కా‘పాడి’తేనే రైతుకు మేలు | Telangana Vijaya Dairy Drought with Money problems | Sakshi
Sakshi News home page

కా‘పాడి’తేనే రైతుకు మేలు

Published Fri, May 6 2016 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

కా‘పాడి’తేనే రైతుకు మేలు

కా‘పాడి’తేనే రైతుకు మేలు

* పాడి రైతులకు ఇంకా అందని ప్రోత్సాహకం
* సర్కారు రూ.27 కోట్లు విడుదల చేసినా రైతులకు చెల్లించని తెలంగాణ విజయ డెయిరీ
* రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నామంటూ సాకులు

సాక్షి, హైదరాబాద్: పాలు పోసే రైతు నోట్లో మట్టి కొడుతోంది తెలంగాణ విజయ డెయిరీ. ప్రోత్సాహకం అందించకుండా నిరుత్సాహానికి గురిచేస్తోంది. సర్కార్ కరుణించినా విజయ డెయిరీ సాకులు వెతుకుతోంది. తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకపు సొమ్ము బకాయిలను విజయ డెయిరీ ఇంకా చెల్లించనేలేదు. లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహం అందించాలి.

నాలుగు నెలలుగా బకాయిలు పేరుకుపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల రూ.27 కోట్ల బకాయి సొమ్ము విడుదల చేసినా వాటిని రైతుకు అందించడంలో ఆలస్యమవుతోంది. ప్రోత్సాహకపు సొమ్ముతోపాటు రైతుకు ఇవ్వాల్సిన వాస్తవ పాల డబ్బులు కూడా సకాలంలో అందించడంలేదు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ప్రోత్సాహకం, అసలు సొమ్మును వేర్వేరుగా రైతుల ఖాతాలో వేసేందుకు కసరత్తు చేస్తున్నామని విజయ డెయిరీ అధికారులు సాకులు చెబుతున్నారు. దానికోసం రైతు ఖాతాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం విజయడెయిరీని కోరిందని పశు సంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి.

ఈ తతంగమంతా పూర్తి అయి రైతులకు బకాయిలు చేరాలంటే మరో నెల రోజుల వరకు పట్టే అవకాశముంది. కరువులో రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని తెలంగాణ ఆదర్శ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు.
 
ఏడాదిపాటు సక్రమంగా నడిపి ఇప్పుడు చేతులెత్తేశారు...
 విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 నగదు ప్రోత్సాహం కల్పిస్తూ ప్రభుత్వం 2014 అక్టోబర్ 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ఉత్తర్వును అమలు చేసింది. వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు ఛాయల నేపథ్యంలో రైతులు పాడిని ప్రత్యామ్నాయ జీవనవిధానంగా మలుచుకుంటున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు పేర్కొంది. అందులో భాగంగా విజయడెయిరీ పరిధిలోని రైతులకు లీటరుకు 4 రూపాయలను ప్రోత్సాహకం కింద అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఈ లెక్కన ఒక్కో లీటరుకు రూ.28 చొప్పున చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలుకాకముందు విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. ఉత్తర్వు అమలు ప్రారంభమైన 2014 నవంబర్ నుంచి 2015 అక్టోబర్ వరకు సరిగ్గా ఈ ఏడాది కాలంలో పాల సేకరణ 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. ఇది సర్కారు అంచనాలను మించింది. అయితే గత ఏడాది అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును విజయ డెయిరీ సక్రమంగానే అందించింది. నవంబర్ రెండోవారం నుంచి సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. దీంతో పాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తోన్న రైతులు రోడ్డున పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement