సాక్షి, అమరావతి: పంటసాగుదారుల హక్కుల రక్షణ చట్టంతో రైతులకు ఎలాంటి నష్టం ఉండబోదని, రైతుల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగంకానీ, ఆటంకం కానీ వాటిల్లబోదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో కౌలు రైతు హక్కులు, ప్రయోజనాలు నెరవేరుతాయని తెలిపారు. పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదొక విప్లవాత్మక కార్యాచరణ అని కొనియాడారు. చర్చ అనంతరం రాష్ట్ర శాసనసభ ఈ విప్లవాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లు చట్టంగా రూపుదాల్చింది.
సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతు ఫలానా వ్యక్తిని కౌలు రైతు అని చెప్తూ పత్రాలు ఇవ్వడానికి భయపడే పరిస్థితి నెలకొందన్నారు. కౌలు రైతును గుర్తించడానికి రైతు భయపడుతుండటంతో ఇటు కౌలు రైతులూ, అటు రైతులూ నష్టపోతున్నారని తెలిపారు. కౌలు రైతులకు మేలు చేసే ఇటువంటి చట్టాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకువస్తున్నామన్నారు. ఈ చట్టం వల్ల రైతులకు ఎటువంటి అభద్రతాభావం ఉండదని స్పష్టం చేశారు. స్టాంపు పేపర్ ఎంత సులువుగా అందుబాటులో ఉంటుందో.. అంతే సులువుగా ఈ చట్టం కింద కౌలురైతు పత్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రెండువేల జనాభా ఉన్న ప్రతి ఊరు సెక్రటేరియట్‌లోనూ ఈ పత్రం లభిస్తుందని, ఈ పత్రంలో ఒక భాగం కౌలు రైతుల గురించి వివరిస్తుండగా.. మరో భాగం రైతుల గురించి వివరిస్తుందని తెలిపారు. ఈ పత్రంలో భూమి ఎక్కడ ఉంది.. ఆ భూమి వివరాలు ఏమిటి? అన్న వివరాలు నింపితే చాలు అన్నారు. ఇందులో రైతులు భయపడాల్సింది ఏదీ లేదని, ఈ పత్రం కేవలం 11 నెలలు మాత్రమే అమల్లో ఉంటుందని, 11 నెలలు దాటితే.. అది చెల్లదని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం మళ్లీ పంట కౌలుకు ఇవ్వాలంటే మళ్లీ పత్రం చేయించాల్సిందేనని అన్నారు. ఈ చట్టం వల్ల రైతు భయపడాల్సిన అవసరం లేదని, అతనికి ఎటువంటి నష్టం జరగదని తెలిపారు. ఈ చట్టం వల్ల భూముల మీద ఉన్న హక్కులను రైతు ఏ పరిస్థితుల్లోనూ ఏమాత్రం కోల్పోబోడని స్పష్టం చేశారు.
అదేవిధంగా కౌలు రైతుకూ ఈ చట్టం వల్ల మేలు జరుగుతుందని, పంట మీద ఉన్న హక్కులు మాత్రమే ఆ 11 నెలలు కౌలు రైతుకు బదిలీ అవుతాయని తెలిపారు. పంటనష్టం జరగడం, బీమా రాకపోవడం, బ్యాంకు రుణాలు లేకపోవడం వంటి కారణాల వల్ల కౌలు రైతులు ఇప్పటివరకు నష్టపోతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. ఇలా కౌలు పత్రం చేయించినా కూడా రైతులకు వైఎస్సార్ రైతుభరోసా కింద ఏడాదికి రూ. 12,500 వస్తాయని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలైన కౌలురైతులకు రైతుభరోసా పథకం కింద 12,500 వస్తాయని తెలిపారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కౌలురైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కౌలురైతులకు కూడా రైతుభరోసా పథకం వర్తించేలా చట్టం తీసుకొచ్చాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 16 లక్షల మంది కౌలురైతులకు ఏటా ఒకొక్కరికి రూ. 12,500 పెట్టుబడి సాయం అందుతుంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2019
Comments
Please login to add a commentAdd a comment