Tenth grade students
-
టెన్షన్ వద్దు
vip రిపోర్టర్ కాగిత శామ్యూల్ ఇన్చార్జి డీఈవో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇన్చార్జి డీఈవో శామ్యూల్ ‘సాక్షి’ విఐపీ రిపోర్టర్‌గా మారారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లె శ్రీవివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పలు సూచనలు ఇచ్చారు. ఇన్చార్జి విద్యాశాఖాధికారి కాగిత శామ్యూల్ జిల్లాలోని సర్కారు బడుల పనితీరు, సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకోవాలన్నారు. అధికారిగా వెళితే ముందుగానే సమాచారం తెలుసుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త పడతారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు తెలియవు. ఆకస్మిక తనిఖీకి వెళ్లినా అక్కడేం జరిగిందనేది పూర్తిగా బయటకు రాదు. విషయం రాబట్టాలంటే రొటీన్‌కు భిన్నంగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. వెంటనే ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారిపోయారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లె శ్రీవివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పదో తరగతి పరీక్షల్లో మెరుగైనా ఫలితాల కోసం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాలలో గడిపారు. పర్యటనలో ఆయన జరిపిన సంభాషణలు.. ప్రజెంటేషన్ : చిట్టెం సుధాకర్, మాడా చంద్రమోహన్ పదో తరగతి తరగతి గది: ఇన్చార్జి డీఈవో : మీ పాఠశాలలో పదో తరగతి సిలబస్ పూర్తయ్యిందా? విద్యార్థిని(గాయత్రి): అన్ని సబ్జెక్టుల్లో సిలబస్ పూర్తి చేశారు. టీచర్లు సబ్జెక్టుల వారీగా రివిజన్ చేస్తున్నారు. ఇన్చార్జి డీఈవో : మీ సెక్షన్లో ఎంతమంది ఉన్నారు? విద్యార్థిని : 52 మంది ఉన్నారు సార్ ఇన్చార్జి డీఈవో: టీచర్లు అన్ని సబ్జెక్టులు అర్థమయ్యేలా చెప్పారా? విద్యార్థిని(లక్ష్మి) : చెప్పారు సార్, ప్రతి రోజూ స్టడీ అవర్స్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి డీఈవో : నీకు ఏ సబ్జెక్టు ఇష్టం? విద్యార్థిని (వాణి ప్రసన్న) : బయాలజీ సార్ ఇన్చార్జి డీఈవో : కష్టమైన సబ్జెక్టు ఏది? విద్యార్థిని : ఫిజిక్స్ సార్ ఇన్చార్జి డీఈవో : ఎందుకు కష్టం? మీసార్లు సరిగా చెప్పడం లేదా ? అర్థం కావడం లేదా? విద్యార్థి(అరవింద్): ఫిజిక్స్‌లో ఫార్ములాలు ఉంటాయి సార్ ఇన్చార్జి డీఈవో: కష్టమైనా ఇష్టంగా చదివితే మంచి మార్కులు వస్తాయి. సరే.. నీవు స్కూలుకు ఎన్ని గంటలకు వస్తావు? విద్యార్థి(అరవింద్) : ఉదయం 6 గంటలకు వచ్చి 7.30 వరకు స్టడీ అవర్స్, మళ్లీ ఇంటికి వెళ్లి 8.30కు వచ్చి సాయంత్రం 7.30 వరకు ఉంటాం. ఇన్చార్జి డీఈవో : ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలులో ఉంటే బోర్ కొట్టదా? విద్యార్థిని(నందిని): ఇంటికి వెళ్లి కొంతసేపు రిలాక్స్ అవుతాం? ఇన్చార్జి డీఈవో : ఇంటికి వెళ్లి టీవీలో సినిమాలు, సీరియల్స్ చూస్తారా? విద్యార్థిని(నందిని) : కొద్దిసేపు చూస్తాం. ఇన్చార్జి డీఈవో : నీవు టీవీలో ఏం చూస్తావు? విద్యార్థిని(భువనేశ్వరి) : న్యూస్ చూస్తాను సార్ ఇన్చార్జి డీఈవో : నీవు ఏం చూస్తావమ్మా? విద్యార్థిని(జోత్స్న): మ్యూజిక్ చానల్లో పాటలు చూస్తాను. ఇన్చార్జి డీఈవో : ఎందుకు చూస్తావు? విద్యార్థిని: రిలాక్స్ కావడానికి మ్యూజిక్ అవసరం సార్ ఇన్చార్జి డీఈవో : నీవు ఎంత సేపు టీవీ చూస్తావు? విద్యార్థి (సునీల్‌కుమార్) : గంటసేపు చ ూస్తాన్ సార్. ఇన్చార్జి డీఈవో : అంతసేపు చూడటం వల్ల పాఠాలపై శ్రద్ధ పోతుంది. కొద్దిసేపు చూసిన తర్వాత పాఠాలు చదవాలి. సీరియల్స్, సినిమాలు కొద్ది రోజులు పక్కన పెట్టండి.రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో, ఇంటికి వెళ్లిన తర్వాత చదువుకోవడంతో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఆరోగ్యం చూసుకుంటే మంచి మార్కులు వస్తాయి. పరీక్షలు రాబోతున్నాయి కదా మీకు భయం లేదా? విద్యార్థి (అరవింద్) : భయంగా ఉంది. మొదటిసారి రాస్తున్నాం కదా సార్. ఇన్చార్జి డీఈవో : అందుకోసమే ఇన్స్పైర్ వంటి కార్యక్రమాలు పెట్టాం. ఇప్పటి నుంచి ఇష్టంగా చదివి బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఇంతకీ ఇన్స్పైర్ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందా? విద్యార్థిని (దుర్గ) : ఉపయోగపడింది సార్. ఇన్చార్జి డీఈవో : ఇన్‌స్పైర్‌కు ఎవరైనా ఎంపికయ్యారా? హెచ్ఎం (శ్రీనివాసులు) : మా విద్యార్థి అరవింద్ జిల్లాలో మొదటి స్థానం వచ్చారు. ఇన్చార్జి డీఈవో : వెరీగుడ్, బాగా చదవాలి. (అంటూ మెమెంటోను విద్యార్థికి అందజేశారు) రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి ఇష్టపడి చదవండి. మంచి మార్కులు సాధిస్తారు. ఆల్ ది బెస్ట్..! ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం ఇన్చార్జి డీఈవో : పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి? హెచ్ఎం (శ్రీనివాసులు) : ఉపాధ్యాయులందరూ కలిసి ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. సబెక్టుల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇన్చార్జి డీఈవో: ఈసారి మంచి ఫలితాలు వచ్చేలా అందరూ కష్టపడాలి. పదో తరగతి విద్యార్థిని తండ్రికి ఫోన్ చేసి.. ‘‘హలో.. నేను డీఈవోను మాట్లాడుతున్నా.. మీ పాప చదివే పాఠశాలలో ఉన్నా. మీ పాప ఎలా చదువుతుందో కనుక్కుంటున్నా.. మీ పాపను బాగా చదివించండి.. టీవీ సీరియల్స్‌ను చూపించకండి.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ఇన్స్పైర్ కార్యక్రమం అమలు చేస్తున్నాం. వెనుబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. గతంలో మదనపల్లె డివిజన్లో మాత్రమే ఇన్స్పైర్ కార్యక్రమం అమలవుతుండగా ఈ ఏడాది జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో పరీక్షలు నిర్వహించాం. ఇందులో ఉత్తమ మార్కులు సాధించిన దాదాపు 800 మంది విద్యార్థులకు సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం’’ డీఈవోతో ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) చైర్మన్.. వెంకటరమణ (ఎస్ఎంసీ చైర్మన్) : సార్ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు అసరానికి సరిపడా లేవు. కేవలం ఆరు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అలాగే విద్యార్థులకు అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. క్రీడా మైదానం అవసరం. ప్రతియేటా పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇన్చార్జి డీఈవో: తప్పకుండా ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తాను. మధ్యాహ్న భోజన వంటగది పరిశీలన ఇన్చార్జి డీఈవో : ఏమ్మా.. ఈ రోజు అన్నం, కూరలు ఏం చేస్తున్నావు? వంట ఏజెన్సీ నిర్వాహకురాలు(భూదేవి) : సార్ అన్నం, బీన్సు సాంబార్ చేస్తున్నాం. ఇన్చార్జి డీఈవో: ఎంతమంది విద్యార్థులకు వండుతున్నావు? ఏజెన్సీ నిర్వాహకురాలు : 1,200 మంది విద్యార్థులకు సార్ ఇన్చార్జి డీఈవో : వారంలో కోడిగుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు? ఏజెన్సీ నిర్వాహకులు : రెండుసార్లు సార్ ఇన్చార్జి డీఈవో: రెండుసార్లు తప్పకుండా ఇవ్వాలి. అన్నం ఇంకా బాగా ఉడకాలి (అన్నం రుచి చూస్తూ).. సాంబారులో ఎంత పప్పు వేశావమ్మ? ఏజెన్సీ నిర్వాహకులు : 7 కేజీలు సార్ ఇన్చార్జి డీఈవో : పప్పు తక్కువ వేశారు. నాణ్యమైన కూరలు ఇవ్వాలి. ఏజెన్సీ నిర్వాహకులు :అలాగే సార్ ఇన్చార్జి డీఈవో : మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. నాణ్యత లేకుంటే క్షమించే ప్రసక్తే లేదు. మజ్జిగ ఇస్తున్నారా? ఏజెన్సీ నిర్వాహకులు : ఇవ్వలేదు సార్. ఇన్చార్జి డీఈవో : వంట చేసేందుకు డబ్బులు అందాయా? ఏజెన్సీ నిర్వాహకులు : లేదు సార్. ఇన్చార్జి డీఈవో : త్వరలో బడ్జెట్ వస్తుంది. అందేలా చర్యలు తీసుకుంటాం. మెను ప్రకారం భోజనం అందించాలి. శుచితో పాటు శుభ్రత పాటించాలి. డీఈవో హామీలు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక నాణ్యతతో కూడిన విద్యే లక్ష్యం తగిన తరగతి గదుల నిర్మాణం -
‘టెన్’షన్
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :పదో తరగతి పరీక్షల ప్రారంభానికి మరో నాలుగు వారాలే మిగిలి ఉం ది. విద్యార్థులు పాఠ్యాంశాల పునశ్చరణకు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. ప్రత్యేక తరగతులు, రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. దీంతో పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు ఆ విద్యార్థుల ఇళ్లలో ఓ విధమైన ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ఉత్తమ స్థానంలో జిల్లాను నిలిపేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. ఇన్విజిలేటర్లు, పరీక్షల నిర్వహణాధికారుల నియామకాలు పూర్తిచేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లు కూడా పూర్తిచేశామని అధికారులు చెప్పారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించే పరీక్షా సమరానికి జిల్లాలో 49వేల 805మంది యోధులు సిద్ధమవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 45వేల 112మందికాగా 4వేల 693మంది ప్రైవేటు అభ్యర్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 22వేల 374మంది, బాలికలు 22వేల 738మంది, ప్రైవేటు విద్యార్థుల్లో బాలురు 3వేల 40మంది, బాలికలు 1,653మంది ఉన్నారు. మొత్తం 239 పరీక్షా కేంద్రాల్లో 216 రెగ్యులర్ విద్యార్థులకు, 23 ప్రైవేట్ అభ్యర్థులకు పరీక్షా కేటాయించారు. గత ఏడాది జిల్లాలో 272 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి తక్కువ మంది పరీక్ష రాస్తున్న 33 కేంద్రాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో ప్రతి విద్యార్థి కృతార్థుడయ్యే అవకాశం: డీఈవో సమైక్యాంధ్ర ఉద్యమంతో విద్యార్థులు పనిదినాలు కోల్పోవటంతో వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని డీఈవో ఆర్.నరసింహరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇవి.. 50రోజుల ప్రణాళికను ప్రతి ఉన్నత పాఠశాలలో పక్కాగా అమలు చేసేలా చూస్తున్నాం. ప్రతీరోజూ స్లిప్టెస్ట్లతోపాటు వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి ప్రగతిని ప్రధానోపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రతి విద్యార్థి పరీక్ష పాసయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లాలో ఏ పరీక్షా కేంద్రంలోను విద్యార్థులు కిందకూర్చుని పరీక్షలు రాసే దుస్థితి తలెత్తకుండా సదుపాయాలు కల్పిస్తాం. పరీక్షల సమయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలను ఇప్పటికే పరిశీలించి ఏర్పాట్లు చేశారు.