అక్షరానుబంధం | Telangana Society of Authors in one of writer Dr.c.narayana reddy | Sakshi
Sakshi News home page

అక్షరానుబంధం

Published Mon, Oct 27 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

అక్షరానుబంధం

అక్షరానుబంధం

బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా  
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదిలింది హరిణాలుగా
నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది
నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది
 ... ప్రకృతి నేపథ్యాన్ని అక్షర మాలలుగా మలచిన కవి సి.నారాయణరెడ్డి సృష్టి  ‘విశ్వంభర’. అందుకు వేదికై స్ఫూర్తి నింపింది ఈ ‘భాగ్య’నగరమే! విద్యార్థిగా ఆయున ప్రస్థానం మొదలైంది ఇక్కడే. కవిగా, ఆచార్యునిగా.. సాహితీ జగతిలో ఎంతగా ఎదిగితే, అంతగా పెనవేసుకుంది ఈ నగరంతో ఆయున అనుబంధం. అక్షర శిల్పి సినారెకు ఈ చారిత్రక నగరంతో మరపురాని జ్ఞాపకాలెన్నో! వాటిలో కొన్ని ఆయున మాటల్లోనే..

 
జ్ఞాపకం
డా॥సి. నారాయణరెడ్డి

భారత్‌కు 1947లోనే స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పాలన నుంచి 1948లో విమూక్తి లభించింది. కరీంనగర్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుకున్నా. ఉర్దూ మీడియుం. తర్వాతి ఏడాది ఇంటర్. ఆ రోజుల్లో జిల్లా స్థాయిలో కళాశాలలు లేవు. అబిడ్స్‌లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్‌లో చేరా. అక్కడ తెలుగు విద్యార్థులు కూడా ఉర్దూలోనే మాట్లాడుకొనేవారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బీఏ కూడా ఉర్దూ మాధ్యమమే. ఎంఏ తెలుగు చదివాను. ఓయూ హాస్టల్‌లో ఉండేవాణ్ణి. అంతకుముందు పేయింగ్ గెస్ట్‌గా సికింద్రాబాద్‌లో మకాం.

హిందీ పాటలను తెలుగులో..
ఎక్కువగా హిందీ సినిమాలు చూసేవాళ్లం. సుల్తాన్‌బజార్ ‘దిల్షాద్’, జీపీవో సమీపంలోని ప్యాలెస్, కింగ్ కోఠి ప్రాంతంలో రాయల్ టాకీస్ అప్పట్లో పెద్ద థియేటర్లు. ప్యాలెస్‌లో ఎక్కువగా హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. స్నేహితులకు ఆ సినిమాల్లోని పాటలను తెలుగులోకి అనువదించి పాడి వినిపించేవాడిని. ఇప్పటికీ గుర్తుందో పాట... ‘బర్సాత్’ చిత్రంలోనిది.. ‘ఛోడ్‌గయే బాలమ్..’ దీనికి తెలుగులో... ‘వీడితివా రాణీ... ఏకాకిగా నను వీడితివా’... అంటూ వెంటనే అందుకునేవాడిని.
 
దాశరథితో కలసి..
దాశరథి, మహాకవి కాళోజీ గారు, నేను ప్రధాన పాత్రధారులుగా ‘తెలంగాణ రచయితల సంఘం’లో పనిచేశాం. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లో తెలుగు భాషా వికాసానికి కృషి చేశాం. అప్పుడు సాహిత్యమే ఉద్యమం. సాయంత్రం వేళ బొగ్గులకుంట శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో సాహితీ సభలు జరిగేవి. అక్కడ ఎన్నో గ్రంథాలు చదివేవాడిని. తెలుగు సాహిత్యంలో ఓయూ నుంచి పీజీ, డాక్టరేటు పొందాను. తొలుత సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, తరువాత నిజాం కళాశాలలో అధ్యాపకునిగా, ఓయూలో ఆచార్యునిగా పనిచేశా. అంబేద్కర్ విశ్వవిద్యాలయం (1985), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (1989) ఉపాధ్యక్షుడిగా, అంతకుముందు రాష్ట్ర భాషా సంఘం అధ్యక్షుడిగా.. ఈ నగరంలోనే ఎన్నో పదవులు అలంకరించాను.
 
‘అభ్యుదయం...
అప్పట్లో ‘అభ్యుదయ రచయితల సంఘం’తో సంబంధాలుండేవి. దీని ద్వారా వార్షిక సమ్మేళనాలు నిర్వహించేవాళ్లం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహా కవి శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారితో పరిచయం ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో తెలుగుదనం నింపుకున్న గొప్ప గొప్ప రచయితలు ఎందరో భాషకు సేవ చేశారు. ప్రముఖ రచయిత, కమ్యూనిస్టు నాయకుడు వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ నాలాంటి వారికెందరిలోనో స్ఫూర్తి నింపిన నవల.
 
ఆప్తమిత్రులు...
నా సహాధ్యారుు డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి నాకు ఆప్త మిత్రుడు. నేను ఆచార్యుడిగా పనిచేస్తున్నప్పుడు ఆయన అధ్యాపకుడిగా ఉండేవాడు. విద్యాభ్యాసంలో ఒక ఏడాది వెనుక పడ్డాడు. నాకంటే ఉర్దూపై బాగా పట్టు ఉన్నవాడు. క్రమక్రమంగా నా రచనలకు అండగా నిలిచాడు. ఇక దాశరథి, నేను అత్యధిక భాగం కలసి తిరిగేవాళ్లం. ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులు వయసులో పెద్దవాడైనా ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రావి నారాయణరెడ్డిగారితో పరిచయం ఏర్పడింది. నిజంగా అదో మధురానుభూతి. ఆయనపై లఘు చిత్రం తీశాం. ఈ మహానగరంతో ముడివేసుకున్న ఎన్నెన్నో అపురూప జ్ఞాపకాలు. చెప్పుకుంటూ పోతే అదో గ్రంథమే అవుతుంది.  - హనుమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement