ప్రతి 10 మందిలో ముగ్గురు పేదలే!
2011-12లో పేదరికంపై రంగరాజన్ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పదిమందిలో ముగ్గురు పేదవారేనని రంగరాజన్ కమిటీ స్పష్టం చేసింది. పేదరికంపై సురేశ్ టెండూల్కర్ కమిటీ అంచనాలను తోసిపుచ్చుతూ.. దేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉందని, 2011-12లో భారతదేశ జనాభాలో 29.5% మంది పేదవారేనని పేర్కొంది.
ఈ మేరకు రూపొందించిన నివేదికను ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్కు సమర్పించింది. టెండూల్కర్ కమిటీ అంచనాల ఆధారంగా ప్రణాళిక సంఘం విడుదల చేసిన పేదరికం వివరాలపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దాంతో టెండూల్కర్ కమిటీ అంచనా విధానాన్ని పునఃపరిశీలించి, పేదరిక అంచనాలపై స్పష్టతనివ్వాలంటూ ప్రభుత్వం గత సంవత్సరం ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం
* నగరాల్లో రోజుకు రూ. 47(నెలకు రూ. 1407) కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నవారిని పేదలుగా గుర్తించారు. టెండూల్కర్ కమిటీ ఆ మొత్తాన్ని రూ. 33గా సూచించింది.
* రూ. 32(నెలకు రూ. 972) కన్నా తక్కువ ఖర్చు చేసేవారిని పేదవారిగా గుర్తించారు.
*2011 -12లో దేశంలో 36.3 కోట్ల మంది పేదలున్నారు.
* 2009-10లో దేశంలో పేదరికం 38.2% ఉంది. అది 2011-12 నాటికి 29.5 శాతానికి తగ్గింది. అదే 2009-10 సంవత్సరంలో టెండూల్కర్ కమిటీ అంచనా ప్రకారం దేశంలో పేదరికం 29.8% ఉంది.