చితికిపోయిన వలస బతుకులు
ఉన్న ఊళ్లో ఉపాధి కరువై.. బతుకు భారమై.. పొట్ట కూటి కోసం వందల కిలోమీటర్లు దాటి వెళ్లిన వారు.. బతుకుపోరులో సమిథలయ్యారు. చిన్న పిల్లలను కుటుంబ సభ్యుల వద్ద విడిచి వెళ్లి.. మృత్యుకుహరంలో కూరుకుపోయారు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకున్న వారి కలలు కల్లలయ్యాయి. పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఆశయం శిథిలాల కింద చిక్కుకుంది. రెండు రోజుల నుంచి ఏమయ్యారో తెలియక.. ఫోన్ మోగితే ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు. తమ తల్లి దండ్రుల యోగ క్షేమాలు తెలియక చిన్నారులు బిత్తర చూపులు చూస్తున్నారు.
విషాద వీచిక
హిరమండలం (లక్ష్మీపురం) : చెన్నై ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న గొట్ట, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన ఆరుగురూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఉన్న ఊళ్లో ఉపాధి కరువై..నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు వెళ్లి..విగతజీవులైన మీసాల శ్రీను, కుమార్తె భవానీ, కొంగరాపు శ్రీను, భార్య కృష్ణవేణి, సారవకోట మం డలం పాయకవలసకు చెందిన శ్రీను బావమరిది ముద్ద శ్రీను, లక్ష్మీపురానికి చెందిన పెసైక్కి జ్యోతిలది ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.
సంక్రాంతి అనంతరం వెళ్లి..
గొట్ట గ్రామానికి చెందిన మీసాల శ్రీను కుటుంబం ఈ ఏడాది సంక్రాంతి అనంతరం చెన్నై వెళ్లింది. పెళ్లీడుకొచ్చిన కుమార్తె కళ్లెదుటే కనిపిస్తుండడంతో..నాలుగు పైసలు వెనకేసుకుందామనుకున్న వారి ఆశలు అడియాసలయ్యారు. భారీ భవంతి కూలడంతో తండ్రీ కూతుళ్లు చిక్కుకున్నారు. శ్రీను భార్య వరలక్ష్మి ఇటీవల గ్రామానికి వచ్చి..శనివారమే చెన్నై బయల్దేరింది. మార్గమధ్యలో ఉండగానే..భర్త, కుమార్తె శిథి లాల కింద ఉండిపోయారన్న విషయం తెలియడంతో..ముందుకెళ్లే ధైర్యం చెయ్యలేక పుట్టెడు దుఃఖంతో విజయవాడ నుంచి వెనుదిరిగింది. కుమారుడు లోకేష్ మాత్రం తండ్రి, చెల్లెలు కోసం సంఘటన స్థలంలో రోదిస్తున్నాడు.
భార్యాభర్తలు..
అదే గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీనుది విషాద గాథ. పిల్లలు సుస్మిత, సాయిలను వృద్ధులైన తల్లిదండ్రులు తులసమ్మ, రాములు వద్ద ఉంచి..నలభై రోజుల క్రితమే కూలిపని కోసం భార్య కృష్ణవేణి, సారవకోట మండలం పాయకవలసకు చెందిన బావమరిది ముద్ద శ్రీనుతో కలిసి చెన్నై వెళ్లాడు. భవన ప్రమాదంలో ముగ్గురూ చిక్కుకున్నారు. కృష్ణవేణి చిన్న సోదరుడు శ్యామలరావు పాముకాటుతో పదేళ్ల క్రితమే చనిపోవడంతో కన్నబిడ్డలెవరూ దక్కకుండా పోయరంటూ ఆమె తల్లి..విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
పిల్లలను వదిలి వెళ్లి..
ఈ దారుణంలో బలైన జ్యోతిది మరో గాథ. పిల్లలు శ్రీను, మౌనికలను కుటుంబ సభ్యుల వద్ద ఉంచి..భర్త సింహాచలంతో కలిసి ఉపాధి కోసం ఇటీవలే.. చెన్నైకి వెళ్లింది. భర్త సిం హాచలం టీ తాగేందుకు బయటకు వచ్చి..తి రిగి వెళ్లేసరికి జ్యోతి భవన శిథిలాల కింది చిక్కుకుంది. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన సింహాచలం అక్కడే కుప్ప కూలిపోయాడు. మనుమలు తల్లి ప్రేమకు దూరమయ్యారంటూ.. ఆమె అత్త విలపిస్తోంది.
చెన్నై వెళ్లిన అధికారులు
పాలకొండ రూరల్: చెన్నై మాంగాడు బహుళ అంతస్తుల భవనాలు ఆకస్మికంగా కూలిపోవడం..అక్కడ పాలకొండ డివిజన్‌కు చెందిన పలువురు శిథిలాల కింద చిక్కుకోవడంతో అధికారులు హుటాహుటిన చెన్నైకి బయల్దేరారు. వారి క్షేమ సమాచారం తెలుసుకుని, అవసరమైన సేవలు అందించేందుకు పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్‌తో పాటు రాజాం తహశీల్దార్ జె.రామారావు, హిరమండలం ఆర్ఐ శంకరరావు ఒక బృందంగా చెన్నైకి వెళ్లారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
శిథిలాల కింద చిక్కుకున్న వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు తన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆర్డీవో తేజ్ భరత్ తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు 08941-260144 నంబర్‌కు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చన్నారు. భామిని మండలానికి చెందిన ఇద్దరు, కొత్తూరులో ముగ్గురు, హిరమండలంలో ఐదుగురు, పాలకొండలో ఒక కుటుంబానికి చెందిన బాధితులున్నట్లు ఇప్పటి వరకు తమకు సమాచారమందిందన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్చార్జిగా కార్యాలయ ఉపగణాంక అధికారి ఇ.లిల్లీ పుష్పనాథం వ్యవహరిస్తున్నారు.
ఆలస్యంగా..!
శ్రీకాకుళం: పొట్ట కూటి కోసం చెన్నై వెళ్లి.. బహుళ అంతస్తుల భవంతి కూలిన ప్రమాదంలో జిల్లా వాసులు చిక్కుకున్నా అధికారు లు ఆలస్యంగా స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో పాలకొండకు చెందిన ఐదుగురు, హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన ఐదుగురు, లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒకరు, కొత్తూరు మండలం ఇరాపాడు వాసులు ముగ్గురు, భామిని మండలం కొరమకు చెందిన ఇద్దరు, లక్ష్మీనర్సుపేట మండలానికి చెందిన ఇద్దరు, నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన ఒకరు శిథి లాల కింద చిక్కుకున్నట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారమందింది. ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా..అధికారులు ఆల స్యంగా స్పందించడంపై బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పొరుగు జిల్లా విజయనగరం బాధితుల కోసం అక్కడి కలెక్టర్ స్పందించినా.. మన వారికి పట్టకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాధితుల సంఖ్య పాలకొండ డివిజన్లో ఎక్కువగా ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో తేజ్ భరత్ రాజాం తహశీల్దార్, హిరమండలం ఆర్ఐతో కలిసి చెన్నై బయల్దేరారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
ప్రమాదంపై బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నెంబర్లు: 18004256625, 08942-225361, 9652838191కేటాయించారు.
చెన్నైకి వెళ్లిన బంధువులు
కొందరు బాధితుల బంధువులు శనివారం రాత్రే చెన్నై బయలుదేరి వెళ్లారు. అధికారులు కూడా కచ్చితమైన సమాచారం ఇవ్వక పో యినా.. సేకరించిన వివరాలు ప్రకారం 19 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.మన అధికారులు మాత్రం ఎంచక్కా..తమిళనాడు అధికారులు ఏమీ చెప్పడం లేదని వారిపైకి తోసేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌ను సంప్రదించామని,సహాయక చర్యలు చేపట్టేందుకు సహకరించాలని కోరామని పేర్కొన్నారు.
కొరమలో విషాదం
భామిని (కొరమ): కొరమకు చెందిన దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. చెన్నైలో భవనం కూలి దాసరి రాము(35), కుమారి(29) శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం ఆర్ఐ పైడి కూర్మారావు, వీఆర్ వో కె.కృష్ణారావు, వీఆర్వోల సంఘ అధ్యక్షుడు కె.సన్యాసిరా వు తదితరులు బాధిత కుటుం బాన్ని పరామర్శించి, ఓదార్చా రు. వీరు ఈ ఏడాది జనవరిలో ఇక్కడి నుంచి వలస వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరితో పాటు వెళ్లిన మరో నలుగురు క్షేమంగా ఉన్నట్లు ఇక్కడి వారికి సమాచారమందింది.