కేసీ ఆయకట్టు రైతుల ధర్నా
నంద్యాల: కేసీ కెనాల్ ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వాలని బండిఆత్మకూరు మండలం ఏ.కోడూరు గ్రామానికి చెందిన రైతులు స్థానిక తెలుగుగంగ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో నంద్యాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయమోహన్, అధికారులు మార్చి నెలాఖరు వరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇస్తామని ప్రకటించి తమను మోసం చేశారన్నారు. వారి మాటలు నమ్మి పంటలు సాగు చేశామని, ప్రస్తుతం కాల్వకు నీటి విడుదల నిలిచిపోయిందన్నారు. కాల్వకు నీళ్లు రాకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్తో మాట్లాడి రెండుమూడు రోజుల్లో నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.