కొండంత అవమానంపై తెలుగు మహిళ నిరసన
ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్
ఈవో కార్యాలయం వద్ద ధర్నా
బోట్‌క్లబ్ (కాకినాడ) :
తనను బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యురాలిగా నియమించినప్పటికీ ప్రమాణ స్వీకారం చేయించకుండా ముప్పు తిప్పులు పెడుతున్నారని తెలుగుమహిళ సలాది ఉదయలక్ష్మి వాపోయారు. తన ప్రమాణ స్వీకారం జరిగే వరకూ ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ శుక్రవారం బాలాత్రిపుర సుందరి ఆలయ ఈవో చింతపల్లి విజయభాస్కర్‌రెడ్డి కార్యాలయం ఎదురుగా ధర్నా చేశారు. తనను ఎందుకు పక్కన పెట్టారో తెలపాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జి వచ్చేంత వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ సుమారు రెండు గంటల పాటు భీష్మించుకొని కూర్చుండిపోయారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినా తనకు అపాయిమెంట్ ఇవ్వడం లేదని, కావాలనే తాత్సారం చేస్తున్నారని వాపోయారు. పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లను ఇలా చేయడం చాలా బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలో లేకపోయిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తనను అవమానిస్తున్నారన్నారు. తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఈవోను కోరారు. సభ్యురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీని ఈవోకు అందజేశారు.
నామినేడెట్ పదవుల్లో మా జోక్యం ఉండదు : ఈవో
ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో తమ జోక్యం ఏమీ ఉండదని ఈవో చింతపల్లి విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విజయలక్ష్మి నియామకం పెండింగ్‌లో పెట్టాలని చెప్పడంతో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించలేదని తెలిపారు.
సాక్షి కథనంపై చర్చ
‘కొండ’ంత అవమానం పేరుతో శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పలువురు చర్చించుకున్నారు. సలాది ఉదయలక్ష్మిని సభ్యురాలిగా నియమించిన టీడీపీ నాయకులు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు మోకాలడ్డు వేస్తున్నారని, ఆమె పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘సాక్షి’ ఇచ్చిన కథనం చదివి పలువురు ముక్కుమీద వేలేసుకున్నారు.
ముఖం చాటేసిన చైర్మన్
ప్రతిరోజూ ఆలయానికి వచ్చే కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జి కార్యాలయం వద్ద ఉదయలక్ష్మి ధర్నా చేయడంతో అమ్మవారి ఆలయ పరిసరాల్లో కనిపించలేదు. ఉదయలక్ష్మి ఈవో కార్యాలయం వద్ద ధర్నా చేసున్న విషయం తెలుసుకున్న ఆయన ఆలయానికి రాకుండా ముఖం చాటేశారు.