పట్నా: అయోధ్యలో భవ్య రామ మందిరం భూమి పూజకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందిరం నిర్మాణంలో మరో విశేషం చోటుచేసుకోబోతోంది. రామ జన్మభూమికి సంబంధించిన సమస్త చరిత్రను అక్కడే భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికే ఇదంతా అని తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలంలో 2,000 అడుగుల లోతున ఒక కాల నాళిక(టైమ్ క్యాప్సూల్)ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఇందులోనే ఆలయ చరిత్ర, కీలక పరిణామాల సమాచారం భద్రపరుస్తామన్నారు. రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగిందని, ప్రస్తుత, రాబోయే తరాలకు ఇదొక పాఠమని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ కాల నాళిక ఉపయోగపడుతుందన్నారు. వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే అవకాశం ఉండదని, తద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తవని చెప్పారు. కాల నాళికను తామ్ర పత్రంలో(కాపర్ ప్లేట్) ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని కామేశ్వర్ చౌపాల్ వివరించారు. శ్రీరాముడు నడయాడిన పుణ్య క్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి మట్టి, నీరు తెప్పిస్తున్నామన్నారు. భూమి పూజలో వీటిని ఉపయోగస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment