మెదక్ సీటును మోడీకి బహుమతిగా ఇద్దాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సంగారెడ్డి క్రైం: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించి ప్రధాని నరేంద్రమోడీకి బహుమతిగా ఇవ్వాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం రాత్రి కార్యకర్తలతో ఆయన అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎంపీగా పోటీచేస్తున్న జగ్గారెడ్డిని గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.
మెదక్ జిల్లా చాలా వెనుకబడి ఉందని, మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఎక్కువ నిధులు మంజూరవుతాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి జిల్లా అభివృద్ధి చెందాలనే ఆలోచన లేదని విమర్శించారు. కేవలం పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తోందన్నారు.
ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ పార్టీగానే భావిస్తోందన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిధుల మంజూరు విషయంలో కేంద్రాన్ని కోరిన సందర్భమే లేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతోందని విమర్శించారు. మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే సేవ చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు.
ఇన్‌చార్‌జల నియామకం
సమావేశంలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మనోహర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, కొండాపురం జగన్, సునీల్ పాల్గొన్నారు.