న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం భూమి పూజకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిని తప్పనిసరిగా ఆహ్వానిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇతర నాయకుల తరహాలోనే వారిద్దరికీ ఫోన్ ద్వారా ఆహ్వానం పలుకుతామని పేర్కొన్నాయి.
అడ్వాణీ, జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తితోపాటు ఆరోగ్య కారణాల రీత్యా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆహ్వానాల వ్యవహారాన్ని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు శనివారం ఆహ్వానాలు అందాయి. భూమి పూజకు తాము కచ్చితంగా హాజరవుతామని వారు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అడ్వాణీ, జోషీ, ఉమా భారతి ప్రధాన నిందితులన్న సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అయోధ్యలో భూమిపూజ మహోత్సవానికి హాజరు కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీఐపీ అతిథుల జాబితాను 50 మందికి కుదించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలియజేసింది. భవ్య రామ మందిరం భూమిపూజకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరో నలుగురు నాయకులు వేదికను పంచుకోనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, రామ జన్మభూమి న్యాస్ చీఫ్ నృత్యగోపాల్ దాస్‌తోపాటు మరో ఇద్దరు వేదికపై ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment