ముంపు ప్రాంత ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇవ్వాలి
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలో పోలవరం ముంపు ప్రాంత ఉపాధ్యాయులకు ఆప్షన్ అవకాశం ఇచ్చి, వారి ఇష్ట ప్రకారం వెళ్లే సదుపాయం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగటి నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపు ప్రాంతాలతోపాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఆప్షన్ ప్రకారం వెళ్లే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేంద్రం స్కేలు, స్థానిక ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులు, మండల విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీ చేసి విద్యారంగ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. అత్యంత తక్కువ వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేసిందని, రాబోయే ప్రభుత్వమైనా స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ఫైళ్లు క్లియర్ చేయాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహారావు మాట్లాడుతూ విద్యావికాస ఉద్యమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేయడం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా జూన్ 1 నుంచే నమోదు కార్యక్రమాల్లో ఉండాలని తెలిపారు.
సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. టీఎస్ యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కల్యాణం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షులు సీహెచ్.దుర్గాభవాని, జిల్లా కోశాధికారి జె.రాంబాబు, బి.రాందాస్, కాార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు, పి.కిష్టయ్య, ఎస్కె.మహబూబ్అలి, ఎ.రమాదేవి, బాలు, టి.ఆంజనేయులు, ఎం.నరసింహారావు, ఎస్కె.ఉద్దండు షరీఫ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.