tenancy Farmers
-
కౌలు రైతులపై సర్కారు సమ్మెట!
సాక్షి, అమరావతి: కౌలు చట్టం–2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం తలపెట్టేందుకు సిద్ధమైంది. కౌలుదారుడికి సెంటు భూమి ఉన్నా కౌలు రైతుగా గుర్తించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కౌలు చట్టం–2024 పేరిట ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. తద్వారా భూ యజమాని అనుమతి లేకుండానే కౌలు కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ ముసుగులో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నచ్చినోళ్లకు పెట్టుబడి సాయం, రుణాలు, నష్టపరిహారం, సబ్సిడీల లబ్ధి చేకూర్చేలా తెరవెనుక ఏర్పాట్లు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కొత్త చట్టం విభేదాలకు ఆజ్యం పోస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.తెలిసిన వ్యక్తులకే తమ భూములను కౌలుకు ఇస్తుంటామని.. తమ అనుమతితో పనిలేకుండా ప్రభుత్వం ఎవరో ఒకరికి భూములను కౌలుకు ఇచ్చినట్టుగా రాసేసుకుని.. కౌలు కార్డులు జారీచేస్తే వాస్తవ హక్కుదారులమైన తాము ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త చట్టం తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉందని, తమ భూములపై ప్రభుత్వం తనకు నచ్చినోళ్లకు మేలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వాస్తవ రైతులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు కౌలుదారులు సైతం ఈ నిబంధనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌలు చేస్తున్న సాగుదారులకు కాకుండా కొత్త నిబంధన పేరిట వేరే వ్యక్తులకు కౌలు కార్డులు జారీచేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.కొత్త నిబంధనలతో అసలుకే మోసంపట్టాదార్ పాస్ బుక్ చట్టం–1971 లేదా ఇతర రెవెన్యూ చట్టాల ప్రకారం భూమిపై హక్కు కలిగి ఉండి, వెబ్‌ల్యాండ్ వంటి భూ రిజిస్టర్లలో నమోదైన కౌలు రైతులు కొత్త చట్టం ప్రకారం కౌలు కార్డులు పొందేందుకు అనర్హులు. అంటే సెంటు భూమి ఉన్నా సరే కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే విషయాన్ని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన యాప్‌లో నమోదు చేసుకున్న వారు మాత్రమే కౌలు కార్డులు పొందేందుకు అర్హులు. అంటే.. భూమిని వాస్తవ కౌలుదారు కాకుండా వేరే వ్యక్తులు కౌలుకు చేస్తున్నట్టుగా యాప్‌లో నమోదు చేసుకుంటే వారిని కౌలు రైతుగా గుర్తించే ప్రమాదం ఉంది.యాప్‌పై అవగాహన లేని కౌలు రైతులు, అమాయకులైన కౌలు రైతులకు ఇలాంటి నిబంధనల వల్ల కీడు జరుగుతుందని రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కొత్త చట్టం పేరిట తెస్తున్న నిబంధనల్లో మరో సమస్య కూడా ఉంది. అసలు రైతు కుటుంబ సభ్యులు, వారి సమీప బంధువులు భూమిని కౌలుకు చేస్తుంటే.. అలాంటి వారు కూడా కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే నిబంధన విధించారు. కౌలు రైతుల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే వారంతా వాస్తవ సాగుదారులైన కౌలు రైతుగా అనర్హులవుతారు. కొత్త కౌలు చట్టాన్ని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.ముసాయిదా ఏం చెబుతోందంటే..కౌలు చట్టం–2024 ప్రకారం భూ యజమానుల అనుమతితో పనిలేకుండా చుట్టుపక్కల రైతుల అభిప్రాయాల మేరకు గ్రామసభల్లో కౌలుదారులను గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోంది. యజమాని మూడు రోజుల్లో సమ్మతి ఇవ్వకుంటే డీమ్డ్ సమ్మితి (భూ యజమాని సమ్మతి తెలిపినట్టు)గా పరిగణించి కౌలు కార్డు జారీ చేస్తారు. ఒకవేళ తాను ఎవరికీ తన భూమిని కౌలుకు ఇవ్వలేదని భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినా పరిగణనలోకి తీసుకోరు. చుట్టుపక్కల రైతుల అభిప్రాయాలే ప్రామాణికంగా ఇచ్చే కౌలు కార్డుల ప్రామాణికంగానే పంట రుణాలిస్తారు. ఈ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పంట రుణాలు ఇవ్వకూడదని, భూ యజమానులు గత సీజన్లో తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా, అదే సీజన్లో కొత్తగా తీసుకున్న పంట రుణాలను లాంగ్ టర్మ్ రుణాలుగా పరిగణించేలా బ్యాంకులను ఆదేశించేలా నిబంధన పెడుతున్నారు.