సూర్యగ్రహణంతో ఆలయాలన్నీ మూసివేత..
సాక్షి, హైదరాబాద్ : డిసెంబర్ 26న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్ని మూసివేయనున్నారు. అనంతరం మరుసటి రోజు భక్తుల దర్శనం కోసం ఆలయ తలుపులు తెరవనున్నారు.
తిరుమల : రేపు సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారుల మూసివేయనున్నారు. దాదాపు 13 గంటల పాటుగా తలుపులు మూసివేయనున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా మూత పడి.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ది అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనం కోసం అనుమతిస్తారు.. రేపు ఉదయం విఐపి బ్రేక్ దర్శనాలు,(ప్రోటోకాల్ దర్శనాలు) టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా రేపు తిరుప్పావడ, కళ్యాణోత్సవం,ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేశారు.
శ్రీకాకుళం : మంగళవారం రాత్రి పూజల అనంతరం అరసవల్లి సూర్యదేవాలయాన్ని మూయనున్నారు. తిరిగి రేపు సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారు.
రాజన్న సిరిసిల్ల : గురువారం సూర్యగ్రహణం సందర్భంగా ఈ రోజు రాత్రి 8.11 గంటలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూయనున్నారు. సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 11.20 నిమిషాలకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరుస్తారు.
నిర్మల్ : ఈనెల 26న సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా 25వ తేదీ సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి 26వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ద్వారాలను అర్చకులుమూసివేయనున్నారు. తిరిగి 26వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు ఆలయం శుద్ధి, సంప్రోక్షణ , సరస్వతి అమ్మవారి కి అభిషేకం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనం సేవలను కల్పించనున్నట్టు ఆలయ అధికారులు. ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు : సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల దేవాలయాలు ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 11.30 గంటల వరకు వరకు ఆలయ ధ్వారాలు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట తరువాత ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
నెల్లూరు : రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సేవలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.