‘మన ప్రణాళిక’లో పది పనులకు అత్యంత ప్రాధాన్యం
పూడూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’లో పది పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు తెలిపారు. మండలంలో అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 2013-2014లో మంజూరైన పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు.
మండలానికి గత సంవత్సరంలో జెడ్పీ, బీఆర్జీఎఫ్లకు సంబంధించి రూ. కోటి విలువైన పనులు మంజూరైనట్లు చెప్పారు. అయితే వాటిలో చాలా పనులు అసంపూర్తిగానే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను కాంట్రాక్ట్ తీసుకొని పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్ల లెసైన్సులను రద్దు చేసేందుకు వెనకాడబోమన్నారు. చన్గోముల్ నుంచి వ్యవసాయ పొలాల వరకు ఫార్మేషన్ రోడ్డు మంజూరై అగ్రిమెంట్ అయినా ఇంత వరకు పనులు పూర్తి కాలేదన్నారు. చన్గోముల్, పూడూరు, కంకల్, పుడుగుర్తి గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.
ఎంపీడీఓ కార్యాలయం ప్రహరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కంకల్వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓను గ్రామ ఉపసర్పంచ్ జమీర్ కోరారు. అనంతరం మండల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆమ్రాది భారతమ్మ, ఎంపీడీఓ సుధారాణి, పీఆర్డీఈ అంజయ్య, ఏఈలు నర్సింలు, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి తదతరులు పాల్గొన్నారు.