రూ.100 కోట్లతో విజయవాడ దూరదర్శన్
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా దూరదర్శన్ కేంద్రాలు ఉండాలనే ఉద్దేశంతో విజయవాడలో కొత్తగా డీడీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. విజయవాడలో కొత్తగా పూర్తిస్థాయి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈనెల 27వ తేదీన విజయవాడలో డీడీ కేంద్రాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ప్రసారభారతి సీఈవో, దూరదర్శన్ డెరైక్టర్ జనరల్‌తో సమావేశమై విజయవాడలో డీడీ ఏర్పాటుపై చర్చించామన్నారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రానికి రూ.100 కోట్లు వ్యయం అవుతుందన్నారు.