Telangana Society of Authors
-
అక్షరానుబంధం
బురద నవ్వింది కమలాలుగా పువ్వు నవ్వింది భ్రమరాలుగా పుడమి కదిలింది చరణాలుగా జడిమ కదిలింది హరిణాలుగా నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది ... ప్రకృతి నేపథ్యాన్ని అక్షర మాలలుగా మలచిన కవి సి.నారాయణరెడ్డి సృష్టి ‘విశ్వంభర’. అందుకు వేదికై స్ఫూర్తి నింపింది ఈ ‘భాగ్య’నగరమే! విద్యార్థిగా ఆయున ప్రస్థానం మొదలైంది ఇక్కడే. కవిగా, ఆచార్యునిగా.. సాహితీ జగతిలో ఎంతగా ఎదిగితే, అంతగా పెనవేసుకుంది ఈ నగరంతో ఆయున అనుబంధం. అక్షర శిల్పి సినారెకు ఈ చారిత్రక నగరంతో మరపురాని జ్ఞాపకాలెన్నో! వాటిలో కొన్ని ఆయున మాటల్లోనే.. జ్ఞాపకం డా॥సి. నారాయణరెడ్డి భారత్‌కు 1947లోనే స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పాలన నుంచి 1948లో విమూక్తి లభించింది. కరీంనగర్ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్నా. ఉర్దూ మీడియుం. తర్వాతి ఏడాది ఇంటర్. ఆ రోజుల్లో జిల్లా స్థాయిలో కళాశాలలు లేవు. అబిడ్స్‌లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్లో చేరా. అక్కడ తెలుగు విద్యార్థులు కూడా ఉర్దూలోనే మాట్లాడుకొనేవారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బీఏ కూడా ఉర్దూ మాధ్యమమే. ఎంఏ తెలుగు చదివాను. ఓయూ హాస్టల్లో ఉండేవాణ్ణి. అంతకుముందు పేయింగ్ గెస్ట్‌గా సికింద్రాబాద్‌లో మకాం. హిందీ పాటలను తెలుగులో.. ఎక్కువగా హిందీ సినిమాలు చూసేవాళ్లం. సుల్తాన్‌బజార్ ‘దిల్షాద్’, జీపీవో సమీపంలోని ప్యాలెస్, కింగ్ కోఠి ప్రాంతంలో రాయల్ టాకీస్ అప్పట్లో పెద్ద థియేటర్లు. ప్యాలెస్‌లో ఎక్కువగా హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. స్నేహితులకు ఆ సినిమాల్లోని పాటలను తెలుగులోకి అనువదించి పాడి వినిపించేవాడిని. ఇప్పటికీ గుర్తుందో పాట... ‘బర్సాత్’ చిత్రంలోనిది.. ‘ఛోడ్గయే బాలమ్..’ దీనికి తెలుగులో... ‘వీడితివా రాణీ... ఏకాకిగా నను వీడితివా’... అంటూ వెంటనే అందుకునేవాడిని. దాశరథితో కలసి.. దాశరథి, మహాకవి కాళోజీ గారు, నేను ప్రధాన పాత్రధారులుగా ‘తెలంగాణ రచయితల సంఘం’లో పనిచేశాం. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లో తెలుగు భాషా వికాసానికి కృషి చేశాం. అప్పుడు సాహిత్యమే ఉద్యమం. సాయంత్రం వేళ బొగ్గులకుంట శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో సాహితీ సభలు జరిగేవి. అక్కడ ఎన్నో గ్రంథాలు చదివేవాడిని. తెలుగు సాహిత్యంలో ఓయూ నుంచి పీజీ, డాక్టరేటు పొందాను. తొలుత సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, తరువాత నిజాం కళాశాలలో అధ్యాపకునిగా, ఓయూలో ఆచార్యునిగా పనిచేశా. అంబేద్కర్ విశ్వవిద్యాలయం (1985), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (1989) ఉపాధ్యక్షుడిగా, అంతకుముందు రాష్ట్ర భాషా సంఘం అధ్యక్షుడిగా.. ఈ నగరంలోనే ఎన్నో పదవులు అలంకరించాను. ‘అభ్యుదయం... అప్పట్లో ‘అభ్యుదయ రచయితల సంఘం’తో సంబంధాలుండేవి. దీని ద్వారా వార్షిక సమ్మేళనాలు నిర్వహించేవాళ్లం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహా కవి శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారితో పరిచయం ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో తెలుగుదనం నింపుకున్న గొప్ప గొప్ప రచయితలు ఎందరో భాషకు సేవ చేశారు. ప్రముఖ రచయిత, కమ్యూనిస్టు నాయకుడు వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ నాలాంటి వారికెందరిలోనో స్ఫూర్తి నింపిన నవల. ఆప్తమిత్రులు... నా సహాధ్యారుు డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి నాకు ఆప్త మిత్రుడు. నేను ఆచార్యుడిగా పనిచేస్తున్నప్పుడు ఆయన అధ్యాపకుడిగా ఉండేవాడు. విద్యాభ్యాసంలో ఒక ఏడాది వెనుక పడ్డాడు. నాకంటే ఉర్దూపై బాగా పట్టు ఉన్నవాడు. క్రమక్రమంగా నా రచనలకు అండగా నిలిచాడు. ఇక దాశరథి, నేను అత్యధిక భాగం కలసి తిరిగేవాళ్లం. ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులు వయసులో పెద్దవాడైనా ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రావి నారాయణరెడ్డిగారితో పరిచయం ఏర్పడింది. నిజంగా అదో మధురానుభూతి. ఆయనపై లఘు చిత్రం తీశాం. ఈ మహానగరంతో ముడివేసుకున్న ఎన్నెన్నో అపురూప జ్ఞాపకాలు. చెప్పుకుంటూ పోతే అదో గ్రంథమే అవుతుంది. - హనుమా -
జయశంకర్..తెలంగాణ దిక్సూచి
- ఆయన పేరున అధ్యయన కేంద్రం, విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి - తెరసం అధ్యక్షుడు నందిని సిధారెడ్డి సిద్దిపేటటౌన్: తెలంగాణ ప్రజలు పీల్చుతున్న స్వేచ్ఛా వాయువుల్లో, ముఖాల్లో కనిపిస్తున్న తేజస్సులో తెలంగాణ జాతిపిత, సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ పోరు, స్ఫూర్తి ఉన్నాయని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ఎన్జీవో భవన్లో శనివారం రాత్రి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన వర్థంతి సభలో సిధారెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి 60 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేసి రెండు తరాల్లో స్ఫూర్తి రగిలించి స్వప్నాన్ని సాకారం చేశారన్నారు. ఒక్కడిగా కదిలి కోట్లాది మందిని కదిలించిన జయశంకర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసి సామాజిక, విజ్ఞాన అంశాలపై పరిశోధన చేసే అవకాశం కల్పించాలన్నారు. తెలంగాణలో జయశంకర్ పేరిట విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆయన ఆశయాలను నిజం చేయడమే గొప్ప నివాళి అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రజలంతా బాధ్యత స్వీకరించాలన్నారు. ఇందుకు జయశంకర్ పరిచిన పునాదులు ఉపయోగపడతాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వివక్షతపై గణాంకాలతో స్పష్టం చేసిన ఆయన ప్రసంగాలు, పుస్తకాలు ఉద్యమానికి ఊపిరిలూదాయన్నారు. మేధావుల మౌనం ప్రమాదకరమని హెచ్చరిస్తూ అన్ని వర్గాలను ఉద్యమ స్రవంతిలో కలిపిన ఘనత ఆయనదేనన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పాపయ్య మాట్లాడుతూ సర్వ శక్తులను ఒడ్డి పోరాడిన జయశంకర్ స్ఫూర్తి మరువలేనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆశయాలను నిజం చేయలన్నారు. సమావేశంలో టీఎన్జీఓ సంఘం డివిజన్ అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు హన్మంతారెడ్డి, తెలంగాణ డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాను, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పీఆర్టీయూ జిల్లా నేతలు నారాయణరెడ్డి, ఆస లక్ష్మణ్, ఆపస్ జిల్లా నేతలు అల్లాడి లక్ష్మినర్సయ్య, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు నర్సారెడ్డి, అం జనేయులు, కిసాన్ మో ర్చా రాష్ట్ర నేత బూర్గుపల్లి రాంచందర్‌రావు, టీఆర్ఎస్ నేతలు గుండు శ్రీనివా స్, శేషుకుమార్, జేఏసీ నేతలు వంగగాలిరెడ్డి, భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ స్ఫూర్తి కొనసాగించాలి సిద్దిపేటజోన్ : ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక టీపీటీఎఫ్ సిద్దిపేట జోన్ కార్యాలయంలో నిర్వహించిన జయశంకర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాన్ని ముందుండి నడిపి మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్నారు. మన ఊరు, మన బడి, మన విద్యార్థి అనే నినాదంతో బోధన కొనసాగిస్తామన్నారు. అంతకుముందు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్ర మంలో నేతలు రాజారెడ్డి, రాములు, పద్మయ్య,గోపాల్‌రెడ్డి, నాగేశ్వర్రావ్, మల్లారెడ్డి, సత్యనారాయణ, అశోక్‌రెడ్డి, జానకి రాములు, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, శివాజి, శ్రీకాంత్ పాల్గొన్నారు.