టీపీసీసీ ఎన్నికల కమిటీ కుదింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కుదించనున్నారు. ముఖ్య నేతలు, సీని యర్లతోనే కమిటీని నియమించాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియమించిన ఈ కమిటీలో 54 మందిని సభ్యులుగా నియమిం చారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు కొందరు సీని యర్లు, జిల్లా స్థాయి నేతలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు చోటు కల్పించారు. తాజాగా ఎన్నికల కమిటీ కుదింపు ప్రక్రియపై టీపీసీసీ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కమిటీలో సభ్యులుగా ఉన్న జిల్లా స్థాయి నేతలు, పలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో పాటు కొన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులను మినహాయించి కమిటీని సగానికి తగ్గించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కమిటీనే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనుంది. ప్రతీ పార్లమెంటు స్థానానికి ముగ్గురు లేదా నలుగురు ఆశావహుల పేర్లతో జాబితాను ఏఐసీసీకి పంపనుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీ స్థాయిలో కీలక సమీక్ష ఇంతవరకు జరగలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండోసారి జరిగిన ఎన్నికల్లోనూ కాం గ్రెస్ ఎందుకు ఓడిపోయిందన్న దానిపై ఏఐసీసీ పెద్ద లు టీపీసీసీ నేతలతో చర్చించలేదు. ఈ సమీక్ష కోసం ఫిబ్రవరి తొలి వారంలో టీపీసీసీ ముఖ్యులను ఢిల్లీకి పిలిపించాలని ఏఐసీసీ భావిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌తో పాటు ఇతర ముఖ్య నాయకుల వీలును బట్టి ఫిబ్రవరి 2 నుంచి 7లోపు ఒక రోజు ఢిల్లీలో సమీక్షించనున్నారు. దీంట్లో పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించడంతో పాటు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ మార్గనిర్దేశం చేస్తుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. కాగా, 31 కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకంపై రాష్ట్రస్థాయి కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షులను ఖరారు చేస్తూ రెండు, మూడు రోజుల్లో ఏఐసీసీ ఆమోదముద్ర వేస్తుందని సమాచారం.