నేటి నుంచి మళ్ళీ ‘టెంపర్’
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ‘టెంపర్’ చిత్రం షూటింగ్లో తుది ఘట్టానికి ఇవాళ్టి నుంచి తెర లేచింది. శనివారం నుంచి మొదలవుతున్న ఈ తుది విడత షూటింగ్ ఏకధాటిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ‘‘ఇంకా 18 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. శనివారం నాడు హైదరాబాద్‌లోని గులాబీ హౌస్‌లో మొదలుపెట్టి, నిర్విరామంగా చిత్రీకరణ జరుపుతున్నాం’’ అని దర్శకుడు పూరీ జగన్నాథ్, ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు.
నిజానికి, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే, దాదాపు పదిరోజుల పాటు సాగిన తెలుగు సినీ కార్మికుల సమ్మె, ఆ వెంటనే ఎన్టీఆర్ సోదరుడు నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మృతితో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దాంతో, పండుగ రిలీజ్ కోసం హడావిడి పడడం కన్నా, ఎక్కడా రాజీ పడకుండా అనుకున్నది అనుకున్న రీతిలో చిత్రీకరించి, చిత్రాన్ని సిద్ధం చేయాలని యూనిట్ అభిప్రాయపడింది.
గోవాలో ప్రధాన భాగం పూర్తి చేసుకున్న ‘టెంపర్’ చిత్రీకరణ ఇప్పుడీ హైదరాబాద్ షూటింగ్‌తో పూర్తి అవుతుంది. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్న ‘టెంపర్’కు సంబంధించి హీరో ఫస్ట్ లుక్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. మరి, పూరీ మార్కు హీరో క్యారెక్టరైజేషన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించే సంచలనం కోసం మరి కొద్దిరోజులు ఆగాల్సిందే!