ఆమె 'శ్రీ' ఉండాలంటారు... ఆయన వద్దంటారు
శ్రీకాళహస్తి పేరుకు మరో శ్రీ చేర్చాలనే విషయంపై వివాదం
ప్రతిపాదిస్తున్నది ఒకరు.... తిరస్కరిస్తున్నది మరొకరు
అభివృద్ధి కమిటీల నియామకాలపైనా అదే పరిస్థితి
శ్రీకాళహస్తి : కైలాసగిరుల్లోని పరమేశ్వరుడి క్షేత్రం శ్రీకాళహస్తి పేరుకు ముందు మరో ‘శ్రీ’ని చేర్చాలనే విషయంపై చైర్మన్, ఈవో మధ్య వివాదం సాగుతోంది. ఈవో ప్రతిపాదస్తుంటే చైర్మన్ తిరస్కరిస్తున్నారు. వీరి మధ్య నడుస్తున్న ఈ వివాదం క్షేత్రానికి సంబంధించి ఇతర విషయాలపై పడుతోంది. ముక్కంటి క్షేత్రాన్ని మూడు మూగజీవులకు చిహ్నంగా శ్రీకాళహస్తిగా ఆది నుంచి పిలుస్తున్నారు.
అయితే ఆలయూల పేర్లకు ముందు గౌరవార్థంగా శ్రీ ఉండాలని చెబుతున్న ఈవో భ్రవురాంబ శ్రీ శ్రీకాళహస్తిగా పేరు మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆమె గురువారం చైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడికి పంపగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదేకోవలో ఆలయ అభివృద్ధి కోసం 15 కమిటీలను ఏర్పాటు చేసి వాటికి సభ్యులను నియమించేందుకు చైర్మన్ పంపిన ప్రతిపాదనను ఇదేరోజు ఈవో వెనక్కు పంపినట్లు సమాచారం.
అన్ని ఆలయాలకు ముందు శ్రీ ..
శ్రీ అనేది ఆలయాల గౌరవార్థం కోసం పెట్టుకునేది. అందువల్లే అన్ని ఆలయాల పేర్లకు ముందు శ్రీ వాడుతున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా శ్రీ వెంకటేశ్వరునిగా పిలుస్తున్నారు. ఇదే తరహాలో శ్రీ శ్రీకాళహస్తి దేవస్థానంగా పిలవాలని భావించాం. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అలాగే రాస్తున్నాను.
- భ్రవురాంబ, ఆలయు ఈవో
ఆది నుంచి ఉన్నదాన్ని మార్చడమెందుకు..
ఆది నుంచి శ్రీకాళహస్తి దేవస్థానంగానే పిలుస్తున్నాం. గౌరవార్థం అంటూ ఈవో కొత్తగా శ్రీ శ్రీకాళహస్తిగా పిలవాలని చేసిన ప్రతిపాదనను తిరస్కరించాం. శ్రీకాళహస్తి దేవస్థానంగానే పిలుస్తాం. దీనిపై ఇతర చర్చలు అనవసరం.
- పోతుగుంట గురవయ్యనాయుడు, ఆలయు చైర్మన్
ఇదీ ‘శ్రీ-కాళ-హస్తి’ప్రాశస్త్యం...
శ్రీకాళహస్తి అనే పేరు మూడు మూగజీవుల భక్తి ఆరాధనల ఫలితంగా వచ్చింది. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. బ్రహ్మదేవుని శాపానికి గురై ఊర్ణనాభుడనే శిల్పి భూలోకాన సాలీడుగా జన్మించి మారేడు పత్రాల మధ్య జీవించేవాడు. శివుని మెడలోని కాళం శాపంతో దక్షిణ కైలాసాన అడవిలో జన్మించి బిల్వ వ ృక్షం కింద వెలసిన శివలింగాన్ని పూజించేది. హస్తి అనే శివకింకరుడు తాను చేసిన తప్పునకు ఫలితంగా శివుడి శాపంతో భూలోకంలో ఏనుగు గా జన్మించాడు. ఏనుగు కూడా సాలెపురుగు, కాళంతోపాటు బిల్వ వనంలోనే నివసిస్తూ అక్కడే ఉన్న శివలింగాన్నే కొలిచేవి.
ఈ నేపథ్యంలోనే పాము చేసిన అలంకరణలను తొలగించి ఏనుగు తన తొండంతో సువర్ణముఖి నది నుంచి జలాన్ని తెచ్చి అభిషేకించేది. ఇందుకు కోపించిన కాళం ఒకనాడు శివలింగ సమీపాన వేచి ఉండి అభిషేకం చేస్తున్న గజరాజు తొండంలో చొరబడి కుంభస్థలంలో బాధ కలిగించింది. ఆ బాధ భరించలేక గజరాజు తన తలను బండకు మోదుకుని మరణించింది. గజరాజుతోపాటు కుంభస్థలం లోపల ఉన్న పాము కూడా మరణించింది. ఆ క్షణాన శివుడు ప్రత్యక్షమై వారికి పూర్వ జన్మ వృత్తాంతం తెలియజేశాడు. వారిని అనుగ్రహించి శివైక్యం చేశాడు. అప్పటి నుంచి దక్షిణ కైలాసమని పేరొం దిన ఈ క్షేత్రానికి శ్రీ-కాళ-హస్తి అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు.