Telangana state first budget
-
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు అంచనాలు తలకిందులవటంతో తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ లెక్క తప్పింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవటం.. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయ మార్గాలు గాడిలో పడకపోవటంతో ఆర్థిక ప్రణాళిక కుదేలైంది. ఏ నెలకానెల వచ్చే రాబడికి.. అయ్యే ఖర్చులకు బొటాబొటిగా సరిపడే ఆదాయం ఉన్నప్పటికీ అదనంగా వస్తాయనుకున్న నిధులు రాకపోవటంతో ప్రభుత్వ కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ పథకాలతో పాటు రోడ్ల నిర్మాణం, కొత్త విద్యుత్తు ప్రాజెక్టులన్నీ నిధుల కటకటతో భూమి పూజలకు నోచుకోలేదు. ఈ బడ్జెట్లో కేటాయించిన పద్దుల ఖర్చుకు మరో నెల వ్యవధి మాత్రమే మిగిలింది. మార్చి నుంచి 2015-16 కొత్త ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అమల్లోకి వస్తుంది. అప్పటివరకు వేచి చూడటం తప్ప భారీ అంచనాలతో చేపట్టిన ఈ కార్యక్రమాలేవీ ముందుకు సాగే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. గత బడ్జెట్లో కేటాయింపులన్నీ కాగితాలపైనే ఉన్నాయని ఆశించినంత అదనపు ఆదాయం రాకపోవటంతో చాలా కార్యక్రమాలకు నిధులు ఇవ్వలేకపోయామని అధికార వర్గాలు బాహాటంగానే అంగీకరిస్తున్నాయి. భూముల అమ్మకం ద్వారా రూ. 6,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. ఆ దిశగా ప్రయత్నాలు చేయటంలో జాప్యం కావటంతో ఇప్పటివరకు ఒక్క రూపాయి సమకూరలేదు. కొత్త రాష్ట్రం కావటంతో ప్రత్యేక హోదాతోపాటు కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీగా రూ. 5,000 కోట్లు వస్తుందని బడ్జెట్లో ప్రస్తావించింది. ఇప్పటికీ అటువంటి సానుకూల సంకేతాలేవీ కేంద్రం నుంచి అందలేదు. అంతకుమించి కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాల అమలుకు ప్రణాళిక నిధుల్లో రాష్ట్రానికి కేటాయించిన రూ.11 వేల కోట్లు ఇప్పటికీ విడుదల చేయలేదు. 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలోనూ కేంద్రం అదే తీరును ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి రూ. 3,139 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ. 997 కోట్లు విడుదలయ్యాయి. మిగతా రూ. 2,142 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు అమ్మకపు పన్ను వాటా నిధులు ఇవ్వాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 5,600 కోట్ల అమ్మకపు పన్ను వాటా నిధులు రావాల్సి ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం అందులో 42 శాతం నిధులు తెలంగాణకు దక్కుతాయి. 2007 నుంచి బకాయి ఉన్న ఈ నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల తమ ఢిల్లీ పర్యటనల సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావటంతో ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం) నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని పలుమార్లు కోరింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. 9,000 కోట్లు అప్పుగా తెచ్చుకునే వీలుంది. ఈ పరిమితిని రూ. 13,000 కోట్లకు పెంచాలని.. దీంతో అదనంగా మరో రూ. 4,000 కోట్లు రుణంగా తీసుకునేందుకు మార్గం సుగమమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇవేవీ రాకపోవటంతో కొత్త కార్యక్రమాలకు నిధుల లేమి వెంటాడుతోంది. బడ్జెట్లో ప్రతిపాదించిన కేటాయింపుల ప్రకారం మిషన్ కాకతీయకు రూ. 2,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం సర్వేలకు రూ.300 కోట్లు విడుదల చేసి అంతకు మించి నిధులు ఈ ఏడాది ఖర్చు చేసే పరిస్థితి లేక వేగం తగ్గించుకుంది. వాటర్‌గ్రిడ్ స్కీమ్‌కు రూ. 2,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు. -
బడ్జెట్లో సంక్షేమానికే ప్రాధాన్యం: ఈటెల
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తొలి బడ్జెట్: ఈటెల ♦ మా ప్రాథమ్యాలను ఇందులో ఆవిష్కరించబోతున్నాం ♦ కొత్త రాష్ట్రంలో ఆదాయానికి, వనరులకు కొదువ లేదు ♦ నిధుల సమీకరణకు మార్గాలున్నాయి.. కేంద్ర నిధులు వస్తాయి ♦ ఆదాయం పడిపోతుందంటూ కొన్ని దుష్టశక్తులు ప్రచారం చేస్తున్నాయి ♦ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రలు జరుగుతున్నాయి ♦ రైతుల ఆత్మహత్యల నివారణకు దీర్ఘకాలిక చర్యలు చేపడతామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధికి తోడ్పడేలా తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తాను ఎన్నోసార్లు కొట్లాడానని.. అయినా ఆంధ్రా పాలకులు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నారని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కలిగినందుకు సంతోషంగానూ, గర్వంగానూ అనిపిస్తోందని ఈటెల చెప్పారు. బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రాథమ్యాలు, స్వరూపం, భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఆకలితో అలమటిస్తున్న అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా బడ్జెట్ ఉండబోతోంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటివరకూ రూ. 200గా ఉన్న పింఛన్లును రూ. 1,000కి, రూ. 500 పింఛన్లను రూ. 1,500కు పెంచాం. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచాం. 20 కేజీల బియ్యం పరిమితిని తీసేశాం. వ్యవసాయంతో గ్రామ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉన్నందున ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పేద దళిత యువతుల వివాహాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. * తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రరూపం చేసి రాష్ట్రాన్ని ఎలా సాధించామో... అలాగే మా ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ వంటి ప్రాజెక్టులను అమలుచేసి తీరుతాం. మా ప్రాథమ్యాలను బడ్జెట్ రూపంలో ఆవిష్కరించబోతున్నాం. నిధుల సమీకరణకు మా మార్గాలు మాకున్నాయి. ఏడాదిలోనే మా సృజనాత్మకత ఏమిటో చూపెడతాం. దుష్టశక్తుల ప్రచారమది.. కేంద్రంతో పంచాయితీ పెట్టుకోవాలని మాకేం లేదు. గత ప్రభుత్వాలు ఎలాంటి సంబంధాలు కొనసాగించాయో... మేం కూడా అదే రీతిన వ్యవహరిస్తాం. నిద్రపోయేవాళ్లను లేపొచ్చు గానీ, నిద్ర నటించే వాళ్లను లేపలేం కదా. టీడీపీ, బీజేపీ మధ్య అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణలో ఆదాయం పడిపోతుందని, మా ప్రభుత్వంపై కొంత విషప్రచారం జరుగుతోంది. కొత్త రాష్ట్రంలో ఆదాయానికి, వనరులకు కొదువలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూసే కొన్ని దుష్ట శక్తుల వల్లే ఇటువంటి ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగాక రెండు రాష్ట్రాల ప్రజలు బాగానే ఉన్నారు. తెలంగాణలో పాలన సజావుగా జరగవద్దనే సంకుచిత మనస్తత్వంతో వ్యవహరించడం సమంజసం కాదు. నిధులు తప్పకుండా వస్తాయి.. కేంద్రంతో ఘర్షణకు, నిధులకు సంబంధం లేదు. 13వ ఆర్థిక సంఘం నిధులు ఎలా వచ్చాయో, 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా అలాగే వస్తాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, మాకు రావాల్సిన గ్రాంట్లు కేంద్రం నుంచి తప్పకుండా వస్తాయి. కొత్త రాష్ట్రానికి అవసరమైన మేరకు కేటాయింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. ఈ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఏళ్లుగా ఉన్న సమస్యల వల్లే.