Telangana Vijaya Dairy
-
విజయ డెయిరీ ద్వారా ఉచిత పాలు: తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఏటా రూ.17 లక్షలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద అఫ్జల్‌గంజ్ చుడిబజార్‌లో నిర్వహిస్తున్న రెయిన్బో హో మ్కు విజయ డెయిరీ ద్వారా ఉచితంగా పాల ను సరఫరా చేసేలా అనుమతిస్తూ జారీచేసిన పత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు. సొసై టీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హోమ్‌లో ఉన్న 93 మంది బాలికల కోసం ప్రతిరోజూ 20 లీటర్ల చొప్పున పాలను సంవత్సరంపాటు ఉచితం గా సరఫరా చేయనున్నట్లు చెప్పారు. సొసైటీ నిర్వాహకులు శ్రీనివాస్‌రెడ్డి, శివరాణిలు మం త్రి చేతుల మీదుగా ఉచిత పాల సరఫరాకు సంబంధించిన పత్రాన్ని అందుకున్నారు. -
కా‘పాడి’తేనే రైతుకు మేలు
* పాడి రైతులకు ఇంకా అందని ప్రోత్సాహకం * సర్కారు రూ.27 కోట్లు విడుదల చేసినా రైతులకు చెల్లించని తెలంగాణ విజయ డెయిరీ * రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నామంటూ సాకులు సాక్షి, హైదరాబాద్: పాలు పోసే రైతు నోట్లో మట్టి కొడుతోంది తెలంగాణ విజయ డెయిరీ. ప్రోత్సాహకం అందించకుండా నిరుత్సాహానికి గురిచేస్తోంది. సర్కార్ కరుణించినా విజయ డెయిరీ సాకులు వెతుకుతోంది. తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకపు సొమ్ము బకాయిలను విజయ డెయిరీ ఇంకా చెల్లించనేలేదు. లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహం అందించాలి. నాలుగు నెలలుగా బకాయిలు పేరుకుపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల రూ.27 కోట్ల బకాయి సొమ్ము విడుదల చేసినా వాటిని రైతుకు అందించడంలో ఆలస్యమవుతోంది. ప్రోత్సాహకపు సొమ్ముతోపాటు రైతుకు ఇవ్వాల్సిన వాస్తవ పాల డబ్బులు కూడా సకాలంలో అందించడంలేదు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ప్రోత్సాహకం, అసలు సొమ్మును వేర్వేరుగా రైతుల ఖాతాలో వేసేందుకు కసరత్తు చేస్తున్నామని విజయ డెయిరీ అధికారులు సాకులు చెబుతున్నారు. దానికోసం రైతు ఖాతాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం విజయడెయిరీని కోరిందని పశు సంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. ఈ తతంగమంతా పూర్తి అయి రైతులకు బకాయిలు చేరాలంటే మరో నెల రోజుల వరకు పట్టే అవకాశముంది. కరువులో రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని తెలంగాణ ఆదర్శ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. ఏడాదిపాటు సక్రమంగా నడిపి ఇప్పుడు చేతులెత్తేశారు... విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 నగదు ప్రోత్సాహం కల్పిస్తూ ప్రభుత్వం 2014 అక్టోబర్ 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ఉత్తర్వును అమలు చేసింది. వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు ఛాయల నేపథ్యంలో రైతులు పాడిని ప్రత్యామ్నాయ జీవనవిధానంగా మలుచుకుంటున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు పేర్కొంది. అందులో భాగంగా విజయడెయిరీ పరిధిలోని రైతులకు లీటరుకు 4 రూపాయలను ప్రోత్సాహకం కింద అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో లీటరుకు రూ.28 చొప్పున చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలుకాకముందు విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. ఉత్తర్వు అమలు ప్రారంభమైన 2014 నవంబర్ నుంచి 2015 అక్టోబర్ వరకు సరిగ్గా ఈ ఏడాది కాలంలో పాల సేకరణ 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. ఇది సర్కారు అంచనాలను మించింది. అయితే గత ఏడాది అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును విజయ డెయిరీ సక్రమంగానే అందించింది. నవంబర్ రెండోవారం నుంచి సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. దీంతో పాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తోన్న రైతులు రోడ్డున పడ్డారు. -
తెలంగాణ విజయ డెయిరీ ఏర్పాటు
పాడి అభివృద్ధి సహకార సమాఖ్యగా రిజిస్ట్రేషన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) విభజన ప్రక్రియ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పాడి అభివృద్ధి సహకార సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని శుక్రవారం తెలంగాణ విజయ డెయిరీ అధికారులు అందుకున్నారు. అయితే తెలంగాణలోనూ విజయ డెయిరీ పేరే కొనసాగనుంది. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఏపీ డెయిరీకి చైర్మన్‌గా మన్మోహన్సింగ్ ఉండగా, తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్‌గా తెలంగాణ పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా వ్యవహరించనున్నారని విజయ డెయిరీ వర్గాలు తెలిపాయి. దశల వారీగా ఆస్తుల విభజన ప్రక్రియ జరగనుంది. ఏపీలో 52 మంది ఉద్యోగులుండగా, తెలంగాణ డెయిరీలో 390 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, ఏపీలోనూ తెలంగాణ పాల సేకరణ ఉన్నందున కలసి పనిచేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఏపీ డెయిరీకి గత పదేళ్లకు పైగా ఎన్నికలు జరగలేదు. డెయిరీ విభజన పూర్తిస్థాయిలో జరిగి తెలంగాణ డెయిరీ ఏర్పడ్డాక పాడి సహకార ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని వ్యవసాయ మంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.