‘టెన్’షన్
‘టెన్’షన్
Published Fri, Feb 28 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :పదో తరగతి పరీక్షల ప్రారంభానికి మరో నాలుగు వారాలే మిగిలి ఉం ది. విద్యార్థులు పాఠ్యాంశాల పునశ్చరణకు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. ప్రత్యేక తరగతులు, రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. దీంతో పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు ఆ విద్యార్థుల ఇళ్లలో ఓ విధమైన ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ఉత్తమ స్థానంలో జిల్లాను నిలిపేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు.
ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి
పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. ఇన్విజిలేటర్లు, పరీక్షల నిర్వహణాధికారుల నియామకాలు పూర్తిచేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లు కూడా పూర్తిచేశామని అధికారులు చెప్పారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించే పరీక్షా సమరానికి జిల్లాలో 49వేల 805మంది యోధులు సిద్ధమవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 45వేల 112మందికాగా 4వేల 693మంది ప్రైవేటు అభ్యర్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 22వేల 374మంది, బాలికలు 22వేల 738మంది, ప్రైవేటు విద్యార్థుల్లో బాలురు 3వేల 40మంది, బాలికలు 1,653మంది ఉన్నారు. మొత్తం 239 పరీక్షా కేంద్రాల్లో 216 రెగ్యులర్ విద్యార్థులకు, 23 ప్రైవేట్ అభ్యర్థులకు పరీక్షా కేటాయించారు. గత ఏడాది జిల్లాలో 272 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి తక్కువ మంది పరీక్ష రాస్తున్న 33 కేంద్రాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు.
ప్రత్యేక ప్రణాళికతో ప్రతి విద్యార్థి కృతార్థుడయ్యే అవకాశం: డీఈవో
సమైక్యాంధ్ర ఉద్యమంతో విద్యార్థులు పనిదినాలు కోల్పోవటంతో వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని డీఈవో ఆర్.నరసింహరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇవి.. 50రోజుల ప్రణాళికను ప్రతి ఉన్నత పాఠశాలలో పక్కాగా అమలు చేసేలా చూస్తున్నాం. ప్రతీరోజూ స్లిప్‌టెస్ట్‌లతోపాటు వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి ప్రగతిని ప్రధానోపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రతి విద్యార్థి పరీక్ష పాసయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లాలో ఏ పరీక్షా కేంద్రంలోను విద్యార్థులు కిందకూర్చుని పరీక్షలు రాసే దుస్థితి తలెత్తకుండా సదుపాయాలు కల్పిస్తాం. పరీక్షల సమయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలను ఇప్పటికే పరిశీలించి ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement