Telangana Rural bank
-
క్యాషియర్ జైపాల్‌రెడ్డిపై అక్రమాస్తుల కేసు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు జైపాల్‌రెడ్డిపై సీబీఐ గురువారం మరో కేసు నమోదు చేసింది. బ్యాంకు కుంభకోణంలో రూ.9 కోట్ల వరకు దోపిడీకి గురైన సంగతి తెలిసిందే. కుంభకోణంలో బ్యాంక్ క్యాషియర్ జైపాల్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు సీబీఐ గుర్తించింది. 2011 నుంచి 2018 ఫిబ్రవరి వరకు ఆయన సంపాదించి న ఆస్తులు, భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు సేకరించింది. జైపాల్‌రెడ్డి, ఆయన భార్య శాలిని పేర్ల మీద రూ.73.38 లక్షల ఆస్తి ఉంది. రాబడి ద్వారా వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఆయనకున్న ఆస్తుల విలువ 144 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది. దీంతో ఈ ఆస్తి అక్రమార్జనగా ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ 1988 ప్రకారం రెడ్ విత్ 13 (2), 13 (1) (ఈ) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు హైదరాబాద్ రేంజ్ సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ తెలిపారు. -
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 20 ఈ–శాఖలు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తాజాగా 20 ఈ–శాఖలను ప్రారంభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఎండీ మణి పాల్వేశన్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 4,885 స్వయం సహాయక బృందాలకు రూ. 160.34 కోట్ల రుణ వితరణకు సంబంధించిన చెక్కును గ్రూప్‌ల సమన్వయకర్తలకు అందజేశారు. ప్రస్తుతం తెలంగాణలోని 18 జిల్లాల్లో 388 శాఖలు ఉన్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ్ తెలిపారు. డిపాజిట్లు రూ. 6,818 కోట్లు కాగా అడ్వాన్స్‌లు రూ. 4,755 కోట్లు, మొత్తం వ్యాపార పరిమాణం రూ. 11,573 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 12 శాఖలు ప్రారంభించనున్నామని, దీంతో మార్చి ఆఖరు నాటికి మొత్తం బ్రాంచీల సంఖ్య 400కి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.