అవినీతి రహిత పాలనకు మోదీనే నిదర్శనం
హైదరాబాద్ : బీజేపీతోనే అవినితీరహిత పాలన సాధ్యమని ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సోమవారం కీసర మండలం చీర్యాల జయమోహన్ గార్డెన్ లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, సుపరిపాలన, పారదర్శకతకు పెద్ద పీటవేసిందని చెప్పారు.
ఈ కార్యక్రమాలను ప్రజలకు తెలియ జేసేందుకు గత 15 రోజులుగా గ్రామాల్లో దీన్దయాళ్ల ఉపాధ్యాయ కార్య విస్తరణ యోజనలో భాగంగా చేపట్టిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. గ్రామాల్లో ప్రజలు బీజేపీవైపు చేరేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. రైతులు, నిరుద్యొగులు, ఇలా అన్నివర్గాల ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారన్నారు. అయితే కేసీఆర్ కుటుంబం మాత్రం అధికారంలో ఉంటూ లక్షలాదిరూపాయల ప్రజా«ధనాన్ని దోచుకుంటున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాలు, పెరిగిపోతున్నాయని అధికార పార్టీనేతలే కబ్జాలకు పాల్పడుతున్న కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ సర్వేపేరుతో ప్రజలను అయోమయంలోకి నెట్టి మరోసారి అధికారంలోకి రావాలని దొంగ సర్వేలు చేయిస్తున్నారని తెలిపారు.