Telugu film journalist
-
సినిమాలతో సంబంధం లేకుండా మనమంతా కలుసుకోవాలి
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు గురువారం ఆయనను నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో తేనీటి విందులో పాల్గొన్న చిరంజీవి తన చిత్రాలను గురించి సవివరంగా ముచ్చటించారు. 'ఆచార్య' మూవీ తదనానంతర పరిణామాలను మనసు విప్పి చెప్పారు. అలానే 'గాడ్ ఫాదర్' సక్సెస్ తర్వాత తనను కలిసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్న వారిని కలుసుకోవడం తన కర్తవ్యంగా భావించానని అన్నారు. 'ఆచార్య' పరాజయానికి తాను కృంగిపోలేదని, ఇప్పుడు 'గాడ్ ఫాదర్' విజయానికి పొంగి పోవడం లేదని, అలాంటి స్థితప్రజ్ఞతను సాధించానని చెప్పారు. 'లూసిఫర్'ను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్‌లో బలంగా కలిగించాడని, అతనికి దర్శకత్వం వహించే తీరిక లేకపోవడంతో వేరెవరితో అయినా ఆ ప్రాజెక్ట్ ను ప్రారంభించమని సలహా ఇచ్చాడని అన్నారు. ఒకానొక సమయంలో ఆ చిత్రం రీమేక్ ఆలోచన విరమించుకున్నానని, అయితే రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మోహన రాజా ను ఎంపిక చేయడంతో మళ్లీ పట్టాలు ఎక్కిందని, అతని బృందం 'లూసిఫర్' మూవీని తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిందని, అది వర్కౌట్ అయ్యిందని చిరంజీవి అన్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు రచయితలూ తన కోసం వైవిధ్యమైన కథలు చేస్తారనే నమ్మకం కలిగిందని, కరోనా సమయంలో ప్రేక్షకులలో వచ్చిన మార్పు కారణంగానే తానూ 'లూసిఫర్' లాంటి విభిన్న చిత్రాన్ని ధైర్యంతో చేశానని చిరంజీవి చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శకుడు బాబీ 'వాల్తేరు వీరయ్య', మెహర్ రమేశ్ 'భోళా శంకర్' చిత్రాల విశేషాలనూ చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో తనకున్న చిరకాల అనుబంధాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. హెల్త్ కార్డుల పంపిణీ సమయంలో అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉందని అన్నారు. 'గాడ్ ఫాదర్' లాంటి విజయవంతమైన చిత్రాలు మరిన్ని చేయాలని, ఆ రకంగా తామంతా మళ్ళీ మళ్ళీ కలిసే ఆస్కారం ఏర్పడుతుందని టి.ఎఫ్.జె.ఎ. అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీ నారాయణ, వై. జె. రాంబాబు తెలిపారు. అయితే... సినిమాలతో సంబంధం లేకుండానే తనను కలుసుకోవాలని తాను కోరుకుంటానని, ఇలాంటి ఆత్మీయ కలయికతో తనకు గూస్ బంబ్స్ వస్తాయని చిరంజీవి బదులిచ్చారు. చదవండి: గాడ్ ఫాదర్ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ నన్ను ఎద్దేవా చేసేవారిని ప్రేమతో దగ్గరకు తీసుకుంటా -
ఆయన గుడ్‌విల్ అది!
తెలుగు సినిమా జర్నలిస్ట్‌ల్లో రామానాయుడు గారిని అతి తక్కువగా కలిసింది నేనేనేమో. అయినప్పటికీ కలిసినప్పుడల్లా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు ఎటువంటి దాపరికమూ లేకుండా నాతో మాట్లాడేవారు. ఆయనతో నాకు గల అనుభవాలలో కొన్ని... ఒకసారి ఓ ఆడియో ఫంక్షన్లో రామానాయుడు ఏదో పని మీద అటు వచ్చారు. కూచొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఏవీయస్ కనిపించారాయనకి. ‘‘హలో ఏవీయస్... ఎలా ఉన్నావ్?’’ అంటూ లేచి వెళ్లి కౌగలించుకున్నారు. ఏవీయస్ వెళ్లిపోయాక ‘‘మీకు సూపర్ ఫ్లాప్ ఇచ్చాడు (‘సూపర్ హీరోస్’ సినిమా) కదా... అంత ఆనందంగా ఎలా కావలించుకోగలుగుతున్నారు?’’ అని అడిగాను. ‘‘అతన్ని డెరైక్టర్‌గా పెట్టడంలో నా తప్పు కూడా ఉంది కదా... అతన్నొక్కణ్ణే తప్పు పడితే ఎలా? అది తప్పిస్తే అతను నాకు నటుడిగా ఓకే... నేను ఏదైనా ఓ ఫంక్షన్ అనుకుంటే నాకు రైట్ హ్యాండ్‌లా అన్నీ తానే అయి నడిపిస్తాడు. ఎప్పుడైనా మా సినిమాల గురించి ఓ చిన్న ప్రెస్ మ్యాటర్ మంచి మంచి పాయింట్స్‌తో నాకు ఎలా కావాలంటే అలా క్షణాల్లో ఇవ్వగలిగేది ఏవీయస్సే. ఇన్ని ప్లస్సులు పెట్టుకుని ఒక్క మైనస్‌నే మనసులో పెట్టుకుంటే ఎలా?’’ అని జవాబిచ్చారు రామానాయుడు. హృదయాన్ని రకరకాల అరలుగా విభజించుకుని దేనికదే అని అనుకోగలగడం, తన మీద తనకు ఎంతో కంట్రోల్ ఉంటేనే గాని సాధ్యంపడదు. తెలుగు సినిమాల్లో వృద్ధ పాత్రలకు తనకు తానే సాటి అయిన నిర్మలమ్మ షూటింగ్ గ్యాప్‌లో సెట్ బైట కూచొని ఉన్నారు. ఆవిడ అక్కడ ఉన్నారని తెలుసుకున్న రామానాయుడు వచ్చి ‘‘అమ్మా... మూడు సినిమాల పేమెంట్స్ మీకు పెండింగ్ ఉండి పోయిందమ్మా... ఎన్నిసార్లు మావాళ్లు అడిగినా మీరు తీసుకోవడం లేదట. ఇలా అయితే ఎలా? నేను మా ఆడిటర్లక్కూడా చెప్పుకోవాలి కదా?’’ అన్నారు. దానికావిడ ‘‘నీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది నాయుడూ.. ఉంచు.. రేప్పొద్దున్న ఎలా ఉంటుందో ఏమిటో.. నా అంత్యక్రియలకైనా ఉపయోగపడుతుంది’’ అన్నారావిడ. ‘‘అలా అనకమ్మా... ఎవరు ముందో ఎవరికి తెలుసు.. నాకే ఏమైనా అయితే నీ డబ్బు నీకెవరిస్తారు చెప్పు?’’ అన్నారాయన. ‘‘నాకా భయం లేదు. నీ పిల్లలు రత్నాలు. నేను అబద్ధం ఆడినా సరే నీకు మాత్రం మాట రానివ్వరు’’ అని అన్నారు నిర్మలమ్మ. అదీ రామానాయుడు గారు సంపాదించుకున్న గుడ్ విల్. సినిమా పరిశ్రమలో రాహుకాలాన్ని ఎంతో నమ్మకంతో, నియమబద్ధంగా, క్రమం తప్పకుండా పాటించడంలో రామానాయుడు తరువాతే ఎవరైనా. ఈ రాహుకాలం ప్రతి రోజూ గంటన్నర పాటు ఉంటుంది. ‘‘ఈ గంటన్నరా ఏం చేస్తారు?’’ అని అడిగితే ‘‘ఫోన్లు తీసి పక్కన పడేస్తాను. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసేస్తాను. ఎటువంటి వార్తలు నాకు చేరకుండా, నేనెవరితో మాట్లాడకుండా తలుపులేసుకుని మంచం మీద మౌనంగా పడుకుంటాను’’ అని జవాబిచ్చారు. దీని గురించి ఇంకా మాట్లాడుతూ - ‘‘మద్రాసు నుంచి ఈ అలవాటు ఉంది. హైదరాబాద్ వచ్చాక కొన్నాళ్లు రాహుకాలాన్ని మానేసి మనదైన పద్ధతిలో వర్జ్యం పాటించా. వరుసగా ఫ్లాపులు రావడంతో, తిరిగి రాహుకాలాన్ని మొదలు పెట్టాను. విజయాలు రావడం మొదలయింది. అలా రాహుకాలం నాకు పర్మినెంట్ అయిపోయింది’’ అని మనసులోని నిజాన్ని ఎటువంటి భేషజం లేకుండా చెప్పేశారు రామానాయుడు. ఇంకోసారి ‘‘మిమ్మల్ని డాడీ రామానాయుడు అని అంటారు కదా. దానర్థం తండ్రి అని కాదుటండీ. డాక్టర్ డి. రామానాయుడు అని షార్ట్‌కట్ అండీ’’ అని జోక్ చేస్తే ‘‘భలే చెప్పావయ్యా... అందమైన హీరోయిన్లు డాడీ అంటుంటే ఇబ్బందిగానే ఉంటోంది’’ అన్నారు స్పోర్టివ్‌గా తీసుకుని కన్నుకొడుతూ. - రాజా, మ్యూజికాలజిస్ట్