తెలు‘గోడు’ పట్టదా?
బతుకుదెరువు కోసం ఊరు గానీ ఊరొచ్చిన తెలుగు వారు ప్రమాదంలో చిక్కుకుంటే పట్టించుకునే వారే లేరు. తెలుగు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటైన తెలుగు సంఘాలు కానీ, ఆ నాయకులు కానీ ఆ కూలీల చెంతకు కూడా రాలేదు. సన్మానాల, కోసం అవార్డుల కోసం మాత్రం పది మందిని వెంటేసుకుని పరుగులు తీస్తారు. కానీ తెలుగువారిని ఆదుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయూరు.
సాక్షి, చెన్నై : చెన్నైలో తెలుగు సంఘాలకు కొదవ లేదు. కొన్ని సంఘాలు లెటర్‌ప్యాడ్ సంఘాలుగా ఉంటే, మరి కొన్ని తమ ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుంటాయి. ఇంకొన్ని సంఘాలు తెలుగు నినాదంతో తమ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నాయి. తెలుగు వాడికి, భాషకు అన్యాయం జరిగితే సహించం అన్నట్టుగా ఈ సంఘాల నాయకులు మైక్ చేతపట్టుకుని స్టేట్‌మెంట్లు ఇవ్వడం పరిపాటే. అయితే, ఇన్ని సంఘాలు ఇక్కడున్నా, మౌళివాకం ఘటన బాధితులకు తాము ఉన్నామంటూ భరోసా ఇవ్వడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం సిగ్గు చేటు. కావలసినవారికి అవార్డులు ఇచ్చుకుంటూ, సత్కారాలు చేసుకుంటూ పబ్లిసిటీ ఇచ్చుకునే సంఘాలు, బాధితులకు పట్టెడన్నం పెట్టేందుకు ముందుకు రాకపోవడం విచారకరం.
దిక్కెవరు
చెన్నైలో తెలుగు వారు అధికంగా ఉన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్లూ అధికం. తమిళనాట తెలుగుకు తామే ప్రతినిధులం అంటూ జబ్బలు చరిచే సంఘాలు, నాయకులకు కొదవ లేదు. అయితే వీరందరూ వ్యక్తిగత పబ్బం గడుపుకునేందుకే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు వారికి ఇక్కడ దిక్కెవరూ లేదన్న విష యం మౌళి వాకం ఘటన స్పష్టం చేస్తోంది.
గోడు పట్టదా
మౌళి వాకం ఘటనలో బాధితులు అత్యధికులు తెలుగువారే అన్న విషయాన్ని పదే పదే తమిళ మీడియాలు ప్రసా రం చేశాయి. తెలుగువారు ఈ ప్రమాదం కారణంగా పడుతున్న వెతల్ని తమ ప్రసారాల ద్వారా బయటకు తెస్తున్నా యి. సంఘటన జరిగిన క్షణంలో తమిళుడు, తెలుగు వాడు అన్న తేడా లేకుండా స్థానికులు వేలాదిగా తరలివచ్చి తమ వంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యారు. అలాగే ఎక్కడెక్కడ సంస్థల్లో, భవన నిర్మాణాల్లో కూలీలుగా పను లు చేస్తున్న వాళ్లు సైతం తమ ఊరోళ్లు ప్రమాదంలో చిక్కారేమో! అన్న అందోళనతో సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. సంఘటన జరిగి ఒక్క రోజు గడిచినా, ఆ పరిసర వాసులు అయ్యో... అన్న వేదనతో , అక్కడ ఏమి జరిగిం దో తెలుసుకోవడానికి కొందరు ఉరకలు తీశారు. అయితే, ఏ ఒక్క తెలుగు సంఘాల నాయకుడు కానీ అటు వైపు రాకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం.
స్పందన ఏదీ
తెలుగువారిని ఆదుకునేందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచి రెడ్ క్రాస్ సిబ్బంది, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జేసీ రేఖా రాణి హుటాహుటిన వచ్చారు. అయితే, భాషాపరమైన సమస్యతో వారికి సహకరించే వాళ్లు లేక వారు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చివరకు తెలుగు మీడియాను తమిళ అధికారులు ఆశ్రయించక తప్పలేదు. ఓ వైపు భాషా సమస్య, మరో వైపు బాధితులు ఆకలి దప్పులతో అలమటిస్తుంటే కనీసం తమ వంతు సహకారం ఇచ్చే రీతిలో తెలుగు సంఘాలు స్పందించక పోవడం విచారకరం. కనీసం తెలుగు కోసం ఉద్యమిస్తున్న సంఘాలైనా, అక్కడికి వచ్చి బాధితుల్ని పరామర్శించలేదు. కేవలం టీవీల్లో ప్రమాద ఘటనను వినోదం చూసినట్టుగా చూశారన్న అపవాదును తెలుగు సంఘాలు మూటగట్టుకున్నారుు. అన్ని పార్టీల్లో తెలుగు నేతలు సైతం ఉన్నారు. తాము పలనా పార్టీ అంటూ ఎన్నికల సమయంలో పబ్లిసిటీకి ఎగబడే నాయకులకూ తెలుగు వాడి హాహాకారాలు వినపడకపోవడం శోచనీయం.
బాధితులకు ఉంగలుక్కాగ చేయూత
సాక్షి, చెన్నై: బహుళ అంతస్థుల భవనం కూలిన ప్రమాదంలో తెలుగు బాధితులకు ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించింది. ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సునీల్ సహాయకాలను అందజేశారు. మౌళి వాకం ప్రమాదంలో అత్యధికంగా తెలుగు బాధితులు ఉన్న విషయం తెలిసిందే. వీరిని ఆదుకునేందుకు ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులను ఆదుకుంటూ సహాయకాలను ఆదివారం సాయంత్రం పం పిణీ చేశారు. నగరంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త శశిధర్ రెడ్డి సహకారంతో 200 టవళ్లు, 300 బెడ్‌షీట్‌లు, 100 బ్యాగులు, వాటర్ ప్యాకెట్లు, మొత్తం రూ.1.5 లక్ష విలువ గల వస్తువులను బాధితులకు అందజేశారు.