ఆయన గుడ్‌విల్ అది!
తెలుగు సినిమా జర్నలిస్ట్‌ల్లో రామానాయుడు గారిని అతి తక్కువగా కలిసింది నేనేనేమో. అయినప్పటికీ కలిసినప్పుడల్లా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు ఎటువంటి దాపరికమూ లేకుండా నాతో మాట్లాడేవారు. ఆయనతో నాకు గల అనుభవాలలో కొన్ని...
ఒకసారి ఓ ఆడియో ఫంక్షన్‌లో రామానాయుడు ఏదో పని మీద అటు వచ్చారు. కూచొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఏవీయస్ కనిపించారాయనకి. ‘‘హలో ఏవీయస్... ఎలా ఉన్నావ్?’’ అంటూ లేచి వెళ్లి కౌగలించుకున్నారు. ఏవీయస్ వెళ్లిపోయాక ‘‘మీకు సూపర్ ఫ్లాప్ ఇచ్చాడు (‘సూపర్ హీరోస్’ సినిమా) కదా... అంత ఆనందంగా ఎలా కావలించుకోగలుగుతున్నారు?’’ అని అడిగాను. ‘‘అతన్ని డెరైక్టర్‌గా పెట్టడంలో నా తప్పు కూడా ఉంది కదా... అతన్నొక్కణ్ణే తప్పు పడితే ఎలా? అది తప్పిస్తే అతను నాకు నటుడిగా ఓకే... నేను ఏదైనా ఓ ఫంక్షన్ అనుకుంటే నాకు రైట్ హ్యాండ్‌లా అన్నీ తానే అయి నడిపిస్తాడు. ఎప్పుడైనా మా సినిమాల గురించి ఓ చిన్న ప్రెస్ మ్యాటర్ మంచి మంచి పాయింట్స్‌తో నాకు ఎలా కావాలంటే అలా క్షణాల్లో ఇవ్వగలిగేది ఏవీయస్సే. ఇన్ని ప్లస్సులు పెట్టుకుని ఒక్క మైనస్‌నే మనసులో పెట్టుకుంటే ఎలా?’’ అని జవాబిచ్చారు రామానాయుడు. హృదయాన్ని రకరకాల అరలుగా విభజించుకుని దేనికదే అని అనుకోగలగడం, తన మీద తనకు ఎంతో కంట్రోల్ ఉంటేనే గాని సాధ్యంపడదు.
తెలుగు సినిమాల్లో వృద్ధ పాత్రలకు తనకు తానే సాటి అయిన నిర్మలమ్మ షూటింగ్ గ్యాప్‌లో సెట్ బైట కూచొని ఉన్నారు. ఆవిడ అక్కడ ఉన్నారని తెలుసుకున్న రామానాయుడు వచ్చి ‘‘అమ్మా... మూడు సినిమాల పేమెంట్స్ మీకు పెండింగ్ ఉండి పోయిందమ్మా... ఎన్నిసార్లు మావాళ్లు అడిగినా మీరు తీసుకోవడం లేదట. ఇలా అయితే ఎలా? నేను మా ఆడిటర్లక్కూడా చెప్పుకోవాలి కదా?’’ అన్నారు. దానికావిడ ‘‘నీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది నాయుడూ.. ఉంచు.. రేప్పొద్దున్న ఎలా ఉంటుందో ఏమిటో.. నా అంత్యక్రియలకైనా ఉపయోగపడుతుంది’’ అన్నారావిడ. ‘‘అలా అనకమ్మా... ఎవరు ముందో ఎవరికి తెలుసు.. నాకే ఏమైనా అయితే నీ డబ్బు నీకెవరిస్తారు చెప్పు?’’ అన్నారాయన. ‘‘నాకా భయం లేదు. నీ పిల్లలు రత్నాలు. నేను అబద్ధం ఆడినా సరే నీకు మాత్రం మాట రానివ్వరు’’ అని అన్నారు నిర్మలమ్మ. అదీ రామానాయుడు గారు సంపాదించుకున్న గుడ్ విల్.
సినిమా పరిశ్రమలో రాహుకాలాన్ని ఎంతో నమ్మకంతో, నియమబద్ధంగా, క్రమం తప్పకుండా పాటించడంలో రామానాయుడు తరువాతే ఎవరైనా. ఈ రాహుకాలం ప్రతి రోజూ గంటన్నర పాటు ఉంటుంది. ‘‘ఈ గంటన్నరా ఏం చేస్తారు?’’ అని అడిగితే ‘‘ఫోన్‌లు తీసి పక్కన పడేస్తాను. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసేస్తాను. ఎటువంటి వార్తలు నాకు చేరకుండా, నేనెవరితో మాట్లాడకుండా తలుపులేసుకుని మంచం మీద మౌనంగా పడుకుంటాను’’ అని జవాబిచ్చారు. దీని గురించి ఇంకా మాట్లాడుతూ - ‘‘మద్రాసు నుంచి ఈ అలవాటు ఉంది. హైదరాబాద్ వచ్చాక కొన్నాళ్లు రాహుకాలాన్ని మానేసి మనదైన పద్ధతిలో వర్జ్యం పాటించా. వరుసగా ఫ్లాపులు రావడంతో, తిరిగి రాహుకాలాన్ని మొదలు పెట్టాను. విజయాలు రావడం మొదలయింది. అలా రాహుకాలం నాకు పర్మినెంట్ అయిపోయింది’’ అని మనసులోని నిజాన్ని ఎటువంటి భేషజం లేకుండా చెప్పేశారు రామానాయుడు.
ఇంకోసారి ‘‘మిమ్మల్ని డాడీ రామానాయుడు అని అంటారు కదా. దానర్థం తండ్రి అని కాదుటండీ. డాక్టర్ డి. రామానాయుడు అని షార్ట్‌కట్ అండీ’’ అని జోక్ చేస్తే ‘‘భలే చెప్పావయ్యా... అందమైన హీరోయిన్‌లు డాడీ అంటుంటే ఇబ్బందిగానే ఉంటోంది’’ అన్నారు స్పోర్టివ్‌గా తీసుకుని కన్నుకొడుతూ.
- రాజా, మ్యూజికాలజిస్ట్