terlam
-
చేతులు కట్టేసి డిగ్రీ విద్యార్థిని తోటలో పడేసిన దుండగలు
సాక్షి, విజయనగరం క్రైం: ఇంటికి వెళ్తానని చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరిన డిగ్రీ విద్యార్థిని తెల్లారేసరికి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కిన స్థితిలో రోడ్డుపక్కన పొదల్లో బందీగా కనిపించింది. విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో సోమవారం వేకువజామున ఈ ఘటన వెలుగు చూసింది. జాగింగ్‌కు వెళ్లిన కొందరు యువకులు ఆ యువతిని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి విజయనగరంలోని ప్రైవేట్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫైనలియర్ చదువుతోంది. అనారోగ్య కారణాల వల్ల తన స్వగ్రామానికి వెళ్తానని వార్డెన్‌కు చెప్పిన ఆ యువతి శనివారం సాయంత్రం కళాశాలలోని హాస్టల్ నుంచి బయలుదేరింది. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా రాజాం మీదుగా తన ఊరెళ్లేందుకు ఓ ప్రైవేటు వాహనం ఎక్కింది. ఆ తరువాత ఏమైందో గానీ సుమారు 36 గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున గుర్లలో అంతుచిక్కని పరిస్థితుల్లో కనిపించింది. ఆ మార్గంలో జాగింగ్ చేస్తున్న వారికి పొదల్లోంచి మూలుగులు వినబడటంతో వెళ్లి చూడగా ఓ యువతి అచేతన స్థితిలో కనిపించటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె చేతులు, కాళ్లకు ఉన్న కట్లను విప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ పి.అనిల్‌కుమార్, సీఐ మంగవేణి విచారణ చేసినప్పటికీ ఆ యువతి నోరు విప్పలేదు. యువతి షాక్‌కు గురవ్వడం వల్ల నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్నేహితులతో ఆటోలో.. యువతి ప్రైవేట్ వాహనంలో ఎక్కడకు వెళ్లిందన్న విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరంలోని ప్రధాన కూడళ్లలో గల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం బస్ కాంప్లెక్స్ వద్ద ఆ యువతి ప్రైవేటు వాహనం ఎక్కి కోట వద్ద దిగిందని ఎస్పీ రాజకుమారి తెలిపారు. అక్కడి నుంచి స్నేహితులతో కలిసి ఓ ఆటోలో గుర్ల వరకు ప్రయాణించినట్టు గుర్తించామని చెప్పారు. 2016లో ఆ యువతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు రాగా.. హైదరాబాద్‌లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. తనకు మూర్ఛ రోగం ఉండటంతో ఏమీ గుర్తుకు రావడం లేదని ఆ యువతి చెబుతోందన్నారు. విచారణను వేగవంతం చేసి అసలు విషయాన్ని తెలుసుకుంటామన్నారు. రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ఇదిలావుండగా.. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశామని, రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపిస్తున్నామని అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు తెలిపారు. బాధిత యువతి ప్రతి వారం కాళీ ఘాట్ కాలనీలో ఉంటున్న చిన్నాన్న ఇంటికి వెళ్తుంటుందని చెప్పారు. యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, వైద్యులు నుంచి అందే నివేదికల ఆధారంగానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆయన వెంట దిశ డీఎస్పీ త్రినాథ్ ఉన్నారు. -
8 గంటల్లో ఆరోగ్యశ్రీ కార్డు
తెర్లాం (బొబ్బిలి): గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంగా మారింది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణికి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం కావడంతో అత్యవసరంగా రూపొందించి 8 గంటల వ్యవధిలో నేరుగా ఆస్పత్రికి రాత్రి 11 గంటల సమయంలో అందించిన ఉద్యోగులు అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాలివీ.. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన పైల ధనలక్ష్మి ప్రసవం కోసం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కేర్ ఆస్పత్రిలో గురువారం ఉదయం చేరింది. ఆమెకు ప్రసవం చేసేందుకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమని, దానిని వెంటనే తీసుకురావాలని అక్కడి వైద్యులు తెలిపారు. ధనలక్ష్మికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కుటుంబ సభ్యులు విజయరాంపురం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసి పరిస్థితిని సచివాలయ అధికారులకు తెలియజేశారు. స్పందించిన డిజిటల్ అసిస్టెంట్ కె.రామ్మోహన్ ఆరోగ్యశ్రీ కార్డును 8 గంటల వ్యవధిలో మంజూరు చేసి, దానిని గ్రామ వలంటీర్ వెంకటరమణతో కలిసి గురువారం రాత్రి 11 గంటల సమయంలో రాజాంలోని కేర్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లి గర్భిణికి అందజేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న సచివాలయ అధికారులు, సిబ్బందికి ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీవో శంబంగి రామకృష్ణ సచివాలయ సిబ్బందిని అభినందించారు. -
రెవెన్యూ అధికారులకు నోటీసులు
తెర్లాం రూరల్ : సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం సకాలంలో సక్రమంగా ఇవ్వనందున తెర్లాం తహశీల్దార్ యు.రాజకుమారికి, పార్వతీపురం ఆర్డీఓ ఆర్.గోవిందరావుకు సమాచార హక్కు చట్టం కమిషనర్ నుంచి నోటీసులు అందాయని ఫిర్యాదుదారుడు కె.ధనప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పెరుమాళి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 29లో గల యర్ర చెరువులోని అక్రమణదారుల వివరాలు కావాలని కోరగా, సరైన వివరాలు అందివ్వలేదన్నారు. దీంతో తాను సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో ఆయన ఈ నెల 29న జెడ్పీ సమావేశ మందిరంలో చేపట్టననున్న విచారణకు హాజరుకావాలని తనతో పాటు తహశీల్దార్, ఆర్డీఓలకు నోటీసులు పంపించారని చెప్పారు. -
లారీ ఢీకొని విద్యార్థి మృతి
తెర్లాం: అతి వేగంగా వెళ్తున్న లారీ పాఠశాలకు వెళ్తున్న ఓ బాలున్ని ఢీకొట్టింది. దీంతో బాలుడు లారీ వెనక చక్రాల కింద నలిగిపోయాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాలి జంక్షన్ దగ్గర శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. తెర్లాం మండలం జగన్నాధవలస గ్రామానికి చెందిన చౌడవాడ కామేశ్వర్రావు(12) పెరుమాళి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సైకిల్‌పై పాఠశాలకు వెళ్తున్న బాలుడు పెరుమాళి జంక్షన్ వద్దకు చేరుకోగానే రాజాం నుంచి రామభద్రాపురం వె ళ్తున్న లారీ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ కింద పడిపోయిన కామేశ్వర్రవు పై నుంచి లారీ వెనక చక్రాలు పోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న బాలుడు ప్రమాదానికి గురయ్యాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.