కౌలు కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలివీఅధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులున్నారు. ఇందులో 16 లక్షల మంది కౌలుదారులు. సెంటు భూమి కూడా లేకుండా వ్యవసాయం చేస్తున్న వారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. కౌలు కార్డులు పొందిన వారు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం పొందవచ్చు. సబ్సిడీపై. విత్తనాలు, ఎరువులు పొందవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేకుండా సాగు చేసే పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.1.60 లక్షల వరకు పంట రుణాలు పొందవచ్చు. సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే నష్టపరిహారంతో పాటు పంటల బీమా పరిహారం పొందవచ్చు.కొత్త వివాదాలకు ఆజ్యంపరిసర రైతులు మౌఖికంగా ధ్రువీకరిస్తే కౌలు కార్డులు ఇవ్వొచ్చన్న నిబంధన గ్రామాల్లో భూ యజమానులు, కౌలు రైతుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తుందన్న వాదన వినిపిస్తోంది. అన్నదాత సుఖీభవతో పాటు ఇతర సంక్షేమ ఫలాల కోసం ఎలాంటి భూమి లేనివారు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ నిబంధన సాకుతో స్థానిక అధికారులను ప్రలోభపెట్టి అడ్డగోలుగా కార్డులు పొందడం, వాటిద్వారా సంక్షేమ ఫలాలు స్వాహా చేయడం వంటి అవకతవకలు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు.కార్డులు జారీచేసే వరకు రుణాలివ్వకూడదన్న నిబంధనతో సకాలంలో పంట రుణాలు పొందే అవకాశం సాగుదారులైన భూ యజమానులకు లేకుండా పోతుందంటున్నారు. డబుల్ ఫైనాన్స్ ఇవ్వలేమని, గతంలో తీసుకున్న రుణాలు రెన్యువల్ చేసుకున్న తర్వాత వాటిని లాంగ్ టర్మ్ రుణాలుగా మార్చడానికి నిబంధనలు అంగీకరించవని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. కౌలుదారుడు రుణం తీసుకుని చెల్లించలేని పక్షంలో, వ్యక్తిగత అవసరాల కోసం భూమిని తనఖా లేదా, అమ్ముకునేటప్పుడు తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళనను భూ యజమానులు వ్యక్తం చేస్తున్నారు. -
Fact Check: కౌలు రైతన్నలపై రామోజీ కుళ్లు
సాక్షి, అమరావతి: బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉండే కౌలు రైతులకు మంచి చేస్తుంటే ఈనాడు రామోజీ కుళ్లుతో కుతకుతలాడిపోతున్నారు! వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఈ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ రోత రాతలకు తెగబడ్డారు. భూ యజమానులతోపాటు వాస్తవ సాగుదారులకూ సంక్షేమ ఫలాలను అందిస్తూ మేలు చేస్తున్న ప్రభుత్వం మరెక్కడైనా ఆయనకు కనిపించిందా? గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం 2019ని తేవడమే కాకుండా సీసీఆర్సీల ఆధారంగా అన్ని ప్రయోజనాలను సీఎం జగన్ అందిస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నుంచి పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు దురదృష్టవశాత్తూ ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలకు వారు కౌలు రైతులైనా సరే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారు. కౌలు రైతులకు ఈ క్రాప్ ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులతోపాటు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమాతో లబ్ధి చేకూరుస్తున్నారు. తుపాన్‌తో నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా కొనుగోలు చేయలేదు. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) జారీ చేస్తోంది. ఏటా ఖరీఫ్‌కు ముందు ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25,86,178 మంది కౌలు రైతులకు సీసీఆర్సీలు జారీ చేశారు. అత్యధికంగా ఈ ఏడాది 8,25,054 మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీలు లేని కౌలు రైతులను గుర్తించి జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ) నెలకొల్పి రుణాలు అందిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 14.39 లక్షల మంది కౌలుదారులకు రూ.8,246 కోట్ల రుణాలు అందాయి. కౌలు రైతుకూ సంక్షేమ ఫలాలు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కౌలు రైతులకు రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందచేస్తోంది. కేంద్రం ఇవ్వకున్నా వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా ప్రభుత్వం అందిస్తోంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా 9.52 లక్షల మందికి రూ.1,235.03 కోట్ల మేర వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందచేశారు. రూ.లక్ష లోపు పంట రుణాలు పొందిన కౌలుదారులకు ఈ – క్రాప్ ఆధారంగా వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందేలా చర్యలు చేపట్టారు. ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. 3.55 లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి రూ.253.56 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీ చేశారు. దురదృష్టవశాత్తూ ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు భూ యజమానులతో సమానంగా రూ.7 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు రూ.90.72 కోట్లు పరిహారం అందించగా కౌలు రైతులకు రూ.34.65 కోట్లు సాయం అందింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్లు పరిహారం కింద ఈ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా తుపాన్‌తో నష్టపోయిన కౌలు రైతులు, అటవీ భూ సాగుదారులకు సైతం పంట నష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. 4.42 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు గుర్తించి రూ.703 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది. భూ యజమానులతో పాటు సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులకు కూడా 80 శాతం రాయితీతో 86 వేల క్వింటాళ్ల విత్తనాలను తిరిగి విత్తుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. -
‘భూమిపై అన్నిరకాల హక్కులు రైతులకే’
సాక్షి, అమరావతి : భూమిపై అన్నిరకాల హక్కులు యజమానికే ఉంటాయని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పంటమీద మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుందని చెప్పారు. కౌలు రైతుల రక్షణ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిల్లును ప్రవేశపట్టిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... భూ యనమానుల హక్కులకు నష్టం కలగకుండా కౌలు రైతులకు రక్షణ కల్పించేలా చట్టం రుపొందించామని తెలిపారు. భూ యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ఈ బిల్లుతో ప్రయోజనం ఉంటుందన్నారు. గతంలోని కౌలుదారి చట్టం వలన భూ యజమానులకు అభద్రతాభావం ఏర్పడిందని, అందుకే కౌలు రైతులను యజమానులు నమ్మలేదన్నారు. తాము తెచ్చిన నూతన చట్టం వలన ఇద్దరికి మేలు చేస్తుందన్నారు. భూ రికార్టుల్లో ఎక్కడా కూడా కౌలు రైతు పేరు ఉండదన్నారు. పంటరుణం తప్ప మిగిన రుణాలన్ని భూ యజమాని తీసుకోవచ్చని తెలిపారు. రైతు భరోసా, పంట రుణాలు సాగుదారులకే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమై చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుతుంది : ధర్మాన పంటసాగుదారుల రక్షణ చట్టం తేవడం మంచి పరిణామమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ చట్టం ద్వారా అన్ని సబ్సిడీలు కౌలు రైతుకు అందుతాయని చెప్పారు. ప్రభుత్వం అందజేసే సహాయం నిజమైన రైతులకు అందేలా చట్టం తీసుకొచ్చారని ప్రశంసించారు. సమాజంలో కలిసిపోయిన నాయకుడే ఇలాంటి చట్టాలు తీసుకురాగలరని అన్నారు. పీవోటీ యాక్ట్ పరిధిలోని భూములను సాగుచేస్తున్న రైతులు కూడా లాభపడేలా ఈ చట్టంలో సవరణ తీసుకురావాలని కోరారు. రైతులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ : సామినేని పంటసాగుదారుల రక్షణ చట్టంతో యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను అన్నారు. కౌలు రైతులకు కార్డులే కాకుండా హక్కులు కూడా కల్పించడం శుభపరిణామమన్నారు. ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులకు అందేలా చట్టబద్ధత కల్పించామన్నారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ సీఎం జగన్ రైతుకు అండగా నిలిచారని ప్రశంసించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. -
ఇదొక విప్లవాత్మక కార్యాచరణ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పంటసాగుదారుల హక్కుల రక్షణ చట్టంతో రైతులకు ఎలాంటి నష్టం ఉండబోదని, రైతుల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగంకానీ, ఆటంకం కానీ వాటిల్లబోదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో కౌలు రైతు హక్కులు, ప్రయోజనాలు నెరవేరుతాయని తెలిపారు. పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదొక విప్లవాత్మక కార్యాచరణ అని కొనియాడారు. చర్చ అనంతరం రాష్ట్ర శాసనసభ ఈ విప్లవాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లు చట్టంగా రూపుదాల్చింది. సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతు ఫలానా వ్యక్తిని కౌలు రైతు అని చెప్తూ పత్రాలు ఇవ్వడానికి భయపడే పరిస్థితి నెలకొందన్నారు. కౌలు రైతును గుర్తించడానికి రైతు భయపడుతుండటంతో ఇటు కౌలు రైతులూ, అటు రైతులూ నష్టపోతున్నారని తెలిపారు. కౌలు రైతులకు మేలు చేసే ఇటువంటి చట్టాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకువస్తున్నామన్నారు. ఈ చట్టం వల్ల రైతులకు ఎటువంటి అభద్రతాభావం ఉండదని స్పష్టం చేశారు. స్టాంపు పేపర్ ఎంత సులువుగా అందుబాటులో ఉంటుందో.. అంతే సులువుగా ఈ చట్టం కింద కౌలురైతు పత్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రెండువేల జనాభా ఉన్న ప్రతి ఊరు సెక్రటేరియట్లోనూ ఈ పత్రం లభిస్తుందని, ఈ పత్రంలో ఒక భాగం కౌలు రైతుల గురించి వివరిస్తుండగా.. మరో భాగం రైతుల గురించి వివరిస్తుందని తెలిపారు. ఈ పత్రంలో భూమి ఎక్కడ ఉంది.. ఆ భూమి వివరాలు ఏమిటి? అన్న వివరాలు నింపితే చాలు అన్నారు. ఇందులో రైతులు భయపడాల్సింది ఏదీ లేదని, ఈ పత్రం కేవలం 11 నెలలు మాత్రమే అమల్లో ఉంటుందని, 11 నెలలు దాటితే.. అది చెల్లదని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం మళ్లీ పంట కౌలుకు ఇవ్వాలంటే మళ్లీ పత్రం చేయించాల్సిందేనని అన్నారు. ఈ చట్టం వల్ల రైతు భయపడాల్సిన అవసరం లేదని, అతనికి ఎటువంటి నష్టం జరగదని తెలిపారు. ఈ చట్టం వల్ల భూముల మీద ఉన్న హక్కులను రైతు ఏ పరిస్థితుల్లోనూ ఏమాత్రం కోల్పోబోడని స్పష్టం చేశారు. అదేవిధంగా కౌలు రైతుకూ ఈ చట్టం వల్ల మేలు జరుగుతుందని, పంట మీద ఉన్న హక్కులు మాత్రమే ఆ 11 నెలలు కౌలు రైతుకు బదిలీ అవుతాయని తెలిపారు. పంటనష్టం జరగడం, బీమా రాకపోవడం, బ్యాంకు రుణాలు లేకపోవడం వంటి కారణాల వల్ల కౌలు రైతులు ఇప్పటివరకు నష్టపోతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. ఇలా కౌలు పత్రం చేయించినా కూడా రైతులకు వైఎస్సార్ రైతుభరోసా కింద ఏడాదికి రూ. 12,500 వస్తాయని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలైన కౌలురైతులకు రైతుభరోసా పథకం కింద 12,500 వస్తాయని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కౌలురైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కౌలురైతులకు కూడా రైతుభరోసా పథకం వర్తించేలా చట్టం తీసుకొచ్చాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 16 లక్షల మంది కౌలురైతులకు ఏటా ఒకొక్కరికి రూ. 12,500 పెట్టుబడి సాయం అందుతుంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2019 -
రైతుకు ఊరట
జగిత్యాల అగ్రికల్చర్ : తెలంగాణలో రూ.200 కోట్లతో ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని ఉద్యానవన పంటలను ఎక్కువగా కరీంనగర్ జిల్లాలోనే సాగు చేస్తారు. దాదాపు 1.75 లక్షల ఎకరాల్లో మామిడి, పసుపు, మిరప, అరటి, బొప్పాయి, వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇందులో 80 వేల ఎకరాల్లో మామిడితోటల పెంపకం చేపడుతున్నారు. జగిత్యాల మామిడి మార్కెట్ ద్వారా ఏటా సుమారు రూ.300 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఉద్యాన విశ్వవిద్యాలయం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. కౌలు రైతులకు రుణాలు భూమిలేని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో కౌలురైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించి దోపిడీకి గురవుతున్నారు. వారిని ఆదుకునేందుకు నాబార్డు ద్వారా కౌలురైతులందరికీ రుణాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. జిల్లాలో సుమారు 60వేల మంది కౌలు రైతులు ఉండగా, వీరిలే కేవలం 9,413 మందికే రుణ అర్హత కార్డులున్నాయి. అరుునా 90 శాతం మంది రైతులకు రుణాలు అందడంలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో కౌలురైతులకు రుణం లభించే అవకాశముంది. మిగతా రైతులకు సైతం ఎక్కువ స్థాయిలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంకుల ద్వారా దాదాపు రూ.8 లక్షల కోట్ల రుణాలు అందివ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. స్వల్పకాలంలో తీసుకున్న పంట రుణాలను చెల్లిస్తే వడ్డీలో మూడు శాతం రాయితీ ఇస్తామని చెప్పడం రైతులకు కలిసివచ్చే అంశం. పంటలకు ధరల స్థిరీకరణ నిధి పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన తర్వాత ధరలు పతనం కావడంతో రైతులకు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందడంలేదు. ఈ నేపథ్యంలో రూ రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటును బడ్జెట్లో ప్రకటించారు. ధరలు పతనమైన ప్పుడు ఈ నిధితో రైతులను ఆదుకునే అవకాశముంటుంది. ఫలితంగా జిల్లాలో మొక్కజొన్న, పత్తి, పసుపు, జొన్న, సజ్జ, సోయాబీన్, వరి వంటి పంటలు పండించే రైతులకు లాభం చేకూరనుందని రైతు ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ‘ఉపాధి’ లింకు వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించింది. జిల్లాలో 3.13 లక్షల చిన్న, సన్నకారు రైతులుండగా.. వ్యవసాయ పనుల్లో వీరికి కూలీలు దొరకక ఇబ్బందులు పడతున్నారు. జిల్లాలో ఆరు లక్షలకు పైగా ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్నారుు. ఈ కార్మికులను వ్యవసాయం వైపు మళ్లిస్తే మరింత చేయూతనిచ్చిట్టు అవుతుంది. రైతుల్లో చైతన్యం కోసం కిసాన్ టీవీ వ్యవసాయం, వ్యవసాయూధారిత కార్యక్రమాలు, నీటి పరిరక్షణ, ఎరువుల వినియోగంపై ఎప్పటికప్పుడు రైతుల్లో చైతన్యం నింపేందుకు రూ.100 కోట్లతో కిసాన్ టీవీని ఏర్పాటు చేయనున్నట్టు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలోని అన్ని భాషల్లో కిసాన్ టీవీ ప్రసారాలు ఉంటారుు. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేవరకు రైతు చైతన్య కార్యక్రమాలు కొనసాగుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పరిశోధనలు ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో వ్యవసాయ పరిశోధనలను మెరుగైన పరిశోధనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పుణేలో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఉండగా... తాజాగా అస్సోం, జార్ఖండ్‌లో ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటారుుంచారు. దీంతో జిల్లాలోని పొలాస వ్యవ సాయ పరిశోధన స్థానానికీ సహాయ సహకారాలు అందే అవకాశముంది. దీంతోపాటు రూ.56 కోట్లతో భూసార పరీక్ష కేంద్రాలు, రూ.100 కోట్లతో భూనాణ్యత కార్డులు, భూమి లేని 5లక్షల మంది రైతులకు ఆర్థికసాయం, నగరాల్లో రైతు మార్కెట్ల ఏర్పాటు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖర్చు చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది.