temple history
-
అయోధ్యలో ‘కాలనాళిక’
పట్నా: అయోధ్యలో భవ్య రామ మందిరం భూమి పూజకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందిరం నిర్మాణంలో మరో విశేషం చోటుచేసుకోబోతోంది. రామ జన్మభూమికి సంబంధించిన సమస్త చరిత్రను అక్కడే భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికే ఇదంతా అని తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలంలో 2,000 అడుగుల లోతున ఒక కాల నాళిక(టైమ్ క్యాప్సూల్)ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇందులోనే ఆలయ చరిత్ర, కీలక పరిణామాల సమాచారం భద్రపరుస్తామన్నారు. రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగిందని, ప్రస్తుత, రాబోయే తరాలకు ఇదొక పాఠమని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ కాల నాళిక ఉపయోగపడుతుందన్నారు. వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే అవకాశం ఉండదని, తద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తవని చెప్పారు. కాల నాళికను తామ్ర పత్రంలో(కాపర్ ప్లేట్) ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని కామేశ్వర్ చౌపాల్ వివరించారు. శ్రీరాముడు నడయాడిన పుణ్య క్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి మట్టి, నీరు తెప్పిస్తున్నామన్నారు. భూమి పూజలో వీటిని ఉపయోగస్తామని తెలిపారు. -
దీని వెనుక 700 ఏళ్ల ఘన చరిత
సాక్షి, హోసూరు: హోసూరు, డెంకణీకోట తాలూకాలలో అతి పెద్ద తేరులలో రెండవది హోసూరు శ్రీ మరకతాంబ చంద్రచూడేశ్వరస్వామి రథం. ఈ రథం వెనుక 701 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు నేటికీ తేరుపై ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. క్రీ.శ. 1319వ సంవత్సరంలో చంద్రచూడేశ్వరస్వామి రథాన్ని నిర్మించినట్లు, అనంతరం కొద్ది కారణాల వల్ల 1753వ సంవత్సరంలో పునఃనిర్మాణం చేపట్టినట్లు రథంపై ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు తెలుగు, కన్నడ భాషల్లో రాసి ఉండడం విశేషం. 701 సంవత్సరాల పాతదైనా రథం కొత్తగా కనిపిస్తుంది. టేకు, మత్తి తదితర నాణ్యమైన కలపతో తేరు తయారైంది. తుప్పు పట్టని గొలుసులు రథ ప్రాముఖ్యతపై, చంద్రచూడేశ్వరస్వామి ఆలయ విశిష్టతపై బ్రహ్మండపురాణంలో ఆధారాలు లభిస్తున్నాయి. రథానికి వినియోగించే ఇనుప గొలుసులను లండన్లో తయారు చేశారు. నేటికీ ఆ గొలుసులు తుప్పుపట్టకపోవడం గమనార్హం. తాలూకా కేంద్రం డెంకణీకోట బేడరాయస్వామి రథం ఎత్తు మొదటి స్థానంలో ఉండగా చంద్రచూడేశ్వరస్వామి రథం రెండవ స్థానంలో ఉంది. శ్రీ మరకతాంబసమేత చంద్రచూడేశ్వరస్వామి ఆలయం హోసూరు, డెంకణీకోట, సూళగిరి తాలూకాల వారికే కాక ఇతర రాష్ట్రాల వారు కూడా కులదేవతగా ఆరాధిస్తున్నారు. శ్రీ చంద్రచూడేశ్వరస్వామి ఆలయ రథోత్సవం నేడు సోమవారం ఘనంగా జరగనుంది. రెండవ రోజు మంగళవారం పల్లక్కీ ఉత్సవాలు, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
వైవిధ్యం.. భైరవకొండ చరితం
పెద్దవడుగూరు: మండలంలోని కడదరగుట్టపల్లి గ్రామం భైరవకొండకు ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన భైరవేశ్వరాలయం ఈ కొండలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా ఉగాది పండుగ, శ్రావణ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేవుడికి బోనాలు సమర్పిస్తే సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామస్తుల నమ్మకం. ఈ కొండలోని ప్రతి రాయి కొంద తేళ్లు ఉంటాయి. కానీ ఎవరినీ కుట్టవని స్థానికులు చెబుతున్నారు. కానీ ఎవరైనా దేవునికి మొక్కుబడులు ఇవ్వకుండా ఉండిపోతే వాళ్ల ఇంటి వద్ద తేళ్లు తరచూ కనపడుతూ ఉంటాయని గ్రామస్తులు చెబుతారు.