temple demolitions
-
సౌదీలో స్థలమిస్తారు.. ఇక్కడ విగ్రహాలు కూల్చేస్తారా
ఆరు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సౌదీ అరేబియాకు వెళ్తే.. అక్కడ దేవాలయం కట్టుకోడానికి స్థలం ఇస్తామని ఆ దేశ పాలకులు చెప్పారని రమణానంద స్వామి చెప్పారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతకు నిరసనగా హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 800 సంవత్సరాల భారతదేశ చరిత్రలో విదేశీ పాలకులు చాలామంది మన దేవాలయాలను కూలగొట్టారని తెలిపారు. దేవుడి ఫొటో జేబులో పెట్టుకుంటే అరెస్టు చేసిన సందర్భాలున్నాయన్నారు. కానీ, ఇప్పుడు.. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలకు స్థలం ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాత్రికి రాత్రే కూల్చేసి తీసుకెళ్లి మునిసిపాలిటీ ఆఫీసులో పారేస్తారా అని ఆయన నిలదీశారు. ఆయన మాట్లాడుతుంటే మధ్యలో మైకు మొరాయించడంతో.. ఇది కూడా ప్రభుత్వం చెప్పి చేయిస్తోందా అని ప్రశ్నించారు. -
పుష్కరాల సమయంలో దేవుళ్ల విగ్రహాల కూల్చివేతా
అభివృద్ధి పేరుతో జరుగుతున్న దేవాలయాల విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి తెలిపారు. పుష్కరాల సమయం ఎప్పుడో చాలా ముందుగానే నిర్ణయం అవుతుందని, ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా.. అప్పటినుంచి పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు.. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుష్కరాలు వస్తున్న సమయంలో హిందూ ఆలయాలను ఇష్టారాజ్యంగా కూల్చివేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ కోసం ఇష్టారాజ్యంగా గుళ్లు, మసీదులు పగలగొట్టేస్తామంటుంటే.. అసలు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో అర్థం కావట్లేదని చెప్పారు. దేవాలయాలను ధ్వంసం చేసిన దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో ఏ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని తెలిపారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న కూల్చివేతలను వైఎస్ఆర్సీపీ ఖండిస్తోందని ఆయన అన్నారు.