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ఒక నెల, ఒక ఏడాదిలో వచ్చే సమస్యలు కారణం కాదు. అనేక ఏళ్లుగా ఉన్న సమస్యలే కారణం. పంటలు ఎండిపోయి, అప్పుల పాలై, ఏదిక్కూ లేని పరిస్థితుల్లోనే రైతులు ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎండిపోతున్న బోర్లు, బావులు, కాలిపోతున్న మోటార్లు, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం ఆత్మహత్యలకు కారణాలు. 1984 నుంచి ఇప్పటివరకు 25 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలే అయింది. ఈ సమస్యలకు మూలాలను అర్థం చేసుకొని వాటిని నివారించాలనే మా ప్రయత్నం. పైసలిచ్చినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నాం. మా ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలయ్యాక ఆత్మహత్యలు కొనసాగితే అప్పుడు మాది బాధ్యత అవుతుంది. హామీలన్నీ నెరవేరుస్తాం.. ఉద్యమకారులుగా మా గమ్యాన్ని చేరాం. పాలకులుగా కూడా ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తాం. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాం. టాస్క్‌ఫోర్స్ నివేదికలు తెప్పించుకున్నాం. అన్ని అంశాలను బేరీజు వేసుకొని బడ్జెట్‌ను రూపొందించాం. 14 ఏళ్లుగా మాపై విశ్వాసం ఉంచారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను సాధించాం. ఆంధ్రా పార్టీల, ఆంధ్ర మీడియా రణ గొణ ప్రచారాలని నమ్మకుండా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా. బంగారు తెలంగాణను నిర్మించేదాక ఈ ప్రభుత్వం నిద్రపోదు. -
భారీగానే బడ్జెట్!
రూ. 80 వేల కోట్లకు తగ్గకుండా తెలంగాణ ఆర్థిక శాఖ కసరత్తు కేంద్ర నిధులపై రాష్ర్టం ఆశలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ భారీగా ఉండాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దీంతో పది నెలల కాలానికే అయినా బడ్జెట్ పరిమాణం 80 వేల కోట్ల రూపాయలకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గకుండా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రణాళిక వ్యయం దాదాపు 30 వేల కోట్ల వరకు ఉం డేలా చూడాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ తుది స్వరూపంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశంకానున్నారు. తర్వాతే బడ్జెట్ పుస్తకాల ముద్రణ చేపట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. పీఆర్సీని ప్రభుత్వం ఏ మేరకు ఆమోదిస్తుందన్న దానిపై స్పష్టత లేకపోయినా.. బడ్జెట్లో మాత్రం నిధులు సమకూర్చనున్నట్లు చెప్పారు. బడ్జెట్లో ఎస్సీలకు 15.4 శాతం, ఎస్టీలకు 9.3 శాతం నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది. విభజనకు సాధ్యం కాని పలు మౌలిక వసతుల పథకాల్లో మాత్రం ఎస్సీలకు ఏడు శాతం, ఎస్టీలకు మూడు శాతం నిధులు కేటాయించినట్లు చూపించనున్నారు. కేంద్రం నుంచి నిధులు భారీగా వస్తాయన్న ఆశతోనే బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలను పది పని దినాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం(24న) మంత్రివర్గ సమావేశం తర్వా త అసెంబ్లీ సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్ల కాలానికి ఈ బడ్జెట్ మార్గదర్శకంగా ఉంటుందన్నారు. తాగునీటి గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, సంక్షేమ పథకాలతోపాటు, వ్యవసాయ, విద్యుత్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఇప్పటికే సూచించారు. తెలంగాణ కోణంలో ప్రతీ పథకం ప్రాధాన్యత ఉన్నదేనని, అన్నింటికీ నిధులు కేటాయించాలని కేసీఆర్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో నిధుల సర్దుబాటులో అధికారులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.