telugu release
-
పా.. పా వస్తోంది
కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దా... దా...’. గణేష్ కె. బాబు దర్శకత్వం వహించారు. ఎస్. అంబేత్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో హిట్ అయింది. ఈ సినిమా ‘పా... పా...’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జేకే ఎంటర్టైన్మెంట్స్పై ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘‘యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘పా... పా...’. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నాం. కొత్త తరహా చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ‘పా...పా...’ని కూడా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎంఎస్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: కె. ఎళిల్ అరసు, సంగీతం: జెన్ మార్టిన్, సహనిర్మాతలు: శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు. -
పాత్రలే దెయ్యాలైతే..!
కాజల్, రెజీనా, జననీ అయ్యర్ ముఖ్య తారలుగా నటించిన తమిళ చిత్రం ‘కరుంగాప్పియం’. డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్ పతాకంపై ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్ధన్ ‘కార్తీక’ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ముత్యాల రాందాస్, టి. జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇందులో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే క్రమంలో రెజీనా లైబ్రరీలో వందేళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్ చదువుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పే బుక్ అది. అయితే అందులోని పాత్రల గురించి చదువుతున్నప్పుడు అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు వస్తాయి. ఇక తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్ చేశారు. జనని పాత్ర కూడా అలరించే విధంగా ఉంటుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని డీకే అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
అమ్మని ఇష్టపడేవాళ్లు రుద్రుడుని ఇష్టపడతారు
‘‘అటు సినిమాలు, ఇటు సేవా కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయడం మొదట్లో కష్టంగా ఉండేది. తర్వాత అలవాటైంది. ఇప్పటివరకూ దాదాపు 150 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించాను. సినిమాల్లో హీరోగా ఉండటం కంటే రియల్ లైఫ్‌లో హీరోగా ఉండాలనేది నా కోరిక’’ అన్నారు రాఘవా లారెన్స్. కతిరేశన్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా రూపొందిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలవుతోంది. నిర్మాత ‘ఠాగూర్’ మధు ‘రుద్రుడు’ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్ చెప్పిన విశేషాలు. ► ‘రుద్రుడు’ మదర్ సెంటిమెంట్ ఫిల్మ్. నా ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సందేశం ఉన్నట్టే ఇందులోనూ అమ్మానాన్నల గురించి ఓ చక్కని సందేశం ఉంది. ఈ చిత్రంలో ఐటీ ఉద్యోగం చేసే ఒక మధ్య తరగతి కుర్రాడిలా కనిపిస్తాను. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిని పరిస్థితులు ఎలా మాస్‌గా మార్చాయి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. అమ్మని ఇష్టపడేవాళ్లంతా ‘రుద్రుడు’ మూవీని ఇష్టపడతారు. ► నన్ను కొత్తగా చూపించాలనే కతిరేశన్గారి తపన నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలోని భావోద్వేగాలు, థ్రిల్, వినోదం, మాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు వంద శాతం చేరువ అవుతాయి. ► ‘ఠాగూర్’ మధుగారు నాకు లక్కీ ప్రొడ్యూసర్. నాపై ఆయనకి చాలా నమ్మకం. మరోసారి ఆ నమ్మకాన్ని ‘రుద్రుడు’ నిలబెట్టుకుంటుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్‌గారు విలన్‌గా చేశారు. నా పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఆయన పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ‘అఖండ’ సినిమా ఫైట్స్ నాకు నచ్చడంతో ఆ మూవీకి పని చేసిన శివ మాస్టర్ని తీసుకున్నాం. ‘రుద్రుడు’లో కథకు తగ్గట్టు యాక్షన్‌ని డిజైన్ చేశారాయన. ప్రస్తుతం ‘చంద్రముఖి 2, జిగర్తాండ 2’ సినిమాల్లో నటిస్తున్నాను. అలాగే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కథ, స్క్రీన్ ప్లే అందించి, నిర్మిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాను. -
ఉలవచారు బిర్యానీ చాలా ఇష్టం
