తగా ఏర్పాటు చేశారు. నిర్మల్‌లో 400 జీపీలు ఉండగా, 160 జీపీలు, ఆదిలాబాద్‌లో మొత్తం 467 ఉండగా, 226 పంచా యతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు తొలిసారిగా ప్రభుత్వం విడుదల చేయనున్న బడ్జెట్‌ను వివిధ అభివృద్ధి పనులకోసం ఉపయోగించనున్నాయి. రానున్న ఐదేళ్లలో మరింత నిధులు..? కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు ఎక్కువ నిధులు సమకూర్చే అవకా శం ఉంది. సర్పంచ్‌లకు కొత్త చట్టంపై శిక్షణ.. నిధులు–విధులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కొత్త చట్టం ప్రకారం జీపీలకు నిధులు విడుదల చేసి దుర్వినియోగం కాకుండా చూసేందుకు చట్టం కూడా తెచ్చింది. రానున్న ఐదేళ్లలో గతం కంటే ఎక్కువ విడుదలయ్యే నిధులతో పల్లెలు అభివృద్ధిబాట పట్టనున్నాయి. పంచాయతీకి ఐదేళ్లలో వచ్చిన నిధులు ఇలా.. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు పంచాయతీకి గడిచిన ఐదేళ్లలో రూ.48.76 లక్షల నిధులు విడుదలయ్యాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి మొత్తం రూ.3 లక్షలకుపైగా విడుదల కాగా, 2015–16 సంవత్సరంలో జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సీ, 13వ ఆర్థిక సంఘం నిధులు కలిపి ఎనిమిది సార్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఈ జీపీకి రూ.11.44 లక్షలు విడుదలయ్యాయి. ఇక 2016–17 సంవత్సరంలో నాలుగుసార్లు కలిపి రూ.8.26 లక్షలు జమయ్యాయి. 2017–18లో రూ.16.82 లక్షలు, 2018–19లో రూ.9.24 లక్షలు జమైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. -
‘నిబంధనలకు అనుగుణంగానే పంచాయతీరాజ్ ఆర్డినెన్స్’
సాక్షి, న్యూఢిల్లీ : పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముందు పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను కుదిస్తూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కృష్ణయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వాటర్‌గ్రిడ్‌లో 700 ఉద్యోగాలు
వివిధ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం: మంత్రి కేటీఆర్ ఉపాధి హామీ కొనసాగింపునకు మండలి ఏకగ్రీవ తీర్మానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కింద 700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వివిధ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి ఐదు నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ శాసనమండలిలో గురువారం పలువురు సభ్యులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల్లో పేర్కొన్నవాటికి సంబంధం లేకుండా ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి అనడంతో.. ఎమ్మెల్సీలు నాగేశ్వర్, నర్సారెడ్డి, డి.శ్రీనివాస్ తదితరులు మండిపడ్డారు. ఇంతలో మంత్రి కేటీఆర్ కలుగజేసుకొని సభ్యులకు సర్దిచెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తోందని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా కమిటీని కూడా నియమించినట్లు చెప్పారు. నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, వాటర్‌గ్రిడ్ కింద 700 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఆర్ఎంపీలను డాక్టర్లుగా పరిగణించలేం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలను డాక్టర్లుగా పరిగణించలేమని, ప్రిస్క్రిప్షన్ రాసేందుకు కూడా అనుమతించేది లేదని ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్పష్టం చేశారు. అయితే.. వారికి శిక్షణ ఇప్పించి గ్రామస్థాయిలో ‘కమ్యూనిటీ పారామెడిక్’లుగా వారి సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మొత్తం 25,741 మందిని గుర్తించామని, వీరిలో ఇప్పటికే 12 వేల మందికి శిక్షణ పూర్తయిందన్నారు. రాష్ట్రంలో మలేరియా, డెంగీ, చికున్ గున్యా తదితర జ్వరాలు ఉన్నమాట వాస్తవమే గానీ, మరణాలు మాత్రం నమోదు కాలేదని చెప్పారు. జ్వరాల బారిన పడిన వారి కోసం అవసరమైన వైద్య పరీక్షలు, ప్లేట్లెట్ల సదుపాయాలను జిల్లా ఆసుపత్రుల్లో కల్పించామన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘ఉపాధి’ని కుదించేందుకు కేంద్రం యత్నం: కేటీఆర్ గ్రామీణాభివృద్ధి కోసం గత యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కుదించాలని చూస్తున్నట్లు తెలిసిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలోని 443 మండలాల్లో 73 మండలాలకే ఉపాధి హామీ పథకాన్ని పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ఈ పథకం కొనసాగింపునకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీని కొనసాగించాల్సిందేనని మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉపాధి హామీ పథకం కొనసాగింపుపై ఉభయ సభల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపనున్నట్లు మంత్రి వివరించారు.