రచయితల దృక్పథం మారాలి
పెనుగొండ: ప్రపంచీకరణతో మానవుడు సామాజిక సృహను కోల్పోతున్నాడని, ఆధునిక కాలంలోనూ స్త్రీ పరిచారికగానే మిగిలిపోతోందని కాకినాడ ఐడియల్ విద్యాసంస్థల సెక్రటరీ కరస్పాండెంట్, రచయిత్రి డాక్టర్ పి. చిరంజీవినీకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పెనుగొండలో శనివారం ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు కళాశాల, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) సంయుక్త నిర్వహణలో ‘తెలుగులో మహిళా రచయిత అనుభవాలు–ప్రభావాలు’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిరంజీవినీకుమారి మాట్లాడుతూ మానవుడు మనిషిగా కాకుండా సాహిత్యంలో వస్తువుగా మిగిలిపోతున్నాడన్నారు. రచయితలు తమపరిధిలో కాకుండా, స్త్రీ దృక్పథం, దళిత దృక్పథం, మైనార్టీ దక్పథంతో సాహిత్యాన్ని ముందుకు నడిపించాలన్నారు.
స్త్రీలది వంటింటి సాహిత్యం కాదు
మహిళా సాహిత్యానికి వంటింటి సాహిత్యమనే విమర్శ ఉందని, వంటింటికి మానవుడి జీవితంలో ఉన్న విలువ అనిర్వచనీయమని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య కాత్యాయనీ విద్మహే అన్నారు. మహిళా రచయిత్రులు వంటింటి విషయాలతో ప్రారంభించి సమాజంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కతిక, విద్య, వ్యాపార, వాణిజ్య రంగాలను స్పహిస్తున్నారన్నారు. మహిళల గొంతుకగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ముందుకు సాగుతుందన్నారు. డాక్టర్ కె.అన్నపూర్ణ జ్యోతి ప్రజ్వలనంతో సదస్సును ప్రారంభించారు. ప్రరవే జాతీయ అధ్యక్షురాలు పుట్ల హేమలత, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నడింపల్లి సూర్యనారాయణ రాజు, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కె.రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, సదస్సు సంచాలకుడు రంకిరెడ్డి రామ్మోహనరావు, సుమారు 65 మంది రచయిత్రులు పాల్గొన్నారు.