జయశంకర్..తెలంగాణ దిక్సూచి
- ఆయన పేరున అధ్యయన కేంద్రం, విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
- తెరసం అధ్యక్షుడు నందిని సిధారెడ్డి
సిద్దిపేటటౌన్: తెలంగాణ ప్రజలు పీల్చుతున్న స్వేచ్ఛా వాయువుల్లో, ముఖాల్లో కనిపిస్తున్న తేజస్సులో తెలంగాణ జాతిపిత, సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ పోరు, స్ఫూర్తి ఉన్నాయని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ఎన్‌జీవో భవన్‌లో శనివారం రాత్రి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన వర్థంతి సభలో సిధారెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి 60 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేసి రెండు తరాల్లో స్ఫూర్తి రగిలించి స్వప్నాన్ని సాకారం చేశారన్నారు.
ఒక్కడిగా కదిలి కోట్లాది మందిని కదిలించిన జయశంకర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసి సామాజిక, విజ్ఞాన అంశాలపై పరిశోధన చేసే అవకాశం కల్పించాలన్నారు. తెలంగాణలో జయశంకర్ పేరిట విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆయన ఆశయాలను నిజం చేయడమే గొప్ప నివాళి అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రజలంతా బాధ్యత స్వీకరించాలన్నారు.
ఇందుకు జయశంకర్ పరిచిన పునాదులు ఉపయోగపడతాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వివక్షతపై గణాంకాలతో స్పష్టం చేసిన ఆయన ప్రసంగాలు, పుస్తకాలు ఉద్యమానికి ఊపిరిలూదాయన్నారు. మేధావుల మౌనం ప్రమాదకరమని హెచ్చరిస్తూ అన్ని వర్గాలను ఉద్యమ స్రవంతిలో కలిపిన ఘనత ఆయనదేనన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పాపయ్య మాట్లాడుతూ సర్వ శక్తులను ఒడ్డి పోరాడిన జయశంకర్ స్ఫూర్తి మరువలేనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆశయాలను నిజం చేయలన్నారు.
సమావేశంలో టీఎన్‌జీఓ సంఘం డివిజన్ అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు హన్మంతారెడ్డి, తెలంగాణ డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాను, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా నేతలు నారాయణరెడ్డి, ఆస లక్ష్మణ్, ఆపస్ జిల్లా నేతలు అల్లాడి లక్ష్మినర్సయ్య, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌జీవో అధ్యక్ష, కార్యదర్శులు నర్సారెడ్డి, అం జనేయులు, కిసాన్ మో ర్చా రాష్ట్ర నేత బూర్గుపల్లి రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్ నేతలు గుండు శ్రీనివా స్, శేషుకుమార్, జేఏసీ నేతలు వంగగాలిరెడ్డి, భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ స్ఫూర్తి కొనసాగించాలి
సిద్దిపేటజోన్ : ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక టీపీటీఎఫ్ సిద్దిపేట జోన్ కార్యాలయంలో నిర్వహించిన జయశంకర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాన్ని ముందుండి నడిపి మార్గదర్శకంగా నిలిచారన్నారు.
ఆయన స్ఫూర్తితో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్నారు. మన ఊరు, మన బడి, మన విద్యార్థి అనే నినాదంతో బోధన కొనసాగిస్తామన్నారు. అంతకుముందు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్ర మంలో నేతలు రాజారెడ్డి, రాములు, పద్మయ్య,గోపాల్‌రెడ్డి, నాగేశ్వర్‌రావ్, మల్లారెడ్డి, సత్యనారాయణ, అశోక్‌రెడ్డి, జానకి రాములు, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, శివాజి, శ్రీకాంత్ పాల్గొన్నారు.