
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు అంచనాలు తలకిందులవటంతో తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ లెక్క తప్పింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవటం.. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయ మార్గాలు గాడిలో పడకపోవటంతో ఆర్థిక ప్రణాళిక కుదేలైంది. ఏ నెలకానెల వచ్చే రాబడికి.. అయ్యే ఖర్చులకు బొటాబొటిగా సరిపడే ఆదాయం ఉన్నప్పటికీ అదనంగా వస్తాయనుకున్న నిధులు రాకపోవటంతో ప్రభుత్వ కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ పథకాలతో పాటు రోడ్ల నిర్మాణం, కొత్త విద్యుత్తు ప్రాజెక్టులన్నీ నిధుల కటకటతో భూమి పూజలకు నోచుకోలేదు. ఈ బడ్జెట్‌లో కేటాయించిన పద్దుల ఖర్చుకు మరో నెల వ్యవధి మాత్రమే మిగిలింది. మార్చి నుంచి 2015-16 కొత్త ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అమల్లోకి వస్తుంది. అప్పటివరకు వేచి చూడటం తప్ప భారీ అంచనాలతో చేపట్టిన ఈ కార్యక్రమాలేవీ ముందుకు సాగే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
గత బడ్జెట్‌లో కేటాయింపులన్నీ కాగితాలపైనే ఉన్నాయని ఆశించినంత అదనపు ఆదాయం రాకపోవటంతో చాలా కార్యక్రమాలకు నిధులు ఇవ్వలేకపోయామని అధికార వర్గాలు బాహాటంగానే అంగీకరిస్తున్నాయి. భూముల అమ్మకం ద్వారా రూ. 6,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. ఆ దిశగా ప్రయత్నాలు చేయటంలో జాప్యం కావటంతో ఇప్పటివరకు ఒక్క రూపాయి సమకూరలేదు.
కొత్త రాష్ట్రం కావటంతో ప్రత్యేక హోదాతోపాటు కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీగా రూ. 5,000 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఇప్పటికీ అటువంటి సానుకూల సంకేతాలేవీ కేంద్రం నుంచి అందలేదు. అంతకుమించి కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాల అమలుకు ప్రణాళిక నిధుల్లో రాష్ట్రానికి కేటాయించిన రూ.11 వేల కోట్లు ఇప్పటికీ విడుదల చేయలేదు. 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలోనూ కేంద్రం అదే తీరును ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి రూ. 3,139 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ. 997 కోట్లు విడుదలయ్యాయి.
మిగతా రూ. 2,142 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు అమ్మకపు పన్ను వాటా నిధులు ఇవ్వాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 5,600 కోట్ల అమ్మకపు పన్ను వాటా నిధులు రావాల్సి ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం అందులో 42 శాతం నిధులు తెలంగాణకు దక్కుతాయి. 2007 నుంచి బకాయి ఉన్న ఈ నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల తమ ఢిల్లీ పర్యటనల సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు.
వీటితోపాటు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావటంతో ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని పలుమార్లు కోరింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. 9,000 కోట్లు అప్పుగా తెచ్చుకునే వీలుంది. ఈ పరిమితిని రూ. 13,000 కోట్లకు పెంచాలని.. దీంతో అదనంగా మరో రూ. 4,000 కోట్లు రుణంగా తీసుకునేందుకు మార్గం సుగమమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
ఇవేవీ రాకపోవటంతో కొత్త కార్యక్రమాలకు నిధుల లేమి వెంటాడుతోంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన కేటాయింపుల ప్రకారం మిషన్ కాకతీయకు రూ. 2,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం సర్వేలకు రూ.300 కోట్లు విడుదల చేసి అంతకు మించి నిధులు ఈ ఏడాది ఖర్చు చేసే పరిస్థితి లేక వేగం తగ్గించుకుంది. వాటర్‌గ్రిడ్ స్కీమ్‌కు రూ. 2,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు.