అండగా ఉంటా..
సాక్షి, ముంబై: రాష్ర్టంలోని తెలుగువారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తానని రాష్ర్ట గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చారు. రాజ్‌భవన్‌లో ఆయనను మంగళవారం వర్లీలోని తెలుగు సుధారక యువక సంఘం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు స్థానిక తెలుగు ప్రజల కష్టాలు, ఇబ్బందులు, సమస్యల గురించి సభ్యులు ఏకరువు పెట్టారు. ముంబై నగర నిర్మాణంలో తెలుగువారి పాత్ర కీలకమని మహారాష్ర్ట నాయకులు ఎప్పుడూ అనడమే తప్ప తమకు ప్రత్యేక గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబైలో నివసిస్తున్న లక్షలాది తెలుగు ప్రజలకు మేలు చేస్తున్నట్లు చెబుతున్న కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు ఆ మేరకు చేతల్లో చూపిస్తోంది మాత్రం నామమాత్రమేనని వారు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు ముంబైనుంచి కేవలం వీక్లీ రైళ్లను నడుపుతున్నారని చెప్పారు. అదీ కుర్లా నుంచి నడుపుతుండటంతో అధికశాతం తెలుగు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదని వారు గవర్నర్‌కు వివరించారు. ఆ రైలును రోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రైల్వే మంత్రి సదానంద గౌడ్‌తో మాట్లాడతానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు.
అలాగే, మహారాష్ర్టలోని తెలుగు ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటినుంచో తాము పోరాటం చేస్తున్నామని, అయితే ఇప్పటివరకు ఎటువంటి ఫలితం కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక వర్లీ ప్రాంతంలో తెలుగుప్రజలను సమైక్యపరిచేందుకు తెలుగు భవనం నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎప్పటినుంచో కోరుతున్నామని, అయితే ఇంతవరకు మంజూరు కాలేదని వారు వివరించారు.
కాగా, ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు భాషతో రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ, తెలుగు ప్రజలందరూ ప్రాంతీయ విభేదాలు లేకుండా కలసికట్టుగా ఉండాలని, సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ర్ట గవర్నర్‌గా ఉన్నంతకాలం స్థానిక తెలుగు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే త్వరలో జరుగనున్న తెలుగు సుదర్శన్ యువక సంఘం స్వర్ణోత్సవాలకు తప్పక హాజరవుతానని గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు.
సుమారు 30 నిముషాల పాటు జరిగిన ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు గుద్దేటి నారాయణ, ప్రధాన కార్యదర్శి భోగ సహదేవ్, ఉపాధ్యక్షుడు ఆసం రాజన్న, కోశాధికారి గాజెంగి రమేష్, కమిటీ సభ్యులు గుద్దేటి గణేష్, గుడ్ల మహేందర్, భోగ సత్యపాల్, గాజెంగి వెంకటేష్, లోలం భోజరాజ్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.