‘తెలుగు ప్రాచీన కేంద్రానికి స్థలం ఇవ్వండి’
హైదరాబాద్: తెలుగు ప్రాచీన కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటుచేసేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని శాసనసభ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలుగు ప్రాచీన కేంద్రం ప్రస్తుతం మైసూర్లో ఉందని, దీన్ని ఏపీకి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని బుద్ధప్రసాద్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. నాగార్జున వర్సిటీలో తెలుగు ప్రాచీన కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి స్థలాన్ని ఇవ్వాలని, దీనిపై త్వరితంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరారు.
ఈ లేఖపై తదుపరి చర్యలకు సంబంధించి మంత్రి గంటా శనివారం అధికారులతో చర్చించారు. అయితే కేంద్రప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదని, అవేవీ లేకుండా ముందుగా స్థలం కేటాయింపు ఎలా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తపరిచినట్లు తెలిసింది. తెలుగు ప్రాచీన కేంద్రం తరలింపునకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చాకనే తదుపరి చర్యలు తీసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో మంత్రి గంటా ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.