‘‘ముప్పైఏళ్లుగా తెలుగువారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ గార్లు, ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఇలా అందరూ నాకు మంచి స్నేహితులు.. చాలా మోటివేట్ చేస్తారు’’ అని కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శివ’. శివ రాజ్‌కుమార్ భార్య గీత నిర్మించిన ఈ చిత్రం కన్నడలో గత డిసెంబరు 23న రిలీజైంది. ఈ చిత్రాన్ని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి నేడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్ చెప్పిన విశేషాలు. ► రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నేను నటించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ (2016) చిత్రం తెలుగులో విడుదలైంది. ఆ సినిమాని ఇక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించడం హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ‘శివ వేద’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం వెరీ హ్యాపీ. ► ‘వేద’ కన్నడలో విడుదలై 50 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మంచి ఆదరణ వస్తోంది. ‘శివ వేద’లో వినోదం, భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనేది ఈ చిత్రంలో ఉంటుంది. ‘వేద’ అనేది క్యారెక్టర్ పేరు. లవ్, లైఫ్, హ్యాపీనెస్, ట్రస్ట్.. ఇవన్నీ వేద లైఫ్‌లో ఉంటాయి. ► ‘శివ వేద’ని కన్నడ, తెలుగులో ఒకే రోజు రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, పబ్లిసిటీకి సమయం లేకపోవ డంతో ఇక్కడ విడుదల చేయలేదు. కన్నడ, తమిళ్లో రిలీజ్ చేయగా మంచి హిట్టయ్యింది. తమిళంలోనూ బాగా ఆదరిస్తున్నారు. హర్షకి నాపై ఉన్న నమ్మకం వల్లే మా కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు చేశాం. ► తెలుగు, కన్నడ ఇండస్ట్రీలు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు మాట్లాడగలను. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకరే ఉండలేరు.. ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు కాబట్టి కొత్తవారిని ప్రోత్సహించాలి. ► భక్తి నేపథ్యంలో ఓ మూవీ చేయాలని ఉంది. పునీత్ రాజ్‌కుమార్ బయోపిక్ తీసే ఆలోచన లేదు. ప్రస్తుతం రజనీ సార్‌తో ‘జైలర్’, ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ చేస్తున్నాను. తెలుగులో రెండు, మూడు ప్రాజెక్ట్స్ విన్నాను. -
నేనేనా? ఇది నిజమేనా?
కన్ను కొట్టి, కవ్వించిన పిల్ల రివ్వున ఎగి రింది. మబ్బులను దగ్గరగా చూసి సంబరపడిపోయింది. ‘మనం ఏంటి? ఎగరడం ఏంటి? ఇది కలా? నిజమా?’ అని ఒక్కసారి గిల్లి చూసుకుంది. ‘మనమే.. ఎగురుతున్నది మనమే’ అని ఆనందపడింది. మరి.. ఫస్ట్ టైమ్ విమానం ఎక్కితే ఎవరైనా ఇలానే ఆనందపడతారు కదా. జస్ట్ చిరునవ్వు నవ్వి, కన్ను కొట్టినందుకు బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ తొలిసారి ఫ్లైట్ ఎక్కింది. కొచ్చి టు తిరువనంతపురం ట్రావెల్ చేసిందీ బ్యూటీ. తొలి విమాన ప్రయాణం టికెట్‌ను దాచుకుందట. ‘లైఫ్‌లో తొలిసారి ఫ్లైట్ ఎక్కాను’ అని పేర్కొంది. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈలోపు టీజర్ ద్వారా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అందరూ ఆమె నటిస్తున్న తొలి చిత్రం ‘ఒరు అడార్ లవ్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒమర్ లులు దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో విడుదల చేస్తారు. -
'కబాలి' తెలుగు ఫ్యాన్స్‌కి ఇది చేదువార్త!
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనే అంతే ఉంది. ఈ తమిళ సూపర్ హీరోకి తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడుకు దీటుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన సినిమాలు వసూళ్లు రాబడుతాయి. కాబట్టి రజనీ సినిమా అంటే తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల కావాల్సిందే. కానీ రజనీ తాజా సినిమా 'కబాలి' విషయానికొస్తే.. ఇది జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. భారత తొలి ఫొటో రియలిస్టిక్ సినిమా రూపొందిన 'కొచ్చాడయన్' పరాజయం ఇంకా రజనీని వెంటాడుతూనే ఉంది. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకురాలిగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 'విక్రమసింహ'గా విడుదలైంది. రజనీ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా తెలుగు హక్కులను లక్ష్మిగణపతి ఫిలింస్‌కు చెందిన శోభన్ బాబు భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ సినిమా మెగా అట్టర్ ప్లాప్ కావడంతో తీవ్రంగా నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఒకవేళ ప్లాప్ అయితే, రూ. 7 కోట్లు పరిహారంగా ఇస్తానని ఒప్పుకున్నారని, కానీ ఈ సినిమాతో తాము భారీగా మునిగినా గ్యారెంటీగా పేర్కొన్న రూ. 7 కోట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో తమ గ్యారెంటీ సొమ్ము తిరిగిచ్చేవరకు తెలుగులో ఈ సినిమా విడుదలను ఆపేయాలని నష్టపోయిన డిస్టిబ్యూటర్లు భావిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో వచ్చే జూన్‌లో తెలుగులో ఈ సినిమా విడుదల సందేహామేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక వృద్ధ మాఫియా డాన్‌గా తనదైన స్టైల్‌తో, స్టామినాతో రజనీ 'కబాలి'గా విడుదలైన టీజర్ యుట్యూబ్లో సంచనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే కోటికిపైగా వ్యూస్ దక్కించుకున్న ఈ టీజర్ రికార్డులను బద్దలుకొడ్తూ దూసుకుపోతున్నది.