ఆదిలాబాద్‌అర్బన్: పల్లెల ప్రగతికి నిధుల వరద పారుతోంది. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో పంచాయతీలకు నిధులు ఇస్తున్నాయి. పట్టణాలను తలపించేలా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. నిధులు సక్రమంగా వినియోగించేలా చట్టాలు కూడా తెస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చెక్‌పవర్ కూడా రద్దు కానుంది. అయితే ఈ చట్టం ప్రకారం గతంలో కంటే ఈసారి ఎక్కువగానే నిధులు వచ్చే అవకాశం ఉంది. గ్రామ జనాభా ప్రకారం నిధులు రానున్నాయి. గడిచిన ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు రూ.150 కోట్లపైగా నిధులు అయ్యాయి. వీటిని పంచాయతీ ఖాతాల్లో నేరుగా జమ చేశాయి. ఒక్కో పంచాయతీకి రూ.అరకోటిపైగా వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఐదేళ్లలో రూ.150 కోట్లకుపైనే నిధులు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 866 పాత పంచాయతీలు ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ ఫండ్, 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) ద్వారా నిధులు విడుదల చేస్తున్నాయి. ఒక్కో ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగుసార్లు వీటిని జమ అవుతున్నాయి. ఐదేళ్లలో సాధారణ పంచాయతీకి రూ.50 లక్షలు, మేజర్ పంచాయతీలకు దాదాపు కోటి వరకు నిధులు సమకూరాయి. ఉమ్మడి జిల్లాలోని 866 పంచాయతీలకు ఐదేళ్లలో రూ.150 కోట్లుకుపైగానే వచ్చా యి. సంవత్సరాల వారీగా పరిశీలిస్తే.. 2014–15లో రెండు విడతలుగా రూ.25.98 కోట్లు రాగా, 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రూ.67.55 కోట్లు విడుదల అయ్యాయి. 2016–17లో రెండు ప్రభుత్వాలు మొత్తం 29.60 కోట్లు , 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 25.86 కోట్లు విడుదల చేశాయి. 2018–19లో 866 జీపీలకు రెండుసార్లు విడుదలైన నిధులు కలిపి రూ.14.56 కోట్లు పంచాయతీల ఖాతాలకు జమయ్యాయి.
జీపీలకు మూడురకాల ప్రభుత్వ నిధులు..
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రకాలుగా నిధులు విడుదల చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు గతంలో మండల, జిల్లా పరిషత్‌కు జమయ్యేవి. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 2015 నుంచి వీటిని నేరుగా పంచాయతీలకు ఇస్తోంది. దీంతో ఆర్థిక సంఘం నిధులు నాలుగేళ్లుగా పంచాయతీలకు జమవుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఎస్‌ఎఫ్‌సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు కూడా జీపీలకే వస్తున్నాయి. వీటితోపాటు జనరల్ ఫండ్ నిధులు కూడా సమకూరుతున్నాయి. ఈ మూడురకాల ఆదాయ వనరులు కాకుండా పంచాయతీలకు ఇంటి, నల్లా పన్నులు, భూ సంబంధిత నిధులు, ఇసుక, మైన్స్ ఇతర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం కూడా జమవుతున్నాయి. నిధులను గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలుల నిర్మాణాలు, పూడికతీత, పారిశుధ్యం నిర్వహణ, శానిటేషన్, పారిశుధ్య కార్మికులకు వేతనాలు, వీధిలైట్లు, తాగునీరు తదితర పనులకు వినియోగిస్తున్నాయి.
బడ్జెట్‌ను తొలిసారి వినియోగించుకోనున్న 659 జీపీలు..
ఉమ్మడి జిల్లాలోని కొత్త పంచాయతీలకు తొలిసారిగా బడ్జెట్ వినియోగంలోకి రానుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీంభీం, నిర్మల్ నాలుగు జిల్లాల పరిధిలో పాత పంచాయతీలు 866 ఉండగా, కొత్తగా 659 పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త సర్పంచుల పాలన ప్రారంభం అయింది. మున్సిపాలిటీలో కలిసిన పంచాయతీలను మినహాయిస్తే ప్రస్తు తం ఉమ్మడి జిల్లాలో 1508 పంచాయతీలు ఉన్నాయి. మం చిర్యాల జిల్లాలోని మొత్తం 322 జీపీలు ఉండగా, 112 కొత్తగా ఏర్పాటయ్యాయి. కుమురంభీంలో మొత్తం 334 ఉండగా, 161 జీపీలు కొత్తగా ఏర్పాటు చేశారు. నిర్మల్‌లో 400 జీపీలు ఉండగా, 160 జీపీలు, ఆదిలాబాద్‌లో మొత్తం 467 ఉండగా, 226 పంచా యతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు తొలిసారిగా ప్రభుత్వం విడుదల చేయనున్న బడ్జెట్‌ను వివిధ అభివృద్ధి పనులకోసం ఉపయోగించనున్నాయి.
రానున్న ఐదేళ్లలో మరింత నిధులు..?
కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు ఎక్కువ నిధులు సమకూర్చే అవకా శం ఉంది. సర్పంచ్‌లకు కొత్త చట్టంపై శిక్షణ.. నిధులు–విధులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కొత్త చట్టం ప్రకారం జీపీలకు నిధులు విడుదల చేసి దుర్వినియోగం కాకుండా చూసేందుకు చట్టం కూడా తెచ్చింది. రానున్న ఐదేళ్లలో గతం కంటే ఎక్కువ విడుదలయ్యే నిధులతో పల్లెలు అభివృద్ధిబాట పట్టనున్నాయి.
పంచాయతీకి ఐదేళ్లలో వచ్చిన నిధులు ఇలా..
ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు పంచాయతీకి గడిచిన ఐదేళ్లలో రూ.48.76 లక్షల నిధులు విడుదలయ్యాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి మొత్తం రూ.3 లక్షలకుపైగా విడుదల కాగా, 2015–16 సంవత్సరంలో జనరల్ ఫండ్, ఎస్‌ఎఫ్‌సీ, 13వ ఆర్థిక సంఘం నిధులు కలిపి ఎనిమిది సార్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఈ జీపీకి రూ.11.44 లక్షలు విడుదలయ్యాయి. ఇక 2016–17 సంవత్సరంలో నాలుగుసార్లు కలిపి రూ.8.26 లక్షలు జమయ్యాయి. 2017–18లో రూ.16.82 లక్షలు, 2018–19లో రూ.9.24 లక్షలు జమైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment