బాధ్యులెవరు? | Building collapse incident Responsible who | Sakshi
Sakshi News home page

బాధ్యులెవరు?

Published Mon, Jun 30 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

బాధ్యులెవరు?

బాధ్యులెవరు?

 నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు బాధ్యులు ఎవరన్న ప్రశ్న బయలు దేరింది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ, కోర్టుల చేత చీవాట్లు తింటున్న సీఎండీఏ ఈఘటనలో జాగ్రత్తగా వ్యవహరించే పనిలో పడింది. నిందలు తమ మీద పడకుండా ట్రస్ట్ హైట్స్‌కు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తోంది. ముందస్తు బుకింగ్ పేరిట ప్రైమ్ సృష్టికి లక్షల్లో అడ్వాన్స్‌లను అత్యధిక శాతం మంది చెల్లించినట్టు వెలుగులోకి వస్తోంది. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చేనా అంటూ బాధితులు గగ్గోలు
 
 సాక్షి, చెన్నై: పోరూర్ -కుండ్రత్తూర్ రోడ్డులోని మౌళివాకం సర్వే నెంబర్ 17/7ఎ,7ఇ,8ఎ,4ఎల్లోని మూడు వేల 986 చ.మీ స్థలంలో 11 అంతస్తులతో రెండు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు ప్రైమ్ సృష్టి సంస్థ సీఎండీఏలో దరఖాస్తు చేసుకుంది. ఫిబ్రవరి 15 -2012లో ఈ దరఖాస్తు రిజిస్టర్డ్ అయింది. ఆ దరఖాస్తును పరిశీలించిన చెన్నై మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) 2013 జూన్ మూడో తేదీన అనుమతి ఇచ్చింది. సీ-3/3120-2012 అన్న సంఖ్యలతో అనుమతి పత్రాన్ని సిద్ధం చేసి పంపించారు. రెండు దశలుగా చేపట్టనున్న ఈ నిర్మాణాల్లో మొదటి దశలో 44 గృహాలను, రెండో దశలో 42 గృహాలను నిర్మించేందుకు అనుమతి పొందింది.
 
 అనుమతి వచ్చే ముందే ఈ భవన నిర్మాణం చేపట్టారా? లేదా, ముందుగానే శ్రీకారం చుట్టారా? అన్న విషయం మాత్రం ప్రశ్నార్థకమే. అనుమతి పొందిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకుంటే, సరిగ్గా ఏడాదిలో రెండు దశల్లో 11 అంత్తుల భవనాన్ని నిర్మించేయడం ఆలోచించ దగ్గ విషయమే. మరి కొన్ని నెలల వ్యవధిలో ముందుగా రిజర్వు చేసుకున్న వారికి ఈ భవనాల్లో ఫ్లాట్స్‌ను కేటాయించనున్నారు. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడం ప్రజానీకాన్ని కలవరంలో పడేసింది. పిడుగు వంటి ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొనే విధంగా ఇక్కడ పరికరాలు అమర్చాల్సి ఉన్నా, ఆ దాఖలాలు మాత్రం లేవు. నిర్మాణం పూర్తయ్యాక ప్రమాదం జరిగి ఉంటే, ప్రాణ నష్టం ఏమేరకు ఉంటుందో ఊహించ లేని పరిస్థితి.
 
 పిడుగు పడితే...
 ఈ ప్రమాదానికి ముమ్మాటికి ప్రకృతి వైపరీత్యమే కారణం అని ప్రైమ్ సృష్టి సంస్థ వాదిస్తోంది. అరుుతే పిడుగు పడ్డ దాఖలాలు మాత్రం కానరాలేదని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒక వేళ పిడుగు పడ్డా, పైన ఉండే ఒకటి రెండు అంతస్తులుదెబ్బ తింటాయని చెబుతున్నారు. దీంతో సీఎండీఏ వర్గాల్లో మాత్రం గుబులు మొదలైంది. అధికారుల చేతి వాటం, నిర్లక్ష్యం ఇందులో వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు, కోర్టులతో చీవాట్లు పెట్టించుకున్న సీఎండీఏకే తాజా ఘటన ఓ అగ్ని పరీక్షే. తాము అన్నీ నిబంధనల్ని ముందుగానే పరిశీలించి, ఆ సంస్థకు అనుమతి ఇచ్చామా? అన్న దిశగా ముందుకు వెళుతున్నారు. ప్రైమ్ సృష్టి సమర్పించిన రికార్డులను, నమూనాలను, అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ సిద్ధం అవుతోంది. తాము మాత్రం ఈ ఘటనకు బాధ్యులు కాకూడదన్న దిశగా సీఎండీఏ వర్గాలు కుస్తీలు పడుతోంటే, ఈ ఘటనకు బాధ్యులెవ్వరన్న ప్రశ్నకు సమాధానం దొరికేనా అన్నది వేచి చూడాల్సిందే.
 
 నిపుణులు కరువు : అత్యాధునిక టెక్నాలజీని భవన నిర్మాణ సంస్థలు అందిపుచ్చుకుని ఉరకలు తీస్తున్నాయి. సీఎండీఏ వద్ద అనుమతులు పొందేందుకు  సమర్పించాల్సిన దరఖాస్తులో అన్ని వివరాలను సంబంధిత సంస్థ పొందు పరచాల్సి ఉంది. నమూనా వివరాలను ఆర్కిటెక్స్, భూ సామర్థ్యం గురించి సంబంధిత ప్రైవేటు ఇంజనీరింగ్ నిపుణులు సర్టిఫికెట్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ రికార్డులను పరిశీలించేంత సాంకేతిక నిపుణులు సీఎండీఏలో లేరన్నది జగమెరిగిన సత్యం. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని  భవన నిర్మాణ సంస్థలు, కొత్త టెక్నాలజీల పేరుతో ప్రైవేటు ఆర్కిటెక్స్, ఇంజనీర్ల వద్ద సర్టిఫికెట్లను తెప్పించుకుని సీఎండీఏను బురిడీకొట్టిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నివేదికసిద్ధం చేసే పనిలో సీఎండీఏ వర్గాలు ఉండడం గమనార్హం.
 
 లక్షల్లో అడ్వాన్స్: ప్రైమ్ సృష్టి సంస్థ ట్రస్ట్ హైట్స్ పేరిట చేపట్టిన రెండు ప్రాజెక్టులకు భారీగానే అడ్వాన్స్‌లను రాబట్టింది. 755 నుంచి 1115 చ.అడుగుల విస్తీర్ణాల్లో ప్లాట్లను నిర్మించే పనిలో పడింది. ఒక్కో ప్లాట్‌కు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ధర నిర్ణయించి ఉన్నారు. 86 ప్లాట్లకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. నగరానికి చెందిన అనేక మంది ఉద్యోగులు, వ్యాపారులు సొంతింటి కలను సాకారం చేసుకునే రీతిలో తమకు కావాల్సిన ప్లాట్స్‌ను ఎంపిక చేసుకుని అడ్వాన్స్ బుకింగ్‌లు చేసి ఉన్నారు.
 
 అంతేకాకుండా సృష్టి సంస్థ దగ్గరుండి అడ్వాన్స్ బుకింగ్ దారులకు బ్యాంక్ రుణాలను కూడా మంజూరు చేయించినట్టు సమాచారం. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. తాము చెల్లించిన అడ్వాన్స్‌లు మళ్లీ దక్కేనా అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. తమ సొమ్ముకు బాధ్యులు ఎవరో అంటూ గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా భవన నిర్మాణ సంస్థలు ప్రకృతి వైఫల్యాలు ఎదురయితే, నష్ట పరిహారం రాబట్టుకునేందుకు ముందుగా తాము చేపట్టే ప్రాజెక్టులకు ఇన్సూర్ చేయడం సహజం. అయితే, ఇక్కడ ఆ ప్రయత్నం జరిగిందా? అన్నది ప్రశ్నార్థక మే. దీంతో తమ అడ్వాన్స్‌లు తిరిగి దక్కేనా అన్న మనో వేదనలో ముందస్తు రిజర్వ్‌డ్ చేసుకున్న బాధితులు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement