ఆరాధ్య.. ఉదయ్ కిరణ్.. లక్ష్మీప్రియ.. మోక్షజ్ఞ..
హైదరాబాద్: అభంశుభం తెలియని చిన్నారులను అయినవారే హతమారుస్తున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆస్తులు, అక్రమ సంబంధాలు, తగవులతో పసివాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. పెద్దోళ్ల ఆవేశకావేశాలకు చిన్నారులు సమిధలు మారుతున్నారు. తెలుగు గడ్డపై ఇటీవల చోటు చేసుకున్న మూడు ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా రెండేళ్ల వయసున్న మోక్షజ్ఞను సొంత చిన్నాన్నే కడతేర్చిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తెనాలికి చెందిన మోక్షజ్క్ష అనే బాలుడ్ని సొంత చిన్నాన్నే కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆస్తి కోసమే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. మోక్షజ్ఞ తండ్రి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
భార్యతో ఏకాంతానికి అడ్డుగా మారిందన్న అక్కసుతో ఆరాధ్య అనే 19 నెలల చిన్నారిని సొంత బాబాయ్ పొట్టన పెట్టుకున్న అమానవీయ ఘటన ఒంగోలులో నవంబర్ లో చోటుచేసుకుంది. పసిపాపపై పెట్రోల్ పోసి నిప్పటించి పాశవికంగా చంపేశాడు.
డబ్బుకోసం ఏడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్‌ను స్వయానా పెదనాన్న కొడుకే కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన వనస్థలిపురంలో జరిగింది. కిడ్నాప్ వ్యవహారం బయటపడుతుందన్న భయంతో ఉదయ్ కిరణ్ గొంతు నులిమి హత్య చేశారు. స్నేహితులతో కలిసి నిందితుడు ఈ కిరాతానికి ఒడిగట్టాడు. చిత్తూరు జల్లా తిరుచానూరులో లక్ష్మీప్రియ అనే ఐదేళ్ల చిన్నారిని వరుసకు మేనమామ అయ్యే వ్యక్తే మూడు రోజుల క్రితం హత్య చేశాడు. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులను అయినవారే అంతమొందించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.